Holy Quran: ముందే మేలుకోవాలి
ABN, Publish Date - Aug 22 , 2025 | 01:42 AM
పూర్వం మక్కా పట్టణం దగ్గర ఒక చిన్న గ్రామంలో ఇబ్రహీం అనే యువకుడు వృద్ధురాలైన తన తల్లితో కలిసి ఉండేవాడు. చిన్నప్పుడే అతని తండ్రి మరణించాడు. తల్లి ఫాతిమా ఎంతో కష్టపడి అతణ్ణి పెంచింది. వయసు మీదపడ్డాక...
సందేశం
పూర్వం మక్కా పట్టణం దగ్గర ఒక చిన్న గ్రామంలో ఇబ్రహీం అనే యువకుడు వృద్ధురాలైన తన తల్లితో కలిసి ఉండేవాడు. చిన్నప్పుడే అతని తండ్రి మరణించాడు. తల్లి ఫాతిమా ఎంతో కష్టపడి అతణ్ణి పెంచింది. వయసు మీదపడ్డాక... ఆమె చూపు మందగించింది. శరీరం బలహీనమైపోయింది. ఇబ్రహీం రోజూ నమాజ్ చేసేవాడు, మంచి పనులు చేసేవాడు. కానీ తల్లి విషయంలో కొంత అసహనంగా ఉండేవాడు. ఆమె చెప్పినమాట సరిగ్గా వినేవాడు కాదు.
ఒకసారి ఇబ్రహీం తన స్నేహితుడితో మాట్లాడుతూ ‘‘నా తల్లి ఎప్పుడూ మంచంలోనే ఉంటుంది. నీరు కావాలని, పాలు కావాలని, అన్నం కావాలని... ఇలా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది. రాత్రంతా దగ్గుతుంది. దానివల్ల నాకు నిద్ర సరిగ్గా పట్టడం లేదు’’ అన్నాడు. అప్పుడు ఆ స్నేహితుడు ‘తల్లి పాదాల కింద స్వర్గం ఉంది’ అనే అంతిమ దైవప్రవక్త మహమ్మద్ ఉపదేశాన్ని గుర్తు చేస్తూ ‘‘నువ్వు ఎన్ని నమాజులు చేసినా, దివ్య ఖుర్‌ఆన్ ఎన్నిసార్లు పఠించినా, దానధర్మాలు చేసినా, ఉపవాసాలు పాటించినా, హజ్ యాత్ర చేసినా, ఉమ్రా యాత్ర చేసినా... అవన్నీ వృధా. కన్న తల్లిని సరిగ్గా పట్టించుకోని వ్యక్తిని చూసి అల్లాహ్ ముఖం తిప్పుకుంటాడు. అతనికి పరలోకంలో కఠినమైన శిక్ష సిద్ధంగా ఉంటుంది’’ అని హెచ్చరించాడు.
ఇబ్రహీం భయంతో వణికిపోయాడు. తల్లిపట్ల తన ప్రవర్తనకు సిగ్గుపడ్డాడు. తన తప్పును తెలుసుకున్నాడు. వెంటనే తల్లి దగ్గరకు వెళ్ళి, తనను క్షమించాలని కోరాడు. సంతోషంతో... అతని శ్రేయస్సుకోసం అల్లా్‌హను ఆమె ప్రార్థించింది. ఆ రాత్రి ఇబ్రహీంకు కలలో ఒక మత గురువు కనిపించి... ‘‘ఈ ఏడాదే నీ తల్లితో కలిసి హజ్ యాత్ర చెయ్యి’’ అని ఆదేశించాడు. ఆ ప్రకారం... తన భుజాలపై తల్లిని కూర్చోబెట్టుకొని... హజ్ యాత్రకు ఇబ్రహీం బయలుదేరాడు. దారంతా ఆమెకు సేవలు చేశాడు. ఆరాధనలు పూర్తి చేసి, ఆమెను మోసుకుంటూ ఇంటికి చేరుకున్నాడు.
మరునాడు తల్లికి పాలు అందించడానికి వెళ్ళిన ఇబ్రహీం ఆమెను తట్టి లేపాడు. కానీ అప్పటికే ఆమె ఇహలోకం వదిలి వెళ్ళిపోయింది. ఇబ్రహీం భోరున విలపించాడు. ‘కొన్నాళ్ళ క్రితం వరకూ తను ఆమె పట్ల ప్రవర్తించిన తీరునే చివరి రోజుల్లో కూడా కొనసాగించి, ఆమెను హజ్ యాత్రకు తీసుకువెళ్ళకపోతే... ఎంతో పాపం మూటగట్టుకొనేవాడినో’ అనుకున్నాడు. ఆఖరి రోజుల్లో ఆమెకు సంతృప్తి కలిగించాలనే జ్ఞానాన్ని ప్రసాదించినందుకు అల్లా్‌హకు, తన స్నేహితుడికి కృతజ్ఞతలు తెలుపుకొన్నాడు.
‘‘మానవుడు తన తల్లితండ్రుల హక్కును గుర్తించాలని స్వయంగా అతనికి నిర్దేశించాం. తల్లితండ్రులతో మంచిగా వ్యవహరించాలి. వారిద్దరూ లేదా వారిలో ఒకరు వృద్ధులై ఉంటే వారిని విసుక్కోవద్దు. వారితో మర్యాదగా మాట్లాడండి. మృదుత్వం, దయాభావం కలిగి ఉండండి, వారి ముందు వినమ్రులై ఉండండి’’ అని దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ స్పష్టం చేశాడు. కాబట్టి ఆలస్యం కాకముందే మేలుకోవాలి.
మహమ్మద్ వహీదుద్దీన్
ఈ వార్తలు కూడా చదవండి..
ఎమ్మెల్యేలు ఇలా చేస్తే ఎలా.. సీఎం చంద్రబాబు ఫైర్
టీటీడీపై వైసీపీ బురద జల్లుతోంది.. జ్యోతుల నెహ్రూ ధ్వజం
Read Latest AP News and National News
Updated Date - Aug 22 , 2025 | 01:42 AM