CM Chandrababu Thanks PM Modi: పీఎంకు థ్యాంక్స్ చెప్పిన సీఎం
ABN , Publish Date - Oct 01 , 2025 | 07:11 PM
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
అమరావతి, అక్టోబర్ 01: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రీయ విద్యాలయాలు కేటాయిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ ఎఫైర్స్ కీలక నిర్ణయం తీసుకోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ అభివృద్ధికి దోహదపడుతుందని.. అలాగే గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు సరి అవుతాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అవసరమైన సౌకర్యాలు సైతం వీటి ద్వారా తీరుతాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం సీఎం చంద్రబాబు తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. తన ట్వీట్‌ను ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు సీఎం చంద్రబాబు ట్యాగ్ చేశారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా మంగ సముద్రం, కుప్పం మండలం బైరుగానిపల్లె, శ్రీకాకుళం జిల్లా పలాస, రాజధాని అమరావతిలోని శాఖమూరులో ఈ కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోద ముద్ర వేసింది. అలాగే తెలంగాణలోనూ నాలుగు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఒకటి. ములుగు జిల్లా కేంద్రంలో మరొకటి. అలాగే జగిత్యాల జిల్లా రూరల్ మండలం చెల్గల్, వనపర్తి జిల్లా నాగవరం శివారు ప్రాంతంలో ఇంకొకటి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మెుత్తం 57 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటుకు మోదీ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
చోరబాటుదారులతో దేశానికి ముప్పు:ప్రధాని మోదీ
నగదు ఇస్తానన్నా వదల్లేదు.. బాధితురాలి ఆవేదన..
For More AP News And Telugu News