Sayami Kher Ironman: సయామీ మన ఐరన్‌మ్యాన్
ABN, Publish Date - Sep 14 , 2025 | 05:49 AM
కష్టపడే తత్వం... అంకితభావం ఉంటే ఎంతటి లక్ష్యమైనా చేరుకోవచ్చని నిరూపించిన మహిళ సయామీ ఖేర్. విలక్షణమైన పాత్రలతో నటిగా అలరిస్తూనే... అలుపెరుగని కృషితో అథ్లెట్‌గానూ అదరగొడుతోంది...
సెలబ్ ఫిట్
కష్టపడే తత్వం... అంకితభావం ఉంటే ఎంతటి లక్ష్యమైనా చేరుకోవచ్చని నిరూపించిన మహిళ సయామీ ఖేర్. విలక్షణమైన పాత్రలతో నటిగా అలరిస్తూనే... అలుపెరుగని కృషితో అథ్లెట్‌గానూ అదరగొడుతోంది. కఠినమైన ‘ఐరన్‌మ్యాన్’ రేస్‌ను పూర్తి చేసిన మొట్టమొదటి భారతీయ నటిగా చరిత్ర సృష్టించిన సయామీ... నవతరానికి మార్గదర్శిగానూ నిలుస్తోంది.
‘భారత మహిళలు కుటుంబం, ఉద్యోగం, పిల్లల కోసం శ్రమిస్తారు. కానీ తమ గురించి తాము మరిచిపోతారు. వ్యక్తిగత ఆరోగ్యాన్ని ఏమాత్రం పట్టించుకోరు. అత్యధిక శాతంమంది పరిస్థితి ఇదే. ఒక మహిళ తన ఆరోగ్యకర జీవన శైలిపై దృష్టి పెడితే... ఆ ప్రభావం ఆమె చుట్టూ ఉన్నవారిపై కూడా పడుతుందనేది నా నమ్మకం. నడక, నాట్యం, యోగా... ఏదైనా కావచ్చు, రోజుకు కనీసం ఓ అరగంట కేటాయిస్తే చాలు... శారీరకంగా, మానసికంగా దృఢంగా మారతారు. తత్ఫలితంగా ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటారు’... అంటున్న సయామీ ఖేర్ నిత్యం తన అభిమానులను ఫిట్‌నెస్ వైపు నడిపించే ప్రయత్నం చేస్తుంటుంది. నటిగా, క్రీడాకారిణిగా... రెండిటికీ సమప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది.
అతడి తరువాత...
ఎంతో క్లిష్టమైన ‘ఐరన్‌మ్యాన్ 70.3’ రేస్‌ను పూర్తి చేసిన తొలి భారత నటిగా సయామీ గత ఏడాది చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది అదే ఫీట్‌ను మరోసారి సాధించి తన ఫిట్‌నె్‌సకు తిరుగులేదని నిరూపించింది. ఆమె కంటే ముందు నటుడు, మోడల్ మిలింద్ సోమన్ దీన్ని పూర్తి చేశాడు. ‘ఐరన్‌మ్యాన్’ రేస్‌ను ‘వరల్డ్ ట్రయథ్లాన్ కార్పొరేషన్’ (డబ్ల్యూటీసీ) నిర్వహిస్తుంది. ఇందులో 1.2 మైళ్లు స్విమ్మింగ్, 56 మైళ్లు సైక్లింగ్, 13.1 మైళ్లు రన్నింగ్ ఉంటాయి. మొత్తం కలిపి 70.3 మైళ్లు. ‘నటులకు క్రీడల్లో పాల్గొనడం అంత సులువు కాదు. విభిన్న లొకేషన్లకు వెళుతుంటాం. షూటింగ్ సమయాలు అందుకు అనుకూలించవు. అదే ఉద్యోగం అయితే ఆఫీ్‌సకు వేళలు ఉంటాయి. కానీ ఇక్కడ అలా కుదరదు. కొన్నిసార్లు విరామం లేకుండా రోజుల తరబడి వరుస షెడ్యూల్స్ చేయాల్సి వస్తుంది. నైట్ షిఫ్ట్స్ సరేసరి. ఈ పరిస్థితుల్లో క్రీడల్లో కొనసాగడం పెద్ద సవాలు. శరీరాన్ని ఎంతో కష్టపెట్టాలి. నేను షూటింగ్ నుంచి నేరుగా సాధన కోసం మైదానానికి వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. చిన్నప్పటి నుంచీ ఆటలపై మక్కువ నన్ను నడిపిస్తోంది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన సయామీ... తనను చూసి మరింతమంది మహిళలు స్ఫూర్తి పొందుతారని ఆశిస్తోంది. ఇదొక్కటే కాదు... మారథాన్‌లోనూ ఆమె పోటీపడుతోంది. పాత్రకు తగినట్టు తన ఆకృతిని మార్చుకోవడానికి వెనకాడని సయామీ... 2015లో విడుదలైన ‘రేయ్’ చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత ‘మిర్జా, చోక్‌డ్, అన్‌పా్‌సడ్, హైవే, వైల్డ్ డాగ్, ఘూమర్, శర్మాజీ కీ బేటీ’ తదితర సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించింది. ఆ మధ్య విడుదలైన ‘జాట్’లో పోలీస్ అధికారిగా మెప్పించింది. మహారాష్ట్ర నాసిక్‌లో పుట్టిన ఆమె తండ్రి అద్వైత్ ఖేర్ మోడల్. తల్లి ఉత్తర 1982లో ‘మిస్ ఇండియా’. అక్క సాంస్కృతి మరాఠీ నటి. ముంబయి సెయింట్ జేవియర్స్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందిన సయామీ... పలు టెలివిజన్ షోలలో కూడా మెరిసింది.
శరీరం చెప్పింది వింటా...
‘ఒక్కోసారి తీవ్రమైన పతి ఒత్తిడిని మన శరీరం తట్టుకోలేదు. అలాంటప్పుడు వ్యాయామాలు, డైటింగ్ పేరిట దాన్ని కష్టపెట్టడం సరైంది కాదు. అందుకే నేను నా శరీరం చెప్పింది వింటాను. దానికి అనుగుణంగానే నా షెడ్యూల్స్ నిర్ణయించుకొంటాను. శరీరానికి బాగా శ్రమ ఇచ్చానని అనుకున్నప్పుడు పూర్తిగా విశ్రాంతి తీసుకొంటా. నాకు నచ్చిన ఐస్‌క్రీమ్, చాక్లెట్లు తింటా. గత నెలలో ఐరన్‌మ్యాన్ రేస్ తరువాత శీతల సరస్సులో ఈత కొట్టాను. అది ఐస్‌బాత్‌లా పని చేసింది’ అంటున్న సయామీ... అవసరాన్ని బట్టి జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుంది.
ఇవి కూడా చదవండి..
Congress AI Video On PM Mother: మోదీ తల్లిపై కాంగ్రెస్ వివాదాస్పద ఏఐ వీడియో.. బీజేపీ ఫైర్
Vijay Statewide Tour: రాజుల తరహాలోనే ప్రజాస్వామ్య యుద్ధానికి ముందు మీ ముందుకొచ్చా
For More National News and Telugu News
Updated Date - Sep 14 , 2025 | 05:50 AM