Celebrity Rights: ట్రెండ్ మా జీవితం మా హక్కు
ABN, Publish Date - Oct 05 , 2025 | 02:56 AM
కృత్రిమ మేథస్సు, సామాజిక మాధ్యమాలు విషపూరిత సమ్మేళనంగా మారిపోయాయి. మరీ ముఖ్యంగా కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు, సంస్థలు పేరు కోసం, విక్రయాల కోసం ప్రముఖుల స్వరాలు...
కృత్రిమ మేథస్సు, సామాజిక మాధ్యమాలు విషపూరిత సమ్మేళనంగా మారిపోయాయి. మరీ ముఖ్యంగా కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు, సంస్థలు పేరు కోసం, విక్రయాల కోసం ప్రముఖుల స్వరాలు, ఆహార్యాలను అనుకరించే పోకడను అనుసరిస్తున్నారు. ఈ పోకడ నెటిజన్లను అలరిస్తున్నా, నటులను మాత్రం ఒకింత అసహనానికి గురి చేస్తోంది. కాబట్టే తాజాగా కొందరు ప్రముఖులు వారి వ్యక్తిగత హోదానూ, హూందాతనాన్నీ పరిరక్షించుకోవడం కోసం కోర్టుల ద్వారా ‘పర్సనాలిటీ రైట్స్’ను పొందుతున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం!
ఐశ్వర్య దంపతులు సైతం
2024 మేలో, కొన్ని సంస్థలు జాకీ ష్రాఫ్ ఫొటోలను వాడుకుంటూ, అనధికారిక వస్తువుల అమ్మకాలు, వక్రీకరించిన వీడియోలతో వాణిజ్య లాభాలను ఆర్జిస్తున్నట్టు గుర్తించిన న్యాయస్థానం బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ వ్యక్తిత్వ హక్కులకు కూడా రక్షణ కల్పించింది. అలాగే అనిల్ కపూర్ పేరు, ఫొటో, స్వరాలతో పాటు ఆయన సుప్రసిద్ధ క్యాచ్‌ఫ్రేజ్ ‘ఝకాస్’ అనే మాటను కూడా వినియోగించడానికి వీల్లేకుండా వ్యక్తిత్వ హక్కుల రక్షణను అనుమతించింది. అలాగే 2022 నవంబరులో హైకోర్టు అమితాబ్ బచ్చన్ వ్యక్తిత్వ, ప్రచార హక్కులు ఉల్లంఘనకు లోను కాకుండా రక్షణ కల్పించింది. గత సెప్టెంబరులో ప్రపంచసుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌లతో పాటు నిర్మాత కరణ్ జొహార్‌ల వ్యక్తిత్వం, ప్రచార హక్కులకు కూడా రక్షణ కల్పించడం విశేషం. కరణ్ జొహార్ విషయంలో, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, పిన్‌ట్రెస్ట్, యూట్యూబ్‌లతో సహా వివిధ సామాజిక మాధ్యమాల వేదికల నుంచి అశ్లీల మీమ్స్, పోస్ట్‌లను తొలగించాలని కోర్టు ఆదేశించింది. అటువంటి కంటెంట్‌ను సృష్టించడం కోసం ఒక ప్రముఖుడి వ్యక్తిత్వాన్ని అనధికారికంగా ఉపయోగించడం వల్ల ఆ ప్రముఖుడి పేరు ప్రతిష్ఠలు దెబ్బతిన్నట్టు పేర్కొంది.
మధుర గాయని కూడా...
ప్రముఖ హిందీ గాయని ఆశాభోంస్లే, కృత్రిమ మేథస్సు సహాయంతో తన స్వరాన్ని దుర్వినియోగపరుస్తున్న ఎఐ కంపెనీ మింక్ ఇంక్‌తో సహా అనేక సంస్థలకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు. దాంతో ముందస్తు అనుమతి లేకుండా, ఆర్టిషిసియల్ ఇంటెలిజెన్స్ వేదికలు, ఇ కామర్స్ సైట్‌లు, స్వతంత్ర విక్రేతలు ఆశాభోంస్లే స్వరాన్ని క్లోనింగ్ చేయడం లేదా ఆమె చిత్రాలు, పోలికలు, ఇతర వ్యక్తిత్వ లక్షణాలు దుర్వినియోగం కాకుండా బోంబే హైకోర్టు తాత్కాలిక రక్షణ కల్పించింది. డిజిటల్ యుగంలో ప్రముఖుల హక్కులను కాపాడే క్రమంలో న్యాయస్థానం ఇచ్చిన ఈ ఉత్తర్వు ప్రస్తుతం ఎంతో కీలకంగా మారింది.
నటుడు నాగార్జున కూడా...
పేరు, స్వరం, ఇమేజ్.. ఏ నటుడికైనా ఇవెంతో ముఖ్యం. వీటిని ఏ కారణంగా దుర్వినియోగపరిచినా ఏ నటులూ ఉపేక్షించరు. వెంటనే కోర్టును ఆశ్రయించి, వ్యక్తిత్వ హక్కులను పొందే ప్రయత్నం చేస్తారు. నటుడు నాగార్జున ఇదే చేశారు. తాజాగా తన వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పించాలంటూ ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి, అనుమతి పొందారు. అక్రమ వాణిజ్య ప్రయోజనాల కోసం వస్తువులను విక్రయించడం కోసం తన వ్యక్తిత్వాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు, తన ఫొటోలను అశ్లీల ఫొటోలతో మార్ఫింగ్ చేస్తున్నట్టు, యూట్యూబ్‌లో వీడియోలు సృష్టించడం ద్వారా, కృత్రిమ మేథస్సు సహాయంతో తనను ఉగ్రవాద సంస్థలతో, జూదంతో అనుసంధానిస్తున్నట్టు నాగార్జున తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఒక ప్రముఖ వ్యక్తి ఇమేజ్‌ను తప్పుదారి పట్టిస్తూ, అనుచితమైన, అవమానకరమైన మార్గాల్లో వారి ప్రవర్తననూ, ఆహార్యాన్నీ అనుకరిస్తూ ప్రతిష్ఠకు భంగం కలిగించినప్పుడు, వాళ్ల గుడ్‌విల్ దెబ్బ తింటుందని పేర్కొంటూ, ఢిల్లీ హైకోర్టు, నటుడు అక్కినేని నాగార్జున వ్యక్తిత్వం, ప్రచార హక్కులను కాపాడుతూనే ఆయన ప్రమేయం లేకుండా, పేరునూ, ఇమేజ్‌నూ, స్వరాన్నీ వాణిజ్యపరంగా ఉపయోగించకుండా కట్టడి విధించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Ashok: ప్రతిపక్షనేత సంచలన కామెంట్స్.. సిద్దరామయ్య అవుట్‌గోయింగ్ సీఎం
PM-SETU Scheme: ఐటీఐలు ఆత్మనిర్భర్ భారత్ వర్క్‌షాప్‌లు: పీఎం మోదీ
Updated Date - Oct 05 , 2025 | 02:56 AM