CP Radhakrishnan: ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..
ABN , Publish Date - Sep 10 , 2025 | 03:17 PM
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. ఆయన ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖారారు అయింది. అందుకోసం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. ఆయన ఉపరాష్ట్రపతి బాధ్యతలు చేపట్టేందుకు ముహూర్తం ఖరారు అయిందని తెలుస్తోంది. సెప్టెంబర్ 12వ తేదీన సీపీ రాధాకృష్ణన్ 15వ భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉపరాష్ట్రపతి చేత భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అందుకోసం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి.
భారత ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ దన్‌ఖడ్ రాజీనామా చేశారు. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఆ క్రమంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను రంగలోకి దింపారు. అలాగే ప్రతిపక్ష ఇండి కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డిని బరిలో దింపారు. సెప్టెంబర్ 9వ తేదీన జరిగిన ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ 148 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా.. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పోలయ్యాయి. ఇక బీఆర్ఎస్, బీజేడీ, ఎస్ఎల్‌డీలు ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. మరోవైపు మహారాష్ట్ర గవర్నర్ పదవికి సీపీ రాధాకృష్ణన్ మరికొన్ని గంటల్లో రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.