Parenting Tips: పిల్లలు చురుకుగా ఉండాలంటే
ABN, Publish Date - Sep 01 , 2025 | 02:11 AM
పిల్లలు ఎదుగుతున్న క్రమంలో ఎన్నో అంశాలు నేర్చుకుంటూ ఉంటారు. కొన్నింటిని చూసి, మరికొన్నింటిని ప్రశ్నల ద్వారా అడిగి తెలుసుకుంటారు. ఇలాంటి ఆసక్తి పిల్లల్లో చురుకుదనాన్ని పెంచుతుంది...
పేరెంటింగ్
పిల్లలు ఎదుగుతున్న క్రమంలో ఎన్నో అంశాలు నేర్చుకుంటూ ఉంటారు. కొన్నింటిని చూసి, మరికొన్నింటిని ప్రశ్నల ద్వారా అడిగి తెలుసుకుంటారు. ఇలాంటి ఆసక్తి పిల్లల్లో చురుకుదనాన్ని పెంచుతుంది. పిల్లలు ఇలా చురుగ్గా, ఉత్సాహంగా పెరగాలంటే తల్లిదండ్రులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం...
పిల్లలను ఎప్పుడూ నాలుగు గోడల మధ్య బందీ చేసి ఉంచకూడదు. ఆరుబయట హాయిగా ఆడుకోనివ్వాలి. ఇలా ఆడుకుంటూనే పిల్లలు చాలా అంశాలు తెలుసుకుంటారు. తోటి పిల్లలతో స్నేహం చేయడం నేర్చుకుంటారు. పరుగెత్తడం, గెంతడం, పడడం, లేవడం లాంటి శారీరక శ్రమ పిల్లల్లో ఉత్సాహాన్ని పెంచుతుంది.
ఇప్పుడిప్పుడే బయటి ప్రపంచాన్ని చూస్తున్న పిల్లల మనసుల్లో ఎన్నో రకాల ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. వచ్చీరాని మాటలతో ప్రశ్నలు అడుగుతుంటారు. వారి ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పాలి. అప్పుడే పిల్లల్లో ఊహాశక్తి, విశ్లేషణ సామర్థ్యం పెరుగుతాయి.
ఉదయం, సాయంత్రం సమయాల్లో పిల్లలను దగ్గర్లోని పంట పొలాలకు, తోటలకు లేదంటే ఏదైనా పార్క్‌కు తీసుకెళ్లాలి. రకరకాల చెట్లు, మొక్కలు, పూలు, కాయల గురించి వివరిస్తూ ప్రకృతిపై అవగాహన కల్పించాలి. పక్షులు, జంతువుల గురించి తెలియజెప్పాలి. దీనివల్ల పిల్లలు కొత్త అంశాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపకశక్తి వృద్ధి పొందుతుంది.
రాత్రి పడుకునేముందు నీతి కథలు చెప్పాలి. వీటిద్వారా పిల్లలు నైతిక విలువలు, స్నేహభావం, పరోపకారం, దయాగుణం, పెద్దలను గౌరవించడం లాంటి ఎన్నో అంశాలు తెలుసుకుంటారు.
పిల్లలకు ఉదయాన్నే నిద్రలేవడం, దినచర్య, వ్యాయామం, క్రమశిక్షణ, పోషకాహారం గురించి వివరిస్తూ వాటిని అలవాటు చేయాలి. అప్పుడే పిల్లలు శారీరకంగా, మానసికంగా పూర్తి ఆరోగ్యంతో ఎదుగుతారు. చురుకుగా వ్యవహరిస్తారు కూడా!
ఇవి కూడా చదవండి
హరీష్ రావు తప్పు చేశారని కమిషన్ చెప్పింది: ముఖ్యమంత్రి రేవంత్
కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోంది.. మంత్రి ఉత్తమ్‌పై హరీష్‌రావు ఫైర్
Updated Date - Sep 01 , 2025 | 02:11 AM