Apurva Viveks Inspiring Journey: మహిళా ఖైదీలకు అండ హక్కుల సాధనే అజెండా
ABN, Publish Date - Sep 03 , 2025 | 02:34 AM
‘‘పౌరుల్లో ప్రతి ఒక్కరికీ హక్కులు ఉంటాయి. ఖైదీలు దీనికి మినహాయింపు కాదు. కానీ వారి సమస్యలను ఎవరూ పట్టించుకోరు. వారి తరఫున మాట్లాడడానికి ఎవరూ ముందుకు రారు. ఈ పరిస్థితి మారాలి’’ అంటున్నారు...
‘‘పౌరుల్లో ప్రతి ఒక్కరికీ హక్కులు ఉంటాయి. ఖైదీలు దీనికి మినహాయింపు కాదు. కానీ వారి సమస్యలను ఎవరూ పట్టించుకోరు. వారి తరఫున మాట్లాడడానికి ఎవరూ ముందుకు రారు. ఈ పరిస్థితి మారాలి’’ అంటున్నారు అపూర్వ వివేక్. రాంచీకి చెందిన ఈ న్యాయవాది... మహిళా ఖైదీలను విద్యావంతులను చేయడానికి, న్యాయపరమైన సాయం అందించడానికి పాటుపడుతున్నారు. వారి హక్కుల పరిరక్షణ కోసం తన గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారు.
‘‘తెలిసినవారు ఎవరైనా ఎదురుపడినప్పుడు... ఎక్కడికి వెళ్తున్నారని అడిగేవారు. ‘‘జైలుకు’’ అని చెబితే ఆశ్చర్యంగా చూసేవారు. ఇప్పుడు అందరికీ నేనేమిటో, నేను చేస్తున్న పని ఏమిటో తెలుసు. రోజూ ఎక్కువ సమయం నేను గడిపేది జైల్లోనే మరి’’ అని నవ్వుతూ చెబుతారు అపూర్వ వివేక్. మహిళా ఖైదీల సంక్షేమం కోసం ‘హాషియా సోషియో-లీగల్ సెంటర్ ఫర్ విమెన్’’ (హెచ్‌ఎ్‌సఎ్‌ససిడబ్ల్యూ) అనే సంస్థను ఆమె స్థాపించారు.
పాఠాలతో మొదలుపెట్టి...
2013లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అపూర్వ... ఖాళీ సమయాల్లో పిల్లలకు పాఠాలు చెప్పేవారు. అప్పుడే ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి పని చేయడం ప్రారంభించారు. జైలులో మహిళా ఖైదీల గురించి అధ్యయనం చేయడానికి ఇతర వాలంటీర్లతో కలిసి రాంచీలోని బిర్సాముండా సెంట్రల్ జైలుకు వెళ్ళారు. అక్కడ ఖైదీల జీవన పరిస్థితులను చూసి చలించిపోయారు. ముఖ్యంగా మహిళా ఖైదీల దుస్థితి ఆమెను తీవ్రంగా ఆలోచింపజేసింది. ‘‘చాలామందికి చదువు లేకపోవడం వల్ల వారికి తమ హక్కులేమిటో తెలియదు. న్యాయవాదులు తెచ్చిన కాగితాల మీద గుడ్డిగా సంతకాలు పెట్టడం తప్పితే... వాటిలో ఏం రాసి ఉందో, అది తమకు ఉపయోగమో కాదో అవగాహన లేదు. అందుకే వారికి ప్రాథమిక విద్య నేర్పాలని నిర్ణయించుకున్నాను’’ అని గుర్తు చేసుకున్నారు అపూర్వ. మహిళా ఖైదీలతో పాటు వారి పిల్లలకు కూడా పాఠాలు చెప్పడానికి జైలు అధికారుల అనుమతి తీసుకున్నారు. ‘‘మొదట్లో నన్ను అందరూ అనుమానంగా చూసేవారు. వారి వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి అధికారుల తరఫున వచ్చానని భావించేవారు. క్రమంగా నా ఉద్దేశమేమిటో అర్థం చేసుకున్నారు. కనీసమైన చదువు లేనివారికి అక్షరాలు దిద్దించడం, కూడబలుక్కొని చదవగలిగేవారితో వార్తా పత్రికలు చదివించడంతో జైలులో నా తరగతులు ప్రారంభమయ్యాయి. క్రమంగా వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా తెలిశాయి’’ అని వివరించారు అపూర్వ.
పలు కారాగారాల్లో...
జైలులో గడుపుతున్నవారిలో ఎక్కువమంది విచారణ ఖైదీలు. న్యాయవాదులను నియమించుకొనే స్థోమత లేనివారు. కొందరి తరఫున ప్రభుత్వమే న్యాయవాదులను ఏర్పాటు చేసినా... కేసులు ఏళ్ళ తరబడి సాగుతూనే ఉంటాయి. మహిళా ఖైదీల్లో గర్భిణులు కూడా ఉంటారు. వారికి సరైన వైద్య సహాయం కానీ, పోషకాహారం కానీ ఉండదు. వారికి జన్మించిన పిల్లలకు సరైన సంరక్షణ అందదు. ఈ సమస్యలకు తన వంతుగా ఏదైనా పరిష్కారం చూపాలని ఆపూర్వ అనుకున్నారు. ‘లా’ చదివి, న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. సోషల్ వర్క్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 2022లో ‘హెచ్‌ఎ్‌సఎ్‌ససిడబ్ల్యూ’ సంస్థను ఏర్పాటు చేసి... మహిళా ఖైదీల సంక్షేమం కోసం కార్యక్రమాలను పూర్తిస్థాయిలో ప్రారంభించారు. అప్పటివరకూ నేను ఒంటరిగా చేస్తున్న కార్యక్రమాలను వ్యవస్థాగతం చేశాను. స్వచ్ఛంద సేవకులు, ఔత్సాహికుల భాగస్వామ్యంతో రాంచీ సెంట్రల్ జైల్‌లోని మహిళా ఖైదీలకు విద్యతో పాటు నైపుణ్య శిక్షణను మా సంస్థ తరఫున చేపట్టాం. ఆ తరువాత జైళ్ళ శాఖ అధికారుల ప్రోత్సాహంతో జార్ఘండ్ రాష్ట్రంలోని పలు కారాగారాలకు వాటిని విస్తరించాం. వైద్య శిబిరాల ఏర్పాటు, కుంగుబాటు, మానసికమైన ఒత్తిడిని నివారించడం కోసం కౌన్సెలింగ్, మహిళా ఖైదీల కేసుల్లో న్యాయపరమైన సహాయం, జైలు నుంచి విడుదలైనవారికి పునరావాసం, ఉపాధి కల్పన, వారి పిల్లలకు విద్య, వైద్య సౌకర్యాలు, ఆశ్రయం లాంటి పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. దీనికోసం వివిధ ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటున్నాం’’ అని చెప్పారు అపూర్వ.
చారిటీగా భావించడం లేదు...
ఒకసారి ఒక మహిళా ఖైదీ సమస్య అపూర్వ దృష్టికి వచ్చింది. ఆ ఖైదీ అరెస్ట్ అయినప్పుడు గర్భవతి. ఆమె అబార్షన్ చేయించుకోవాలని అనుకుంది. కానీ దానికి న్యాయపరమైన అనుమతి వచ్చేసరికి ఆరు వారాలకు పైగా సమయం పట్టింది. అప్పటికే సమయం మించిపోయిందని, అబార్షన్ చేయడం కుదరదని వైద్యులు చెప్పారు. ఆమె తీవ్రమైన ఆవేదనకు గురయింది. ఈ సంఘటన నేపథ్యంలో... మహిళా ఖైదీల పునరుత్పత్తి హక్కులపై అపూర్వ చేసిన పోరాటం ‘జార్ఘండ్ ప్రిజన్ మాన్యువల్’లో మార్పులకు దారి తీసింది. ‘‘ఇలాంటి సంఘటనలు భావోద్వేగపరమైన ఒత్తిడిని ఖైదీలకు తీసుకువస్తాయి. తమ బాధను ఎవరికైనా వినిపించాలనుకుంటారు. ఆ బాధ్యతను మేము తీసుకుంటున్నాం. వారికోసం మేము చేస్తున్న ఏ పనినీ చారిటీగా భావించడం లేదు. ఆ మహిళలకు హక్కులు ఉన్నాయి. ఆ హక్కులపై వారికి అవగాహన కల్పించి, వాటిని వినియోగించుకొనేలా చూస్తున్నాం. ఇప్పటివరకూ వేలమంది మహిళా ఖైదీలకు మా సంస్థ ద్వారా సాయపడ్డాం. భవిష్యత్తులో అన్ని జైళ్ళలో మహిళా ఖైదీల ఇబ్బందులను పరిష్కరించాలనేది మా లక్ష్యం’’ అని అంటున్నారు అపూర్వ.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీసులపై కాల్పులు.. రేప్ కేసులో అరెస్టయిన ఎమ్మెల్యే పరార్..
సీఎం సిద్దూ సంచలన కామెంట్స్.. బీజేపీది రాజకీయ యాత్ర
For More National News
Updated Date - Sep 03 , 2025 | 02:34 AM