Share News

MLA Kavya Krishna Reddy: నన్ను హత్య చేసేందుకు వైసీపీ నేత ప్లాన్ చేశారు.. ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 19 , 2025 | 04:58 PM

తనను హత్య చేసేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్లాన్ చేశారని కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి ఆరోపించారు. క్రషర్ వద్ద మధ్యాహ్న సమయాల్లో తాను ఉంటుంటానని చెప్పుకొచ్చారు. ఇవాళ వేరే పనిమీద విజయవాడకి వచ్చానని పేర్కొన్నారు.

MLA Kavya Krishna Reddy: నన్ను హత్య చేసేందుకు వైసీపీ నేత ప్లాన్ చేశారు.. ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు
MLA Kavya Krishna Reddy

నెల్లూరు, ఆగస్టు19 (ఆంధ్రజ్యోతి): జలదంకి మండలం అన్నవరంలోని కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డికి (MLA Kavya Krishna Reddy) చెందిన క్రషర్ వద్ద వైసీపీ (YSRCP) రౌడీ మూకలు రెచ్చిపోయారు. డ్రోన్‌తో వీజువల్స్ తీస్తుండగా ప్రశ్నించిన సిబ్బందిపై మారణాయుధాలతో దాడికి యత్నించారు. వైసీపీ రౌడీ మూకలని‌ పట్టుకుని పోలీసులకి అప్పగించారు క్రషర్ సిబ్బంది. మారణాయుధాలు స్వాధీనం చేసుకుని, నిందితులని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీడియోలు తీసుకురండి, అడ్డువస్తే ఏమైనా చేయండని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశించినట్లు నిందితులు చెబుతున్నారు. నిందితులకి ఫోన్లు చేస్తూ ప్రతాప్ కుమార్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారని నిందితులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డికి క్రషర్ సిబ్బంది సమాచారం అందించారు. వెంటనే కావ్యా కృష్ణారెడ్డి పోలీసు స్టేషన్‌కు వెళ్లి పోలీసులతో మాట్లాడారు.


ఆగడాలను ప్రశ్నించడంతోనే హత్యకు ప్లాన్: ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి

అయితే, ఈ ఘటనపై కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలతో తనను చంపేందుకు రెక్కీ చేశారని పేర్కొన్నారు. తాను ఈరోజు మామిడి తోటలోకి వస్తానని వాళ్లకు తెలుసునని చెప్పుకొచ్చారు. చివరి నిమిషంలో తాను సీఎం చంద్రబాబును కలిసేందుకు విజయవాడ వచ్చానని తెలిపారు. అక్కడ ఉంటాననే తన క్రషర్, తోటలో డ్రోన్‌లతో ‌వెతికారని వివరించారు. తమ వాళ్లు పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తే వారి పైనే దాడి చేశారని మండిపడ్డారు. అందరూ కలిసి పట్టుకుని ప్రశ్నిస్తే ప్రతాప్ కుమార్ రెడ్డి పంపినట్లు చెప్పారని అన్నారు. అతను చేసే ఆగడాలను ప్రశ్నించానని తనపై కక్ష పెంచుకున్నారని చెప్పుకొచ్చారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయం నుంచి కూడా వాళ్లకు ఫోన్లు వచ్చాయని కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి ఆరోపించారు.


వైసీపీ నేతల ఫోన్లు...

ప్రతాప్‌రెడ్డి జగన్‌కు సన్నిహితుడని కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. జగన్ ఆదేశాలతోనే నేడు తనను చంపడానికి కుట్ర చేశారనే అనుమానం కలుగుతోందని తెలిపారు. నిందితుల వద్ద ఫోన్లకు ప్రతాప్‌తో పాటు, పలువురు వైసీపీ నేతలు ఫోన్లు చేశారని చెప్పుకొచ్చారు. వారు తెచ్చిన కత్తులు, వాహనం కూడా పట్టుకుని పోలీసులకు అప్పగించామని వివరించారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఓటమితో డైవర్షన్ పాలిటిక్స్‌కు జగన్ తెర లేపారని ధ్వజమెత్తారు. తనను లక్ష్యం చేసుకుని చంపాలని ఈరోజు (మంగళవారం) ప్లాన్ వేశారని తెలిపారు. పోలీసులకు అన్ని ఆధారాలు, అనుమానితుల పేర్లు కూడా చెప్పామని అన్నారు. ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పుకొచ్చారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తన హత్యకు కుట్రలు చేసిన వారి వివరాలను సీఎం చంద్రబాబును కలిసి అందచేస్తానని కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నందమూరి వారి ఇంట విషాదం.. హైదరాబాద్‌కు సీఎం చంద్రబాబు

హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. కరెంట్ షాక్తో ఇద్దరు మృతి

Read Latest AP News and National News

Updated Date - Aug 19 , 2025 | 06:20 PM