Share News

Manmohan gratitude Yasin Malik: హఫీజ్‌ను కలిసినందుకు మన్మోహన్ కృతజ్ఞతలు.. అఫిడవిట్‌లో యాసిన్ మాలిక్ వెల్లడి

ABN , Publish Date - Sep 19 , 2025 | 04:35 PM

పాకిస్థాన్‌ నుంచి తాను న్యూఢిల్లీకి తిరిగిరాగానే డీబ్రీఫింగ్ ఎక్సర్‌సైజ్‌లో భాగంగా ఐబీ స్పెషల్ డైరెక్టర్ వీకే జోషి తనను న్యూఢిల్లీలోని ఓ హోటల్‌లో కలిశారని, ప్రధానిని కలిసి ఆ వివరాలు తెలియజేయాల్సిందిగా తనను కోరారని యాసిన్ మాలిక్ తెలిపారు.

Manmohan gratitude Yasin Malik: హఫీజ్‌ను కలిసినందుకు మన్మోహన్ కృతజ్ఞతలు.. అఫిడవిట్‌లో యాసిన్ మాలిక్ వెల్లడి
Yasin Malik with Manmohan Singh

న్యూఢిల్లీ: జైలులో ఉన్న కశ్మీర్ వేర్పాటువాద నేత, జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రండ్ (JKLF) చీఫ్ యాసిన్ మాలిక్ (Yasin Malik) సంచలన విషయం వెల్లడించారు. 26/11 ముంబై దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్‌ (Hafiz Saeed)ను 2006లో పాకిస్థాన్‌ (Pakistan)లో తాను కలుసుకున్నందుకు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ (Manmohan Singh) తనకు కృతజ్ఞతలు తెలిపారని పేర్కొన్నారు. గత ఆగస్టు 25న ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో యాసిన్ మాలిక్ ఈ విషయం తెలిపారు. ఈ అఫిడవిడ్‌ ప్రతిని బీజేపీ నేత అమిత్ మాలవీయ షేర్ చేశారు.


పాకిస్థాన్‌ నుంచి తాను న్యూఢిల్లీకి తిరిగిరాగానే డీబ్రీఫింగ్ ఎక్సర్‌సైజ్‌లో భాగంగా ఐబీ స్పెషల్ డైరెక్టర్ వీకే జోషి తనను న్యూఢిల్లీలోని ఓ హోటల్‌లో కలిశారని, ప్రధానిని కలిసి ఆ వివరాలు తెలియజేయాల్సిందిగా తనను కోరారని యాసిన్ మాలిక్ తెలిపారు. అదే రోజు సాయంత్రం తాను మన్మోహన్‌ సింగ్‌ను కలిసినట్టు చెప్పారు. అప్పుడు జాతీయ భద్రతా సలహాదారు ఎన్‌కె నారాయణ్ కూడా అక్కడే ఉన్నారని అన్నారు. హఫీజ్ సయీద్‌తో సమావేశం వివరాలను చెప్పినప్పుడు తన ప్రయత్నాలు, అంకితభావాన్ని వారు ప్రశంసించారని చెప్పారు. ఐడీ స్పెషల్ డైరెక్టర్ వీకే జోషి విజ్ఞప్తితోనే తాను హఫీజ్‌ను, ఇతర పాక్ మిలిటెంట్ లీడర్లను కలిసానని, అయితే ఆ తర్వాత దురదృష్టవశాత్తూ తాను పాల్గొన్న సమావేశాన్ని వేరే కోణంలోంచి చిత్రీకరించారని మాలిక్ పేర్కొన్నారు.


భారత్ అభ్యర్థన మేరకే కలిసా

పాకిస్థాన్‌లో 2006 జరిగిన సమావేశానికి వెళ్లడం తాను వ్యక్తిగత చొరవతో తీసుకున్నదని కాదని, పాకిస్థాన్‌తో 'అనధికారిక' శాంతి ప్రక్రియలో భాగంగానే భారత ఇంటెలిజెన్స్ అధికారుల విజ్ఞప్తి మేరకే జరిగిందని యాసిన్ మాలిక్ వెల్లడించారు. పాక్ ప్రధానితో సహా ఫహీజ్ సయీద్, ఇతర పాక్ మిలిటెంట్ లీడర్లను కలుసుకోవడం వల్ల కశ్మీర్ అంశంపై శాంతి ప్రక్రియకు ప్రధాని మన్మోహన్‌కు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఐడీ ప్రత్యేక డైరెక్టర్ వీకే జోషి తనను ఢిల్లీలో కలిసి కోరినట్టు తెలిపారు. అందుకు అంగీకరించిన తాను సయీద్, ఇతర నేతలను పాకిస్థాన్‌లో జరిగిన యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ సమావేశంలో కలుసున్నానని వెల్లడించారు. ఇది బహిరంగంగానే జరిగిదని, సమావేశం వివరాలను కూడా తాను భారత అగ్రనాయకత్వానికి తెలియజేశానని చెప్పారు.


తనపై బనాయించిన UAPA కేసులో 2006 సమావేశాన్ని ఎంతమాత్రం పరిగణనలోకి తీసుకోరాదని యాసిన్ మాలిక్ పేర్కొన్నారు. ఇది తనను వంచించడమే అవుతుందన్నారు. తనను శాంతి, సామరస్యానికి పాటుపడిన వ్యక్తిగానే చూడాలన్నారు. అయితే ఇందుకు విరుద్ధంగా పాక్ సమవేశం జరిగిన 13 ఏళ్ల తర్వాత, అది కూడా 370వ అధికరణ, 35ఎ అధికరణ రద్దుకు ముందు తనపై UAPA కేసు బనాయించి, తనపై టెర్రరిస్టు ముద్ర వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.


ఎన్ఐఏ అప్పీల్‌

టెర్రర్ ఫండింగ్ కేసులో 2017లో యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు విధించారు. అయితే శిక్షను మరింత పెంచి మరణశిక్ష విధించాలని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఢిల్లీ హైకోర్టును ఇటీవల కోరింది. దీనిపై నవంబర్ 10వ తేదీలోగా జవాబివ్వాలని యాసిన్ మాలిక్‌ను కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో యాసిన్ మాలిక్ తాజా అఫిడవిట్‌ను దాఖలు చేశారు. 2022లో విచారణ కోర్టు యాసిన్ మాలిక్‌ను టెర్రర్ ఫండింగ్ కేసులో దోషిగా నిర్దారిస్తూ యావజ్జీవ ఖైదు విధించింది. మరణశిక్ష విధించేందుకు అర్హమైన అరుదైన కేసుగా ఈ కేసును భావించడం లేదని స్పష్టం చేసింది. కశ్మీర్‌లో అశాంతిని సృష్టించేందుకు పాకిస్థాన్ బేస్డ్ గ్రూపులతో యాసిన్ మాలిక్, హఫీజ్ సయీద్, సైయద్ సలాహుద్దీన్, షబీర్ షా కుట్ర పన్నినట్టు ఎన్ఐఏ ఆరోపణగా ఉంది. కాగా, జేకేఎల్ఎఫ్‌పై నిషేధాన్ని 'ఉప' ట్రిబ్యునల్ ఇటీవల మరో ఐదేళ్లపాటు పొడిగించింది.


ఇవి కూడా చదవండి..

పాక్ వెళ్లినప్పుడు సొంత ఇంట్లో ఉన్నట్టుంది.. శామ్ పిట్రోటా వ్యాఖలపై బీజేపీ గరంగరం

యోగీ వస్తారు.. అప్పుడు మరింత కఠిన నిర్ణయాలే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 19 , 2025 | 04:36 PM