Deva Katta Interview: మయసభ తో మళ్లీ ఆ ఫీలింగ్ వచ్చింది
ABN, Publish Date - Aug 24 , 2025 | 03:54 AM
చంద్రబాబునాయుడు... వైఎస్ రాజశేఖరెడ్డి మధ్య స్నేహం, వైరంపై కొన్ని సినిమాలు వచ్చాయి. వాటినే నేపథ్యంగా తీసుకొని దర్శకుడు దేవ కట్టా ‘మయసభ’ అనే వెబ్‌సిరీస్ రూపొందించారు. ‘సోనీ లివ్’ ఓటీటీలో పలు భాషల్లో....
సండే సెలబ్రిటీ
చంద్రబాబునాయుడు... వైఎస్ రాజశేఖరెడ్డి మధ్య స్నేహం, వైరంపై కొన్ని సినిమాలు వచ్చాయి. వాటినే నేపథ్యంగా తీసుకొని దర్శకుడు దేవ కట్టా ‘మయసభ’ అనే వెబ్‌సిరీస్ రూపొందించారు. ‘సోనీ లివ్’ ఓటీటీలో పలు భాషల్లో అందుబాటులో ఉన్న ఈ వెబ్ సిరీ్‌సకు దేశవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ‘ఓర్‌మ్యాక్ మీడియా లిస్ట్’లో ప్రేక్షకులు ఎక్కువగా చూసిన మూడు వెబ్ సిరీ్‌సలలో ఒకటిగా నిలిచింది. ఓ తెలుగు వెబ్‌సిరీస్ టాప్3లో చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో దేవ కట్టాను ‘నవ్య’ పలకరించింది. ‘మయసభ’కు వస్తున్న స్పందన చూస్తే ఎలా అనిపిస్తోంది?
చాలా ఆనందంగా ఉంది. చాలా లిబరేటింగ్‌గా కూడా ఉంది. దర్శకుడిగా నేను ఎదిగానని అనిపించింది. అన్ని వర్గాల ప్రేక్షకులకూ నేను చెప్పాలనుకున్న విషయాలను ఈ వెబ్ సిరీస్ ద్వారా సూటిగా చెప్పగలిగానని అనిపించింది. సాధారణంగా ఏదైనా సినిమా బాగుంటే, విడుదలైన వెంటనే అందరిలోనూ ‘ఈ సినిమా బ్లాక్ బస్టర్’ అనే ఫీల్ వస్తుంది. ‘ప్రస్థానం’ చిత్రం సమయంలో నాకు అలాంటి ఫీలింగ్ కలిగింది. ఇప్పుడు మళ్లీ ‘మయసభ’ ద్వారా అలాంటి అనుభూతే కలుగుతోంది.
ఈ కథను ఇప్పటిదాకా అనేకమంది దర్శకులు సినిమాల రూపంలో చెప్పారు. మళ్లీ దీన్నే ఎందుకు ఎంచుకున్నారు?
ఇప్పటిదాకా వచ్చిన కథలన్నీ ఒక వ్యక్తి కోణం నుంచి వచ్చాయి. అంటే ఒక వ్యక్తి హీరో అవుతాడు. అతని దృష్టికోణం నుంచి కథ నడుస్తుంది. కొందరు హీరోకి మద్దతు ఇస్తారు. మిగిలిన వారందరూ విలన్లుగా మారతారు. కానీ ‘మయసభ’ను జీవిత చరిత్రల్లా చెప్పాలనుకొనలేదు. నా ఉద్దేశంలో ఇది 1970, 1980 దశకాలలో మన తెలుగు రాష్ట్ర చరిత్ర. నా తెలుగు కుటుంబ చరిత్ర. ఈ సమయంలో అనూహ్యమైన రాజకీయ పరిణామాలు ఏర్పడ్డాయి. ఇద్దరు సామాన్యమైన వ్యక్తులు స్నేహంతో కలిసి, రాజకీయంగా వేర్వేరు దారులు పట్టి, ఒకరికొకరు శత్రువులుగా మారినప్పుడు జరిగిన పరిణామాలను ఇందులో స్పృశించాను. దేశ రాజకీయాల్లో కులాన్ని వేరుగా చూడలేం. కానీ కులాన్ని ఎంతవరకు హేతుబద్ధంగా వాడుకోవచ్చు... ఆ తర్వాత అది ఎలా మారుతుందనే విషయాన్ని చెప్పటానికి ప్రయత్నించాను. కులం తప్పా... ఒప్పా అనే చర్చ ఇందులో లేదు. సైద్ధాంతికంగా ప్రారంభమైన పోరాటం వ్యక్తిగతంగా మారి ఒకరినొకరు నాశనం చేసుకొనే స్థితికి రాకూడదనేది నా ఉద్దేశం.
వెబ్‌సిరీ్‌సగా ఎందుకు తీయాల్సివచ్చింది?
మొదట్లో ‘మయసభ’ను వెబ్‌సిరీ్‌సగా తీయాలనే ఆలోచన లేదు. ‘గాడ్ ఫాదర్’ మాదిరిగా మూడు పార్టులు ఉంటే బాగుంటుందనుకున్నా. మొదటి పార్టులో ఇద్దరు సమర్ధులైన, చురుకైన యువకులు తమ జీవితాన్ని ఎలా ప్రారంభించారు? వేర్వేరు పార్టీలలో చేరి ఎలా ఎదిగారు? అనే విషయం ఉంటుంది. రెండో పార్టులో వారిద్దరూ ఎలా శత్రువులుగా మారారనేది ఉంటుంది. మూడో పార్టులో వారు బద్ధశత్రువులుగా ఎలా మారారు? ఒకరినొకరు ఎలా నాశనం చేసుకోవాలనుకున్నారు? అనేది ఉంటుంది. ఈ మూడు పార్టులనూ రెండుగా కుదించటానికి ప్రయత్నించాను. సినిమాగా తీస్తే వీరిద్దరి కథగానే మిగిలిపోతుందని అనిపించింది. దాంతో ఓటీటీ ఫార్మాట్ అనుకున్నాం. బడ్జెట్ కూడా ఎక్కువే అయింది. ‘సోనీ’ మాకు కావాల్సిన బడ్జెట్ ఇచ్చింది.
సినిమాలు... వెబ్‌సిరీ్‌సలు... రెండిటిలో ఏది బెటర్?
నాకు పెద్దగా తేడా అనిపించలేదు. ఆరున్నర గంటల ‘మయసభ’ను 85 రోజుల్లో పూర్తిచేశాం. సాధారణంగా సినిమాల్లో ఎక్కువ వేస్టేజ్ ఉంటుంది. ఎక్కువ తీసి కావాల్సినంతే ఉపయోగించుకుంటారు. కానీ దీనిలో మొత్తం స్ర్కిప్ట్ అంతా ముందే చేతులో ఉంది కాబట్టి వేస్టేజ్ సమస్యే లేదు. అంతేకాకుండా ఇందులో విజువల్స్ ఏ కమర్షియల్ సినిమాకూ తీసిపోవు. ‘మయసభ’ తీసిన తర్వాత రెండు రూపాయల అవుట్‌పుట్‌ను రూపాయితోనే ఇవ్వగలననే నమ్మకం కలిగింది.
‘మయసభ’ మీకు నేర్పిన పాఠం ఏమిటి?
నేను నమ్మిన సిద్ధాంతాన్ని చెబితే ప్రజలు ఆదరిస్తారని తెలుసుకున్నా. నా మనసుకు నచ్చింది చేస్తే, అది అందరికీ నచ్చుతుందనే విషయాన్ని తెలుసుకున్నా. కొన్నిసార్లు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలని కొందరు చెబుతూ ఉంటారు. వారి మాట విని... ఆ ఎలిమెంట్స్‌ను చొప్పించాల్సి ఉంటుంది. అవి స్టోరీకి అడ్డంకి అయితే ఇబ్బంది అవుతుంది. ఉదాహరణకు కొన్నిసార్లు కమర్షియల్‌గా విజయం సాధించటం కోసం పాటలు పెడతారు. ‘మయసభ’లో కూడా పాటలు ఉంటాయి. కానీ అవి కథలో భాగమే.
సీవీఎల్‌ఎన్ ప్రసాద్
అందరినీ కలిపే ఏదో ఒక ఎమోషన్ లేకపోతే నేను కథ రాయలేను. మన దేశంలో కులం లేకుండా రాజకీయాలు లేవు. వీటిని సినిమాల్లో నర్మగర్భంగా చూపిస్తారు. కానీ ‘మయసభ’లో సూటిగా చూపించాను. అందుకే ప్రారంభంలోనే ‘స్టోరీ ఆఫ్ ఇండియా ఈజ్ స్టోరీ ఆఫ్ క్యాస్ట్’ అని వస్తుంది. దీనిని ఆరున్నర గంటల సినిమా అనుకోవచ్చు. ఇందులో అందరూ హీరోలే! వారి వారి దృష్టి కోణాల్లో వారు చేసేది ఒప్పే.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 24 , 2025 | 03:54 AM