Anil Kumar Singal: పూర్వ జన్మ సుకృతం.. అందుకే..
ABN , Publish Date - Sep 10 , 2025 | 02:42 PM
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన తిరుమలలో శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు.
తిరుమల, సెప్టెంబర్ 10: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన అలిపిరి మార్గంలో కాలినడకన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకుని.. ఆనంద నిలయం కొలువ తీరిన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అనిల్ కుమార్ సింఘాల్‌కు టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ.. తాను టీటీడీ ఈవోగా రెండో సారి బాధ్యతలు చేపట్టడం పూర్వ జన్మ సుకృతమని పేర్కొన్నారు. తనకు మరోసారి ఈవోగా పని చేసే అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈవోగా రెండోసారి బాధ్యతలు చేపట్టడంతో తనపై బాధ్యత మరింత పెరిగిందని స్పష్టం చేశారు. కాలినడకన తిరుమలకు వచ్చే సమయంలో భక్తుల నుంచి తాను ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు వివరించారు. హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత విసృత్తంగా నిర్వహిస్తామని చెప్పారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. టీటీడీలోని అన్ని విభాగాల సిబ్బంది చిత్త శుద్ధితో పని చేస్తూ.. భక్తులకు సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. భక్తులకు మెరుగైన సేవలందిస్తున్నా..ఇంకా మార్పులు చేసి సేవలందించాల్సి ఉందన్నారు. తమకు అందుతున్న సేవల పట్ల టీటీడీకీ భక్తులు ఫీడ్ బ్యాక్ ఇస్తే.. వారీ సూచనల మేరకు మరింత మెరుగైన సేవలందిస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్ అధికారులను ఇటీవల ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమించింది. టీటీడీ ఈవోగా ఇప్పటి వరకు ఆ స్థానంలో విధులు నిర్వహిస్తున్న శ్యామలరావును సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా నియమించింది. అయితే 2014లో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది. ఆ సమయంలో టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్‌ను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. మళ్లీ మరోసారి ఆయన ఈ బాధ్యతలు చేపట్టడంతో.. అనిల్ కుమార్ సింఘాల్ పై విధంగా స్పందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాష్ట్రంలో చంద్రన్నతోనే అభివృద్ధి సాధ్యం..
నేపాల్ సంక్షోభం.. తెలంగాణ హెల్ప్‌లైన్ నెంబర్లు ఇవే..
For More AP News And Telugu News