Vijayadashami: నమామి దుర్గా.. నేడు విజయ దశమి
ABN, Publish Date - Oct 02 , 2025 | 03:21 AM
ఈ జగత్తును నడిపించేది కంటికి కనిపించని ఒక మహా శక్తి. ఆ మహా శక్తికి వెయ్యికి పైగా నామాలు ఉన్నాయి. చైతన్య స్వరూపిణి అయిన ఆమె అంతటా ఉంది, అందరిలోనూ ఉంది. ఆమె నిర్గుణ, నిరాకార, నిరంజన పరమేశ్వరి...
నమామి దుర్గా... నేడు విజయ దశమి
ఈ జగత్తును నడిపించేది కంటికి కనిపించని ఒక మహా శక్తి. ఆ మహా శక్తికి వెయ్యికి పైగా నామాలు ఉన్నాయి. చైతన్య స్వరూపిణి అయిన ఆమె అంతటా ఉంది, అందరిలోనూ ఉంది. ఆమె నిర్గుణ, నిరాకార, నిరంజన పరమేశ్వరి. ప్రకృతి మాతగా తన సంతానాన్ని, రక్షిస్తోంది, పోషిస్తోంది. ఆమె... సరస్వతి, మహాలక్ష్మి మహాదుర్గ... ముగ్గురమ్మల మూలపుటమ్మ. బ్రహ్మ విష్ణు శివాత్మిక. సృష్టి, స్థితి, లయకారిణి. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తుల కలబోత. ఆమెను దుర్గాదేవిగా శరత్కాలంలో పూజించడం దేశమంతటా ఉన్న సంప్రదాయం. ఈ ఆరాధనోత్సవాలు తొమ్మిదిరోజుల పాటు జరుగుతాయి. ఈ నవరాత్రులు శరత్కాలంలో జరుగుతాయి కాబట్టి శరన్నవరాత్రులనీ, దుర్గా దేవికి సంబంధించినవి కాబట్టి దుర్గా నవరాత్రులని, దేవి నవరాత్రులనీ పిలుస్తారు. ‘నవ’ అంటే తొమ్మిది అని ఒక అర్థం. అది పూర్ణ సంఖ్య. జగన్మాత పూర్ణస్వరూపం అని చెప్పే సంకేతం ఇది. మరొక అర్థంలో ‘శరత్’ అంటే సంవత్సరం. ఏడాదంతా దేవిని పూజించలేకపోయినా శరన్నవరాత్రులలో ఆరాధిస్తే, సంవత్సరమంతా పూజించిన ఫలం దక్కుతుందంటారు.
‘దయ, తృప్తి, శ్రద్ధ, క్షమ, ధ్రుతి, పుష్టి, శాంతి, లజ్జ తదితర గుణాలన్నీ పరాశక్తివే’ అని ‘చండీ సప్తశతి’ పేర్కొంది. మరొక ప్రత్యేకమైన సాత్విక గుణం లలిత. అంటే అతి సుందరమైనది. త్రిభువనాలలో సుందరమైనది. అందుకని ఆమెను ‘లలితా త్రిపురసుందరి’గా పూజిస్తారు. సర్వాభీష్ట సిద్ధి ఆశించే దేవతలకు, మానవులకు ఆరాధ్య దేవత లలితా త్రిపుర సుందరి. శరన్నవరాత్రులలో దుర్గను రోజుకొక్క రూపంలో, తొమ్మిది రోజులపాటు తొమ్మిది నామాలతో అర్చిస్తారు. వారిని ‘నవదుర్గలు’గా పూర్వులు పేర్కొన్నారు.
ప్రథమం శైల పుత్రీం ద్వితీయా బ్రహ్మచారిణీ తృతీయా
చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్ధకీ, పంచమాం
స్కందమాతేతి, షష్ట్యా కాత్యాయనీతిచ, సప్తమా
కాళరాత్రీతి, మహాగౌరీతిచాష్టమీ,
నవమా సిద్ధిధాత్రీతి, నవదుర్గాః ప్రకీర్తితా...
ఇది దుర్గకు గల నామ, రూపాలను తెలిపే శ్లోకం. శరన్నవరాత్రులో ఈ రూపాలతో దుర్గాదేవిని పూజిస్తారు. ఈ రూపాల విశిష్టతలను తెలుసుకుందాం.
శైలపుత్రి: హిమవంతుని కూతురు కాబట్టి అమ్మవారికి శైలపుత్రి, హైమవతి, పార్వతి (పర్వత పుత్రిక) అనే నామాంతరాలు ఉన్నాయి. ఆమె వృషభ వాహిని. కోరిన కోర్కొలు తీర్చే తల్లి.
బ్రహ్మచారిణి: దక్షుని కుమార్తె సతీదేవి. తండ్రి చేసిన అవమానం భరించలేక యోగాగ్నిలో తనువు చాలించింది. నారదుని ఉపదేశంతో గత జన్మ వృత్తాంతాన్ని తెలుసుకొని, శివుణ్ణే పతిగా పొందాలనే కోరికతో తపస్సు చేయడానికి ఉపక్రమించిన రూపమే బ్రహ్మచారిణి. శివుని కోసం తపస్సు చేయడానికి బ్రహ్మచర్యం అవలంబించింది కాబట్టి ‘బ్రహ్మచారిణి’ అని పిలుస్తారు. ఆమెను ఆరాధిస్తే చేపట్టిన కార్యాల్లో విజయం చేకూరుతుంది.
చంద్రఘంట: పది చేతుల్లో ఆయుధాలు ధరించి, యుద్ధ సన్నద్ధురాలైన ఈమెను పూజిస్తే ధైర్యంతో పాటు శత్రు జయం లభిస్తుంది.
కూష్మాండ: కూష్మాండ అంటే భూమికి సంకేతం. ఈ విశ్వాన్ని సృష్టించినది అనే అర్థంతో... ఆ పేరుతో పూజలు అందుకుంటోంది. ఆమెకు ఎనిమిది భుజాలు. ఆమెను ఆరాధించడం వల్ల రోగాలు నాశనమై, ఆయురారోగ్యాలు చేకూరుతాయి.
స్కందమాత: స్కందుడికి (కుమారస్వామికి) తల్లి కాబట్టి ఆమెకు ‘స్కందమాత’ అని పేరు. స్కందమాత శాంతస్వరూపిణి. ఆమెను పూజించడం వల్ల శాంతి, సౌఖ్యం, జ్ఞాన విజ్ఞానాలు లభిస్తాయంటారు.
కాత్యాయని: త్రిమూర్తుల తేజంతో మహిషాసురుణ్ణి మర్దించడం కోసం... కాత్యాయన ముని ఆశ్రమంలో జన్మించి, ఆయనతో పూజలందుకుంది కాబట్టి ఆమెకు ‘కాత్యాయని’ అనే పేరు వచ్చింది. నాలుగు భుజాలు కలిగిన ఆమెను ఆరాధిస్తే జీవితంలో దుఃఖాలు, బాధలు, కష్టాలు ఉండవని విశ్వాసం.
కాళరాత్రి: నాలుగు భుజాలతో, నల్లని దేహంతో... గార్ధభ వాహనాన్ని అధిరోహించి, వరద, అభయ ముద్రలతో భక్తులను ఆమె అనుగ్రహిస్తుంది. ఆమె దుష్టులకు భయంకరి, శిష్టులకు అభయంకరి. కాళరాత్రి అమ్మవారిని పూజిస్తే గ్రహదోషాలు నశించి, జీవన సౌఖ్యం లభిస్తుంది.
మహాగౌరి: నాలుగు భుజాలు కలిగిన ఆమె వరద, అభయ హస్తాలతో భక్తులను కటాక్షిస్తుంది. శ్వేతవర్ణంలో ఉండే ఈ మాతను పూజిస్తే, పాపాలు తొలగిపోతాయి, శుభాలు సమకూరుతాయి.
సిద్ధిధాత్రి: నాలుగు చేతుల్లో శంఖ, చక్ర, గదా, పద్మాలను ధరించి భక్తులను రక్షిస్తుంది. సర్వసిద్ధులను ప్రసాదించే తల్లి కాబట్టి ఆమెను ‘సిద్ధిధాత్రి’ అంటారు. ఆమెను పూజిస్తే జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి.
ఇలా తొమ్మిది రూపాలతో అర్చనలు అందుకుంటున్న దుర్గాదేవి ఎందరో అసురులను నిర్జించింది. నవరాత్రుల తరువాత... దశమి తిథినాడు దుర్గాదేవిని అపరాజితగా, రాజరాజేశ్వరిగా నుతిస్తూ ఉత్సవాలు జరుపుకొంటారు. ఆ రోజును ‘విజయదశమి’గా వ్యవహరిస్తారు.
ఆయపిళ్ళ రాజపాప
ఈ వార్తలు కూడా చదవండి..
నగదు ఇస్తానన్నా వదల్లేదు.. బాధితురాలి ఆవేదన..
For More AP News And Telugu News
Updated Date - Oct 02 , 2025 | 11:32 AM