ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Roshini Parveen Story: బాలికల భవిష్యత్తుకు భరోసా

ABN, Publish Date - Aug 20 , 2025 | 01:37 AM

పద్నాలుగేళ్ళకే పెళ్ళి... మరో ఏడాదికే బిడ్డ బాధ్యతలు... నిత్యం భర్త వేధింపులు... అన్నిటినీ తట్టుకొని, పరిస్థితులకు ఎదురుతిరిగారు రోషిణీ పర్వీన్‌. మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోవడంతో పాటు...

పద్నాలుగేళ్ళకే పెళ్ళి... మరో ఏడాదికే బిడ్డ బాధ్యతలు... నిత్యం భర్త వేధింపులు... అన్నిటినీ తట్టుకొని, పరిస్థితులకు ఎదురుతిరిగారు రోషిణీ పర్వీన్‌. మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోవడంతో పాటు... బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను చాటి చెబుతూ బాలికలను అప్రమత్తం చేస్తున్నారు. ఆమె అవిశ్రాంత కృషి అంతర్జాతీయంగా ప్రశంసలు పొందుతోంది...

‘‘బిహార్‌ రాష్ట్రంలోని సిమల్‌బరీ అనే చిన్న గ్రామం మాది. నిరుపేద కుటుంబం అయినప్పటికీ... ఆ ఇబ్బందులేవీ తెలియకుండా ఆడుతూ పాడుతూ పెరిగాను. కానీ నాకు పధ్నాలుగేళ్ళ వయసున్నప్పుడు... పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. అప్పుడు నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను. మా అమ్మా నాన్నా నాకు పెళ్ళి చెయ్యాలని ప్రయత్నం మొదలుపెట్టారు. అప్పుడే పెళ్ళి వద్దనీ, నాకు చదువుకోవాలని ఉందని మొత్తుకున్నాను. కానీ వాళ్ళు వినలేదు. టెన్త్‌లోకి వచ్చీ రాగానే నాకు వివాహం చేశారు. నా భర్త వయసు నలభై అయిదేళ్ళు. అంటే నా వయసుకన్నా మూడింతలు ఎక్కువ. ఎంతో సంకోచంతో అత్తింట్లోకి అడుగుపెట్టాను. ఆ మరునాటి నుంచే నరకం అంటే ఏమిటో నాకు అనుభవంలోకి వచ్చింది. నా భర్త నన్ను అనుక్షణం వేధించేవాడు. అనుమానంతో కొట్టేవాడు. ఆ బాధలు భరించలేక మూడు నెలలకే అక్కడ్నించి పారిపోయి... పుట్టింటికి వచ్చాను. కొన్నాళ్ళకే... నేను గర్భవతినని తెలిసింది. ఆ రోజు ఎంతో విలపించాను.

సంబంధం లేదని తరిమేశాడు...

నేను ప్రసవించి, మగబిడ్డను కన్నాను. ఆ తరువాత మావాళ్ళు మళ్ళీ నన్ను నా భర్త ఇంటికి పంపించారు. దాదాపు ఏడాదిపాటు తనకు దూరంగా ఉన్న నన్ను ఇంటికి రానిచ్చేది లేదని అతను చెప్పాడు. అంతేకాదు, తనకూ, నాకూ ఎలాంటి సంబంధం లేదని తరిమేశాడు. మరోవైపు సమాజం నుంచి వెక్కిరింపులు మొదలయ్యాయి. నా పుట్టింటివారి స్థోమత అంతంతమాత్రం. నన్ను, నా బిడ్డను చంపుకోవాలా? లేదా పరిస్థితులకు ఎదురు నిలిచి పోరాడాలా? రెండో మార్గాన్నే ఎంచుకున్నాను. ఒక షోరూంలో పనిలో చేరాను. అప్పుడే ‘ఛైల్డ్‌ లైన్‌ ఇండియా ఫౌండేషన్‌’ అనే సంస్థ ప్రతినిధులతో పరిచయం అయింది. అంతదాకా ఎంతో న్యూనతతో ఉండేదాన్ని. కానీ నాచుట్టూ నాలాంటివారు ఎందరో కనిపించారు. మా రాష్ట్రంలో... ప్రతి అయిదుగురు మహిళల్లో ఇద్దరికి... పద్దెనిమిదేళ్ళు రాకముందే వివాహం జరుగుతోందన్న వాస్తవాన్ని ‘నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే’ (ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎ్‌స) నివేదికలు వెల్లడించాయి. కానీ అంత చిన్న వయసులో వివాహితలైన బాలికల దుస్థితిని సమాజం ఎందుకు పట్టించుకోవడం లేదు? కనీసమైన చదువు లేకుండా, భర్తల నుంచి, అత్తింటి వారి నుంచి నిరంతర వేధింపులను సహిస్తూ, సమాజం విధించే ఆంక్షలను భరిస్తూ రాలిపోతున్న మహిళలు ఎంతోమంది ఉన్నారు. దీనికంతటికీ కారణం బాల్య వివాహాలు. అందుకే వాటికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిశ్చయించుకున్నాను. ‘సేవ్‌ ది చైల్డ్‌’, ‘యునిసెఫ్‌’ లాంటి సంస్థల భాగస్వామ్యంతో గ్రామ గ్రామానికి తిరిగి... బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కలిగించడం ప్రారంభించాను.

బాలికల బృందాల ఏర్పాటు...

గత రెండేళ్ళలో దాదాపు అరవైకి పైగా బాల్య వివాహాలను స్వయంగా ఆపగలిగాను. కొన్ని వేల మంది బాలికల్లో చైతన్యాన్ని తీసుకువచ్చాను. దీనికి స్థానిక ప్రజాప్రతినిధుల సాయం తీసుకున్నాను. నేను, మరికొందరు కార్యకర్తలు కలిసి... ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతోందని తెలిస్తే... అక్కడికి వెళ్ళి, వధువు తల్లితండ్రులకు నచ్చజెప్పి వాటిని నిరోధిస్తున్నాం. కొన్నిసార్లు కౌన్సెలింగ్‌ సరిపోకపోవచ్చు. అలాంటి సమయాల్లో జిల్లా మేజిస్ట్రేట్‌, సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌, పోలీసులు, బాలల అభివృద్ధి ప్రాజెక్ట్‌ అధికారులు తదితరుల సహకారం తీసుకుంటున్నాం. బాల్య వివాహాలు చట్టరీత్యా శిక్షార్హమైన నేరం అనేది అర్థమయ్యేలా చెబుతున్నాం. తమ కూతుర్లకు పద్దెనిమిదేళ్ళు వచ్చేదాకా పెళ్ళి చేయబోమని తల్లితండ్రుల నుంచి అఫిడవిట్‌ తీసుకుంటున్నాం. మరోవైపు పలు గ్రామాల్లో బాలికల బృందాలను ఏర్పాటు చేశాను. వీరందరూ తమ ఇబ్బందులను కలిసి చర్చించుకుంటారు. బాల్య వివాహాల కోసం కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తే... వెంటనే మాకు సమాచారం అందిస్తారు. కౌన్సెలింగ్‌, అవగాహన కల్పించడం, సామాజిక చైతన్యం, ప్రజల భాగస్వామ్యం... వీటి ద్వారా మాత్రమే బాల్య వివాహాలను అరికట్టగలం. అలాగే బాలికల విద్య, ఆరోగ్యం, సాధికారత లాంటి అంశాలపైన కూడా నేను పని చేస్తున్నాను. వారికి ప్రభుత్వాల నుంచి వచ్చే పథకాలు అందేలా చూస్తున్నాను. వారి స్వయం ఉపాధికి సహకారం అందిస్తున్నాను.’’

అదే నా కల...

‘‘నా ప్రయత్నాలకు దేశ, విదేశీ సంస్థల నుంచి గుర్తింపు లభించింది. 2022లో జెనీవాలో ఐక్యరాజ్య సమితి సదస్సులో పురస్కారాన్ని అందుకున్నాను. ఆ సదస్సులో నా ప్రసంగానికి మంచి స్పందన వచ్చింది. చిన్న వయసులోనే నాకు పెళ్ళి జరిగి, గర్భవతిని అయినప్పుడు... జీవించాలనే ఆశను కోల్పోయాను. కానీ ఎంతోమంది బాలికలు చిన్న వయసులోనే వివాహం అనే సంకెళ్ళ నుంచి బయటపడడానికి సాయం చేయగలగడం నాకు ఒక లక్ష్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు... నాకు ఒకే ఒక కల ఉంది... నా జీవితకాలంలో బాల్య వివాహాలు లేని భారతదేశాన్ని చూడాలన్నది.’’

ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీకి బిగ్ షాక్... కీలక నేతపై కేసు

నన్ను చంపేందుకు వైసీపీ నేత ప్లాన్ చేశారు: కావ్యా కృష్ణారెడ్డి

Read Latest AP News and National News

Updated Date - Aug 20 , 2025 | 01:39 AM