ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Monsoon Special Fish Recipes: వర్షంలో పసందుగా చేపల విందు

ABN, Publish Date - Sep 20 , 2025 | 03:29 AM

చాలామంది చేపలతో తయారుచేసిన వంటకాలను ఇష్టంగా తింటూ ఉంటారు. ఏడాది పొడవునా చేపలు లభిస్తాయి కానీ వర్షాకాలంలో మాత్రం కొన్ని ప్రత్యేక రకాలు దొరుకుతుంటాయి. అలాంటి అరుదైన చేపలతో...

వంటిల్లు

చాలామంది చేపలతో తయారుచేసిన వంటకాలను ఇష్టంగా తింటూ ఉంటారు. ఏడాది పొడవునా చేపలు లభిస్తాయి కానీ వర్షాకాలంలో మాత్రం కొన్ని ప్రత్యేక రకాలు దొరుకుతుంటాయి. అలాంటి అరుదైన చేపలతో తయారుచేసే వంటకాలు మీకోసం...పులస చేపల పులుసు

కావాల్సిన పదార్థాలు

ఫ పులస చేప ముక్కలు- 20, పసుపు- అర చెంచా, ఉప్పు- మూడు చెంచాలు, కారం- అయిదు చెంచాలు, పచ్చి మిర్చి- 20, బెండకాయలు- ఆరు, వెన్న- ఒక చెంచా, ఆవనూనె- రెండు చెంచాలు, ధనియాల పొడి- రెండు చెంచాలు, వెల్లుల్లి గడ్డలు- రెండు, జీలకర్ర- మూడు చెంచాలు, ఉల్లిపాయలు- నాలుగు, వేరుశనగ నూనె- 200 గ్రాములు, పంచదార- పావు చెంచా, చింతపండు- పావు కేజీ, నీళ్లు- రెండు గ్లాసులు, కొత్తిమీర- ఒక కట్ట

తయారీ విధానం

  • ఉల్లిపాయలను సన్నగా తురిమి పెట్టుకోవాలి. మిక్సీలో వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఇది మూడు చెంచాల వరకు ఉంటుంది. బెండకాయలను పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. చింతపండును నీళ్లలో నానబెట్టి గుజ్జు తీసుకోవాలి. పచ్చిమిర్చికి మధ్యలో ఒక గాటు పెట్టుకోవాలి. కొత్తిమీరను శుభ్రం చేసి సన్నగా తరగాలి.

  • అడుగు మందంగా ఉన్న వెడల్పాటి పెద్ద గిన్నె తీసుకోవాలి. ఇందులో పులస చేప ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, పచ్చి మిర్చి, బెండకాయ ముక్కలు, వెన్న, ఆవ నూనె, ధనియాల పొడి, వెల్లుల్లి-జీలకర్ర ముద్ద రెండు చెంచాలు, ఉల్లిపాయ తురుము, వేరుశనగ నూనె, పంచదార, చింతపండు గుజ్జు వేయాలి. చేత్తో అన్నింటిని కలపాలి. తరవాత నీళ్లు పోసి కలపాలి. ఈ గిన్నెను స్టవ్‌ మీద పెట్టాలి. పెద్ద మంట మీద పది నిమిషాలు ఉడికించాలి. తరువాత మంట తగ్గించి చిన్న సెగ మీద పావుగంటసేపు మగ్గించాలి. మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ ఉండాలి. చేప ముక్కలు మెత్తబడిన తరవాత ఉప్పు, కారం సరిచూసుకోవాలి. చివరగా ఒక చెంచా వెల్లుల్లి-జీలకర్ర ముద్ద, కొత్తిమీర తరుగు చల్లాలి. రెండు నిమిషాల తరవాత స్టవ్‌ మీద నుంచి దించాలి. ఇలా తయారుచేసుకున్న పులస చేపల పులుసు వేడి అన్నం, చపాతీ, పుల్కాల్లోకి రుచిగా ఉంటుంది.

చిట్కాలు

  • పులుపు తక్కువగా తినేవారు చింతపండును కొద్దిగా తగ్గించుకోవచ్చు. పులుసు ఎంత ఎక్కువగా మరిగితే అంత రుచి పెరుగుతుంది.

  • పులస పులుసును తయారుచేసిన తరువాత ఒక పూట ఆగి తింటే మరింత రుచిగా ఉంటుంది.

చేపల్లో విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. చేపలను తరచూ తినడంవల్ల శరీరంలో ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి. నాడీవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. చేపల్లో కొల్లాజెన్‌ అనే ప్రొటీన్‌ ఉంటుంది. ఇది చర్మం, కీళ్లు, శిరోజాలు, గోళ్ల ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

సాల్మన్‌ చేపల కూర

కావాల్సిన పదార్థాలు

  • సాల్మన్‌ చేప ముక్కలు(స్కిన్‌ లెస్‌)- 600 గ్రాములు (తొమ్మిది పెద్ద ముక్కలు), నూనె- మూడు చెంచాలు, మెంతులు- పావు చెంచా, అల్లం వెల్లుల్లి పేస్టు- ఒక చెంచా, పచ్చి మిర్చి- రెండు, కరివేపాకు- రెండు రెమ్మలు, ఉల్లిపాయ- ఒకటి, టమాటాలు- రెండు, ఉప్పు- తగినంత, పసుపు- అర చెంచా, ధనియాల పొడి- రెండు చెంచాలు, కారం- ఒక చెంచా, కశ్మీరీ కారం- రెండు చెంచాలు, కొత్తిమీర తరుగు- కొద్దిగా

తయారీ విధానం

ఫ ఉల్లిపాయను సన్నని చీలికల్లా కోసుకోవాలి. టమాటాలను చిన్న ముక్కలుగా తరగాలి. స్టవ్‌ మీద వెడల్పాటి గిన్నె పెట్టి, నూనె వేసి వేడి చేయాలి. అందులో సాల్మన్‌ చేప ముక్కలు పరిచి రెండు వైపులా దోరగా వేయుంచి పళ్లెంలోకి తీయాలి. ఆ నూనెలోనే మెంతులు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలపాలి. తరువాత ఉల్లిపాయ చీలికలు, పసుపు వేసి కొద్దిగా ఉప్పు చల్లి మరోసారి కలపాలి. ఉల్లిపాయ చీలికలు ఎర్రగా వేగాక ధనియాల పొడి, కారం, కశ్మీరీ కారం వేసి బాగా కలపాలి. తరువాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు, ఒక చెంచా ఉప్పు వేసి కలిపి ఒక కప్పు నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. గిన్నెలోని మిశ్రమం మెత్తగా ఉడికిన తరువాత... ముందుగా వేయించి పెట్టుకున్న సాల్మన్‌ చేప ముక్కలను వేసి జాగ్రత్తగా కలపాలి. గిన్నె మీద మూతపెట్టి మరో అయిదు నిమిషాలు మగ్గించాలి. తరువాత మూత తీసి కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లి స్టవ్‌ మీద నుంచి దించాలి. సాల్మన్‌ చేప ముక్కల కూరను వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.

చిట్కాలు

  • చేప ముక్కలను చిన్న మంట మీద ఎర్రగా వేపాలి. ముక్క లోపలి వరకూ మెత్తగా ఉడికేలా చూసుకోవాలి.

  • టమాటా గ్రేవీలో చేప ముక్కలు వేసిన తరవాత వాటిని జాగ్రత్తగా కదపాలి. లేదంటే ముక్కలు విరిగిపోతాయి.

చేపలను తినడం వల్ల శరీరానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ లభిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. మానసిక ఆందోళనను తగ్గిస్తాయి. రక్తనాళాల్లో అడ్డంకులను తొలగిస్తాయి. చేపల్లో ఉండే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, కాపర్‌, మాంగనీస్‌, సిలీనియం లాంటి మినరల్స్‌ ఎముకలను బలోపేతం చేస్తాయి.

ఇవి కూడా చదవండి..

డీయూఎస్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయభేరి

హఫీజ్‌ను కలిసినందుకు మన్మోహన్ కృతజ్ఞతలు.. అఫిడవిట్‌లో యాసిన్ మాలిక్ వెల్లడి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 20 , 2025 | 03:29 AM