Flower Plants Care: పూలు ఎక్కువగా పూయాలంటే
ABN, Publish Date - Sep 11 , 2025 | 02:31 AM
మనం పూల మొక్కలను చాలా శ్రద్ధగా పెంచుతూ ఉంటాం. రెండు, మూడు పూలు పూసినా తెగ సంతోషపడిపోతుంటాం. కానీ ఒక్కోసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మొక్కలకు...
మనం పూల మొక్కలను చాలా శ్రద్ధగా పెంచుతూ ఉంటాం. రెండు, మూడు పూలు పూసినా తెగ సంతోషపడిపోతుంటాం. కానీ ఒక్కోసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మొక్కలకు పూలు పూయవు. అలాంటప్పుడు గుత్తులు గుత్తులుగా పూలు రావడానికి ఏమి చేయాలో తెలుసుకుందాం...
పూల మొక్కలకు పాలు మంచి ఎరువుగా పనిచేస్తాయి. పాలలోని కాల్షియం, ప్రోటీన్లు మొక్కలకు బలాన్ని అందిస్తాయి. ఒక లీటరు నీటిలో రెండు చెంచాల పాలు కలిపి మొక్కల మొదట్లో పోస్తే వారం రోజుల్లో ఫలితం కనిపిస్తుంది.
వాతావరణ మార్పుల వల్ల రకరకాల ఫంగ్‌సలు, క్రిమి కీటకాలు చేరి మొక్కలను బలహీనపరుస్తాయి. వీటిని నివారించేందుకు లీటరు నీళ్లలో మూడు చుక్కల వేప నూనె లేదా వంట నూనె కలిపి మొక్కల కాండం, ఆకుల మీద పిచికారీ చేయాలి. దీంతో మొక్కలు ఆరోగ్యంగా ఎదిగి చక్కగా పూలు పూస్తాయి.
కోడి గుడ్డు పెంకులను చేత్తో నలిపి చూరలా చేయాలి. ఒక మగ్గు నీళ్లలో ఈ చూర వేసి గంటసేపు నాననిచ్చి వడబోయాలి. ఈ నీటిని కొద్దికొద్దిగా మొక్కలకు అందించాలి. తరచూ ఇలా చేస్తూ ఉంటే మొక్కలకు సరైన పోషకాలు అంది గుత్తులుగా పూలు పూస్తాయి.
మొక్కలకు బాగా ఎండ తగిలేలా చూసుకోవాలి. మట్టి తడారిపోకుండా నీళ్లు పోస్తూ ఉండాలి. నెలకోసారి సేంద్రీయ ఎరువులను అందించాలి. మొక్కల చుట్టూ ఉన్న మట్టిని తరచూ కదుపుతూ ఉండాలి.
ఎండిపోయిన ఆకులు, కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండాలి. నర్సరీల నుంచి మొక్కలు తెచ్చి నాటిన తరువాత వాటికి ఉన్న పూలను తీసివేయాలి. అప్పుడే కొత్త ఇగుర్లు వచ్చి మొగ్గలు విరబూస్తాయి.
పండ్లు, కూరగాయలకు సంబంధించిన వ్యర్థాలు; ఉల్లిపాయ తొక్కలు, ఎండిన ఆకులను మొక్కల మొదట్లో మట్టి కింద వేస్తూ ఉండాలి. వాడేసిన టీ పొడిలో నీళ్లు పోసి వడకడితే అందులోని చక్కెర తొలగిపోతుంది. దీన్ని మొక్కలకు ఎరువుగా వేసినా మంచి ఫలితం కనిపిస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..
Updated Date - Sep 11 , 2025 | 02:31 AM