Harmeet Pathanmajra: పోలీసులపై కాల్పులు.. రేప్ కేసులో అరెస్టయిన ఎమ్మెల్యే పరార్..
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:50 PM
పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్ మజ్రా సంచలనం సృష్టించారు. అత్యాచార ఆరోపణలపై అరెస్టయిన హర్మీత్.. అనూహ్యంగా పోలీసు కస్టడీ నుంచి పరారయ్యాడు. హరియాణాలోని కర్నాల్‌లో పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయాడు.
ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్ మజ్రా అత్యాచార ఆరోపణలపై అరెస్టయ్యారు. అయితే, ఆయన అనూహ్యంగా పోలీసు కస్టడీ నుంచి పరారయ్యాడు. హరియాణాలోని కర్నాల్‌లో పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయాడు ఎమ్మెల్యే. పటియాలలోని సనౌర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న హర్మీత్, తన సహచరులతో కలిసి పోలీసులపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒక పోలీస్ అధికారిని గాయపరిచి, వాహనంతో ఢీకొని తప్పించుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్ మజ్రాను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు గాలింపు చేపట్టారు.
కాగా, ఎమ్మెల్యేపై అత్యాచార కేసు జిరక్‌పూర్‌కు చెందిన ఒక మహిళ ఫిర్యాదు మేరకు నమోదైంది. హర్మీత్ విడాకులు తీసుకున్నట్లు తనకు తప్పుడు సమాచారం ఇచ్చి, 2021లో పెళ్లి చేసుకున్నాడని సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, తన మీద లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడి, అసభ్యకరమైన సందేశాలను పంపినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అయితే, ఈ ఆరోపణలను హర్మీత్ ఖండించారు. ఇవి రాజకీయ కుట్రలో భాగమని, ఆప్ ఢిల్లీ నాయకత్వం తనను లక్ష్యంగా చేసుకుందని ఫేస్‌బుక్ లైవ్‌లో ఆరోపించాడు.
ఇదిలా ఉంటే, ఈ ఘటనలకు ముందు హర్మీత్ పంజాబ్‌లో వరదల నిర్వహణపై తన పార్టీ ప్రభుత్వాన్ని, ఢిల్లీ నాయకత్వాన్ని విమర్శించాడు. ఈ క్రమంలో ఆప్ నేతృత్వంలోని పంజాబ్ సర్కార్ హర్మీత్ భద్రతా సిబ్బందిని ఉపసంహరించి, సనౌర్ నియోజకవర్గంలోని పోలీసు స్టేషన్ కు అధికారులను బదిలీ చేసింది. దీంతో ఈ కేసు రాజకీయ వివాదంగా మారింది, హర్మీత్ తన అరెస్ట్‌ను రాజకీయ కక్షసాధింపుగా చెబుతుండగా.. పోలీసులు అతడిని పట్టుకునేందుకు హరియాణా పోలీసులతో కలిసి గాలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చంద్రబాబు ది గ్రేట్.. సీబీఎన్ కు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న అభినందనలు
250 కోట్ల మంది అకౌంట్లు ప్రమాదంలో.. జీమెయిల్ యూజర్లకు గూగుల్ హెచ్చరిక..
For More AP News And Telugu News