Bandi Sanjay: కోర్టుకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్
ABN , Publish Date - Nov 20 , 2025 | 04:22 PM
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పని చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నల్గొండలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
హైదరాబాద్, నవంబర్ 20: కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇవాళ(గురువారం) నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. గతంలో తనపై నమోదైన పలు కేసుల నేపథ్యంలో విచారణ కోసం కోర్టు వెళ్లారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పని చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నల్గొండలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
అలాగే హుజూర్‌నగర్ నియోజకవర్గం నేరేడుచర్లలో బండి సంజయ్ కాన్వాయ్‌పై బీఆర్ఎస్ నేతలు రాళ్ల దాడి చేశారు. నాటి ఘటనల్లో బండి సంజయ్‌పై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విచారణలో భాగంగానే కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. అయితే, విచారణ అనంతరం జనవరి 7వ తేదీకి ఈ కేసును న్యాయమూర్తి వాయిదా వేశారు.
బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట
మరోవైపు.. కేంద్ర హోమ్ శాఖ మంత్రి బండి సంజయ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గతంలో కమలాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును గురువారం నాడు హైకోర్టు కొట్టేసింది. 2023లో 10వ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై ఈ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇందులో బండి సంజయ్ పేరును ప్రధాన నిందితుడిగా కమలాపురం పోలీసులు చేర్చారు.
రాజకీయ కక్షల కారణంగానే ఈ కేసు నమోదు చేశారని హైకోర్టుకు బండి సంజయ్ న్యాయవాది తెలిపారు. కేసు నమోదులో సరైన సెక్షన్లు కానీ.. దర్యాప్తులో పూర్తి వివరాలు కానీ లేవని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ కేసును కొట్టేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కుప్పం ప్రజలకు అండగా ఉంటాం: నారా భువనేశ్వరి
ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుంది.. ఏపీ డీజీపీ స్పష్టం
Read Latest TG News And Telugu News