Vijay Statewide Tour: రాజుల తరహాలోనే ప్రజాస్వామ్య యుద్ధానికి ముందు మీ ముందుకొచ్చా
ABN , Publish Date - Sep 13 , 2025 | 08:24 PM
బీజేపీ విధానాలపై విజయ్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో మోసపుచ్చేందుకు 'ఒకే దేశం, ఒకే ఎన్నిక' అనే స్కీమ్‌ను ఆ పార్టీ తెచ్చిందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన అనేది 'పెద్ద కుట్ర' అని అభివర్ణించారు.
తిరుచిరాపల్లి: ఒకప్పుడు రాజులు యుద్ధానికి వెళ్లే ముందు ఆలయాల్లో ప్రార్థనలు చేసేవారని, ఆ విధంగానే తాను సైతం 2026 ప్రజాస్వామిక యుద్ధానికి (democratic battle of 2026) సన్నాహకంగా ప్రజలను కలిసేందుకు వచ్చానని తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) చీఫ్ విజయ్ (Vijay) అన్నారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి (Tiruchirapalli) నుంచి శనివారం నాడు రాష్ట్రవ్యాప్త పర్యటనను ఆయన ప్రారంభించారు. కేంద్రంలోని బీజేపీ, తమిళనాడులోని అధికార డీఎంకేపై విమర్శలు గుప్పించారు. ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో ఆ పార్టీలు విఫలమయ్యాయని, రాష్ట్ర ప్రజలను అనేక రకాలుగా మోసగించాయని అన్నారు. ప్రజలను బాధించే బీజేపీని కానీ, మోసగించే డీఎంకేను కానీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు.
బీజేపీ విధానాలపై నిశిత విమర్శలు
బీజేపీ విధానాలపై విజయ్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో మోసపుచ్చేందుకు 'ఒకే దేశం, ఒకే ఎన్నిక' (One Nation, One Election) అనే స్కీమ్‌ను ఆ పార్టీ తెచ్చిందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన (Delimitaiton) అనేది 'పెద్ద కుట్ర' అని అభివర్ణించారు. ఇందువల్ల దక్షిణ భారతదేశానికి రాజకీయ బలం తగ్గిపోతుందన్నారు.
నిధుల్లో మొండిచేయి
తమిళనాడు విద్యార్థులకు కేంద్రం నిధులు ఇవ్వడానికి నిరాకరిస్తోందని, తమిళనాడులోని ద్విభాషా విధానానికి వ్యతిరేకంగా హిందీ, సంస్కృతాన్ని రుద్దే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాల నిధులు సక్రమంగా విడుదల చేయడంలోనూ బీజేపీ ప్రభుత్వం విఫలమైందని, తమిళ మత్స్యకారులపై శ్రీలంక నావికాదళం దాడులు చేస్తున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నీట్ మెడికల్ పరీక్షల వివాదం వల్ల విద్యార్థులు పడుతున్న ఆవేదనను ఖాతరు చేయడం లేదనీ విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వంచనకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమేనని అన్నారు.
అమలుకు నోచుకుని వాగ్దానాలు
తమిళనాడును బీజేపీ వంచిస్తుంటే, డీఎంకే సొంత ప్రజలనే మోసగిస్తోందని విజయ్ ఆరోపించారు. డీఎంకే ఎన్నికలకు ముందు ఇచ్చిన 505 హామీల్లో కేవలం నాలుగో వంతు మాత్రమే నేరవేర్చిందన్నారు. రూ.100 ఎల్పీజీ సబ్సిడీ, నీట్ రద్దు, విద్యార్థుల రుణాల రద్దు, ఏటా 10 లక్షల ఉద్యోగాల కల్పన, పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ, మహిళలకు ఉద్యోగాల్లో 40 శాతం రిజర్వేషన్, 3 లక్షల ఖాళీల భర్తీ, మత్స్యకారులు-నేత కార్మికులు-ఆటో డ్రైవర్లు, టీచర్ల బెనిఫిట్లు, రేషన్ సరఫరా మెరుగుపరడం, వృద్ధాప్య పెన్షన్ల పెంపు వంటి హామీలు ఇప్పటికీ నేరవేరనే లేదన్నారు. తమిళనాడును బీజేపీ ప్రభుత్వం మోసగిస్తే, స్టాలిన్ ప్రభుత్వం తమిళుల నమ్మకాన్ని వమ్ము చేసిందన్నారు.
టీవీకే తప్పుడు హామీలివ్వదు
ప్రజలకు తమ పార్టీ తప్పుడు హామీలు ఇవ్వదని, ఆచరణకు సాధ్యమైన హామీలు మాత్రమే ఇస్తుందని విజయ్ స్పష్టం చేశారు. కనీస సౌకర్యాలైన విద్య, రేషన్, హెల్త్‌కేర్, విద్యుత్, రోడ్లు, తాగునీరు వంటి సౌకర్యాలను ఎలాంటి రాజీ లేకుండా ప్రజలకు కల్పిస్తామని చెప్పారు. మహిళల భద్రత, శాంతి భద్రతలపై పూర్తి దృష్టి సారిస్తామని భరోసా ఇచ్చారు. పేదరికం లేని, కుటంబ ఆధిపత్యం లేని, అవినీతి రహిత తమిళనాడు తమ లక్ష్యమని స్పష్టం చేశారు. 'విజయం తథ్య.. మంచే మాత్రమే జరుగుతుంది' అని విజయ్ అన్నారు.
ఇవి కూడా చదవండి
మణిపూర్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకువస్తాం.. మోదీ భరోసా
బైరబీ-సైరాంగ్ రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని
For More National News and Telugu News