PM Modi in Manipur: మణిపూర్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకువస్తాం.. మోదీ భరోసా
ABN , Publish Date - Sep 13 , 2025 | 03:04 PM
చురాచంద్‌పూర్‌లో రూ.7,300 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. వీటిలో మణిపూర్ అర్బన్ రోడ్లు, డ్రైనేజీలు, అస్సెట్ మేనేజిమెంట్ ఇన్వాల్వ్‌మెంట్ ప్రాజెక్టు, 5 నేషనల్ హైవే ప్రాజెక్టులు, మణిపూర్ ఇన్ఫోటెక్ డవలప్‌మెంట్ (MIND) ప్రాజెక్టు, తొమ్మిది ప్రాంతాల్లో వర్కింగ్ ఉమన్ హాస్టళ్లు ఉన్నాయి.
ఇంఫాల్: భారతదేశ ప్రగతికి మణిపూర్ (Manipur) కీలక స్తంభమని, ధైర్యవంతులు, దృఢసంకల్పానికి ప్రతీక ఈనేల అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. ఇక్కడి కొండలు వెలకట్టలేని ప్రకృతి వరప్రసాదమని, ప్రజల కఠోర పరిశ్రమకు సంకేతాలని కొనియాడారు. మణిపూర్ ప్రజల స్ఫూర్తికి సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. మణిపూర్‌లో నూతన ఉషోదయం ప్రారంభం కానుందని, ప్రజలు శాంతి మార్గాన్ని ఎంచుకున్నారని, వారికి కేంద్రం బాసటగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. మణిపూర్‌లో శనివారంనాడు పర్యటిస్తున్న ప్రధాని జాతుల ఘర్షణలకు కేంద్రమైన చురాచంద్‌పూర్‌లో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. 2023లో ఘర్షణల తర్వాత రెండేళ్లకు ప్రధాని రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. శాంతిభద్రతల పునరుద్ధరణకు కేంద్రం కట్టుబడి ఉందని బాధిత కుటుంబాలకు ప్రధాని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
చురాచంద్‌పూర్‌లో రూ.7,300 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. వీటిలో మణిపూర్ అర్బన్ రోడ్లు, డ్రైనేజీలు, అసెట్ మేనేజ్‌మెంట్ ఇన్వాల్వ్‌మెంట్ ప్రాజెక్టు, 5 నేషనల్ హైవే ప్రాజెక్టులు, మణిపూర్ ఇన్ఫోటెక్ డవలప్‌మెంట్ (MIND) ప్రాజెక్టు, తొమ్మిది ప్రాంతాల్లో వర్కింగ్ ఉమన్ హాస్టళ్లు ఉన్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ, మణిపూర్‌ను అభివృద్ధి బాట పట్టిస్తామని చెప్పారు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ఇక్కడకు వచ్చిన ప్రజల ప్రేమకు తాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. భారీ వర్షాల కారణంగా హెలికాప్టర్‌లో రాలేకపోయానని, రోడ్డు మార్గంలో వచ్చానని చెప్పారు. అదికూడా మంచిదే అయిందని, మణిపూర్ యువకులు, పెద్దలు తమ చేతుల్లో త్రివర్ణ పతాకాలతో కనిపించారని, ఈ క్షణాలను తాను జీవితంలో మరిచిపోలేని అన్నారు.
'మణిపూర్‌ను అభివృద్ధి బాట పట్టించేందుకు ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోంది. అదే స్ఫూర్తితో ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. కొద్ది సేపటి క్రితమే ఇదే వేదిక నుంచి రూ.7,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించాను. ఈ ప్రాజెక్టులతో మణిపూర్ ప్రజలు, మన గిరిజన తెగల ప్రజల జీవితాలు గణనీయంగా మెరుగుపడతాయి' అని మోదీ భరోసా ఇచ్చారు. మణిపూర్ పేరులోనే మణి ఉందని, భవిష్యత్తులో యావత్ ఈశాన్య ప్రాంతాన్ని ఈ మణి ఉజ్వలంగా ప్రకాశింపజేస్తుందని, రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. అభివృద్ధికి శాంతి కీలకమని, మీ పిల్లల అభివృద్ధి కోసం శాంతి మార్గంలో పయనించాలని కోరుతున్నానని అన్నారు. మణిపూర్‌లో రైల్వే, రోడ్ల అనుసంధానానికి బడ్జెట్ కేటాయింపులు పెంచామని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
బైరబీ-సైరాంగ్ రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని
శబరి ఆలయంలో ద్వారపాలక విగ్రహాల బంగారు తాపడం తొలగింపు
For More National News and Telugu News