Ganesh Mandapam: హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. కరెంట్ షాక్తో ఇద్దరు మృతి
ABN , Publish Date - Aug 19 , 2025 | 10:50 AM
హైదరాబాద్‌లో కరెంట్ షాక్ ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. మెున్న రామాంతపూర్.. నేడు బండ్లగూడ విద్యుదాఘాతాల్లో యువకులు ప్రాణాలు కోల్పోయారు.
హైదరాబాద్, ఆగస్ట్ 19: హైదరాబాద్ మహానగరంలో కరెంట్ షాక్ తగిలి మరణిస్తున్న ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ (మంగళవారం) చాంద్రాయణగుట్ట బండ్లగూడలో విద్యాదాఘాతంతో ఇద్దరు యువకులు.. వికాస్, ధోనీ మరణించారు. చాంద్రాయణగుట్ట నుంచి పురానా పుల్‌కు వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్తండగా.. వీరికి కరెంట్ షాక్ తగిలింది. అయితే వీరి వెంట ఉన్న మరో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. మరో యువకుడు ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి.. గాయపడిన వారిని ఓవైసీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు.. వినాయకుడి మండపానికి పందిరి వేసే క్రమంలో కరెంట్ తీగలను కట్టెతో పైకి లేపుతుండగా.. కరెంట్ షాక్ తగిలి రామ్ చరణ్ అనే వ్యక్తి కిందపడిపోయాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరుగుపొరుగు వారు వెంటనే స్పందించి.. అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అతడిని అత్యవసర చికిత్స నిమిత్తం ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
కాగా, వరుసగా మూడు రోజుల వ్యవధిలో విద్యుత్ షాక్ తో 8మంది మరణించడం పట్ల నగర జీవులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించిన యాత్ర కారణంగా.. రామాంతపూర్‌లో ఆరుగురు యువకులు మరణించారు. అలాగే బండ్లగూడలో ఈరోజు ఇద్దరు మృతి చెందారు. అయితే కరెంట్ షాక్ కారణంగా రామాంతపూర్‌లో మరణించిన యువకులకు ప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక భారీ వర్షాల కారణంగా ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్లొద్దని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రజలకు సూచించారు. వర్షాలు పడే సమయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని విద్యుత్ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
పండగల వేళ ఎంతో సంతోషంగా సంబరాలు చేసుకొంటున్న సమయంలో ఇలా కరెంట్ షాక్ తగిలి యువకులు విగత జీవులుగా మారుతుండడంతో ఆయా కుటుంబాల రోదనలు మిన్నంటుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
వీడని మిస్టరీ.. జల్లెడ పడుతున్న పోలీసులు
Read Latest Telangana News and National News