Jesus Christ Prophecy: ఆహ్వాన సన్నాహం
ABN, Publish Date - Nov 21 , 2025 | 06:06 AM
ఒక ఊరుకు ఎవరైనా ప్రముఖుడు రాబోతున్నారంటే... అక్కడ ఉండే అధికారులు, గ్రామ పెద్దలు ముందుగానే ఏర్పాట్లలో నిమగ్నమవుతారు. ఊరు ఊరంతా ఆయనను స్వాగతించడానికి సంసిద్ధం అవుతుంది. అదే విధంగా...
దైవమార్గం
ఒక ఊరుకు ఎవరైనా ప్రముఖుడు రాబోతున్నారంటే... అక్కడ ఉండే అధికారులు, గ్రామ పెద్దలు ముందుగానే ఏర్పాట్లలో నిమగ్నమవుతారు. ఊరు ఊరంతా ఆయనను స్వాగతించడానికి సంసిద్ధం అవుతుంది. అదే విధంగా... ఏసు ప్రభువు ఉద్భవించబోతున్నట్టు దీర్ఘదర్శులు ముందుగానే చూచాయగా చెప్పారు. ప్రవక్తలు ఆయనకోసం పడిగాపులు కాశారు, తపోదీక్షల్లో, ప్రార్థనల్లో మునిగిపోయారు. ఆయన ద్వారా తాము ఆశించినవన్నీ నెరవేర్చుకోవడానికి సిద్ధమయ్యారు. క్రీస్తు రాబోతున్నాడని గొప్పగా ప్రకటించి, ఆయన మార్గాన్ని సిద్ధం చేసినవారిలో ఇద్దరు ప్రధానంగా కనిపిస్తారు. వారిలో ఒకరు యెషయా ప్రవక్త. ఏసు రాక గురించి 700 ఏళ్ళ క్రితమే తెలియజేశాడు. రెండో వ్యక్తి... ఏసుకు సమకాలీకుడైన యోహాను ప్రవక్త.
‘‘దావీదు వంశం పతనమై ఎండిన వృక్షంలా కనిపిస్తుంది. ఆ మోడు నుంచి ఒక పచ్చని చిగురు పుట్టుకువస్తుంది. ఆ చిగురు ఆవిర్భావం అంటే ఏసు జననం’’ అని ప్రవచించిన యెషయా... ప్రభువు రాకకోసం ఎదురుచూసి, ఎదురుచూసి, నిరాశతో ప్రాణాలు విడిచాడు. ఆయన పేరిట బైబిల్‌లో ఒక పెద్ద అధ్యాయమే ఉంది. అందులో యూదులకు, ఇశ్రాయిలీలకు శాంతి హెచ్చరికలను కూడా ఆయన చేశాడు.
యోహాను క్రీస్తుకన్నా ఆరు నెలలు పెద్దవాడు. అతను ప్రజల కోసం ఒక ప్రకటన చేస్తూ... ‘‘నేను మీకు నీళ్ళతో మాత్రమే బాప్తిస్మం (బాప్టిజం) ఇస్తున్నాను. కానీ రాబోయే మహనీయుడు అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు. అదిగో... ఆయన అడుగుల చప్పుడు వినిపిస్తోంది. ఆయన పాద రక్షలు మోయడానికి కూడా నాకు అర్హత లేదు’’ అని చెప్పాడు. అతను ప్రభువుకు బాప్తిస్మం ఇచ్చాడు. అందుకే అతనికి ‘బాప్తిస్మ యోహాన్’ అనే పేరు స్థిరపడిపోయింది. ఇర్మియా లాంటి ప్రవక్తలు ఎందరు ఉన్నప్పటికీ... ఎన్నో ఏళ్ళ ముందు యెషయా, దగ్గరగా ఉండి స్వాగతించిన యోహాను ఆయన రాకను ఊహించినవారుగా ప్రసిద్ధులయ్యారు. ఆయన వచ్చే మార్గంలో ఇరువైపులా నిలబడి ఆహ్వానానికి సన్నాహాలు చేస్తున్నవారుగా ఆ ఇద్దరూ కనిపిస్తారు.
డాక్టర్ యం. సోహినీ బెర్నార్డ్
9866755024
కుప్పం ప్రజలకు అండగా ఉంటాం: నారా భువనేశ్వరి
కోర్టుకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్
Read Latest AP News And Telugu News
Updated Date - Nov 21 , 2025 | 06:06 AM