Knowledge Without Action: ఎంత తెలిసినా ఆచరణ సున్నా
ABN, Publish Date - Dec 12 , 2025 | 01:34 AM
మనం ప్రస్తుతం విజ్ఞాన యుగంలో బతుకుతున్నాం. ప్రపంచంలో ఏ విషయానికి సంబంధించిన సమాచారమైనా మనకు సెకన్లలో అందుబాటులోకి వస్తోంది. మన పూర్వ గ్రంథాలు, ఋషులు, మునులు...
యోగా
మనం ప్రస్తుతం విజ్ఞాన యుగంలో బతుకుతున్నాం. ప్రపంచంలో ఏ విషయానికి సంబంధించిన సమాచారమైనా మనకు సెకన్లలో అందుబాటులోకి వస్తోంది. మన పూర్వ గ్రంథాలు, ఋషులు, మునులు చెప్పిన జ్ఞాన సూత్రాలు, ప్రపంచంలోని ఇతర నాగరికతలకు సంబంధించిన విశేషాలు- ఇలా ఏవి కావాలన్నా సెకన్లలో మన స్ర్కీన్లపై ప్రత్యక్షమవుతున్నాయి. అయితే ఇంత విజ్ఞానం మన కళ్ల ముందే ఉన్నా- మన వ్యక్తిగత జీవితాల్లో, వృత్తిపరమైన కార్యకలాపాలలో, సామాజిక వ్యవహారాలలో వాటిని ఏమాత్రం ఆచరించం. దైనందిక జీవితంలో ఈ వ్యత్యాసం కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకు అధికార హుకుంల కన్నా సామరస్య సూత్రమే మేలైన పద్ధతి అని మనకు తెలుసు. కానీ చాలా సమయాల్లో మనం అధికారాన్నే ఆయుధంగా వాడుకోవాలని చూస్తూ ఉంటాం. పరమాత్మతో అనుసంధానం కావడమే జీవుల పరమోద్దేశమని ప్రతి మతం మనకు చెబుతుంది. అయినా విశ్వాసాలు అనే పొరలు అందరినీ వేర్వేరు చేస్తూ ఉంటాయి. ఇక ఆధ్యాత్మిక మార్గం విషయానికి వస్తే- చాలా మంది సాధకులకు ఆధ్యాత్మిక సిద్ధాంతాలన్నీ తెలుసు. కానీ వారు వాటిని నిజ జీవితంలో ఆచరణలోనే పెట్టరు. అసలు ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయనే విషయాన్ని ఆలోచిద్దాం.
విజ్ఞానపు పరిమితులు...
విజ్ఞానానికి పరిమితులు ఉన్నాయి. ఇది మన మెదడులో మాత్రమే నిక్షిప్తమై ఉంటుంది. కానీ ఒక వ్యక్తి ప్రవర్తన- అతని భావోద్వేగాలు, అలవాట్లు, అభిప్రాయాలు, చుట్టుపక్కల ఉన్న సమాజపు తీరులపై ఆధారపడి ఉంటుంది. బలమైన ఒత్తిడి పెడితే మెదడు లొంగిపోతుంది. భయం, అహంకారం, అభద్రతా భావం మొదలైనవి ప్రవర్తనపై ప్రభావం చూపించడం మొదలుపెడతాయి. మనకు తెలిసిన జ్ఞాన సూత్రాలు వెనక్కి వెళ్లిపోతాయి. అందువల్లే బాగా చదువుకున్నవారు, సంస్కారవంతులు కూడా కొన్నిసార్లు వారి వ్యక్తిత్వానికి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే ఒక వ్యక్తిని విజ్ఞానం మాత్రమే మార్చలేదు. మనం ఈ సమస్యను అహం (ఈగో) కోణం నుంచి కూడా ఆలోచించాలి. ఉన్నతమైన ప్రతీ ఆలోచనకు ఈగో అడ్డుతగులుతూ ఉంటుంది. క్షమాగుణం కావచ్చు, నిగర్వత్వం కావచ్చు, కష్టాలకు స్పందించే గుణం కావచ్చు- ఇలా ప్రతి ఆలోచనకు ప్రతికూలంగా పనిచేసేది ఈగోనే! దానిని రూపుమాపితే తప్ప మన మెదడులో నిక్షిప్తమై ఉన్న విజ్ఞానానికి బలం చేకూరదు. అయితే ఈ ఈగో చాలా బలమైనది. ‘నేను ఎందుకు తగ్గాలి? తగ్గితే నాకున్న గౌరవం పోతుందేమో’- లాంటి వాదనలను మనసుకు వినిపిస్తూ ఉంటుంది. మనిషి మనసులో జరిగే ఈ అంతర్యుద్ధంలో విజ్ఞానం చాలా సందర్భాలలో ఓడిపోతూ ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే మనిషి అణువణువులోనూ మార్పు రావాలి. ఈ మార్పు హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది. మానవుడిలో అహం పొరలు కరిగిపోయి దైవ లక్షణాలు చేకూరతాయి. అయితే ఇది ఒక రోజులో వచ్చే మార్పు కాదు. కొన్ని ఏళ్ల తరబడి చేయాల్సిన సాధన. దీనికి కొన్ని సూత్రాలున్నాయి.
ప్రతి రోజూ ఒక పది నిమిషాలు నిజాయితీగా ‘మన విలువలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నామా?’ అని ఆత్మశోధన చేసుకోవడం. పరివర్తన అనేది అవగాహనతోనే ప్రారంభమవుతుంది.
ఎలాంటి స్థితిలోనైనా స్పందించే ముందు- ఒక లిప్తపాటు కాలం ఆగడం. దీనివల్ల మనలో నిబిడీకృతమైన విలువలు బయటకు వచ్చే అవకాశముంది.
మనకు మనస్సే దిక్సూచి. అది చెప్పినట్లు వింటే సమస్యలే ఉండవు. ఆ మనస్సు చూపే మార్గాన్ని అనుసరించడమే ఆచరణీయం.
ఒక చర్యను పదే పదే చేస్తూ ఉంటే సులభమవుతుంది. సత్ ప్రవర్తనను విషయంలోనే అదే అనుసరించడం మంచిది.
మానవుడి లక్ష్యం...
మానవుడి జీవన లక్ష్యం విజ్ఞాన సముపార్జన కాదు. ఆ విజ్ఞానాన్ని తన అభివృద్ధికి, సమాజ అభివృద్ధికి ఉపయోగించడం. ఈ విషయాన్ని మెదడు గ్రహిస్తే- మనస్సు అనుభవిస్తుంది. ‘నేను’అనే అహం కరిగిపోయి... సహకరిస్తుంది. అప్పుడు తీసుకొనే చర్యలు నిజమైన ఉద్దేశాలను ప్రతిబింబిస్తాయి. అప్పుడు కరుణ, ప్రేమ లాంటివి సహజంగా బహిర్గతమవుతాయి. ప్రకృతితో మన జీవనం మమేకమవుతుంది. ఆ సమయంలో విజ్ఞానానికి, దాని ఆచరణకు మధ్య తేడా ఉండదు.
డాక్టర్ శరత్‌రెడ్డి కార్డియాలజిస్ట్,
ట్రైనర్, హార్ట్‌ఫుల్‌నెస్ 9440087532
ఇవీ చదవండి:
వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీపై అధ్యక్షుడు ట్రంప్ పొగడ్తలు.. ఆమె సూపర్ స్టార్ అంటూ..
మన దేశానికి రష్యా అధ్యక్షులెవరూ ఇందుకే రారు.. పాక్ జర్నలిస్టు ఆవేదన
Updated Date - Dec 12 , 2025 | 01:34 AM