Kerala Women Travelers: డెబ్బయిల్లోనూ.. ఊళ్లు చుట్టేస్తున్నారు
ABN, Publish Date - Nov 12 , 2025 | 06:09 AM
వారిద్దరూ బాల్య స్నేహితులు. లోకమంతా చుట్టెయ్యాలనే ఆశ. కానీ అప్పట్లో అది తీరలేదు. వివాహం తరువాత దూరమైనా, కొన్నేళ్ళ తరువాత మళ్ళీ కలిశారు. ఒక విదేశంతో సహా... పదమూడు ప్రాంతాలు...
వారిద్దరూ బాల్య స్నేహితులు. లోకమంతా చుట్టెయ్యాలనే ఆశ. కానీ అప్పట్లో అది తీరలేదు. వివాహం తరువాత దూరమైనా, కొన్నేళ్ళ తరువాత మళ్ళీ కలిశారు. ఒక విదేశంతో సహా... పదమూడు ప్రాంతాలు చూసొచ్చారు. ‘‘ఇప్పుడు మాకు డెబ్భై రెండేళ్ళు. ఆరోగ్యంగా ఉన్నంతకాలం పర్యటనలు కొనసాగిస్తూనే ఉంటాం’’ అంటున్న కేరళ మహిళలు సరోజిని, పద్మావతి... భ్రమణ కాంక్షకు వయసు అడ్డంకి కాదని నిరూపిస్తున్నారు.
సరోజిని, పద్మావతి... ఇద్దరిదీ కేరళలోని మాతమంగళం పట్టణం. ఒకటే వయసున్న ఇద్దరూ కలిసే బడికి వెళ్ళేవారు. దారిలో ఎన్నెన్నో కబుర్లు. కోల్‌కతా, ముంబయి, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ... ఇలా ఏ ఊరి పేరు విన్నా... ఆ ప్రాంతాల్లో ఉన్న విశేషాల గురించి చెప్పుకొనేవారు. ఆ ఊళ్ళన్నీ చూడాలని కలలు కనేవారు. అయితే ఆ బాల్య స్నేహితులకు తమ కలలను తీర్చుకొనే అవకాశం అప్పట్లో కలగలేదు. కొన్నేళ్ళకు సరోజినికి వివాహం కావడంతో ఆమె వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. ‘‘ఆ రోజుల్లో టెలిఫోన్లు మాకు అందుబాటులో ఉండేవి కావు. ఏవైనా శుభకార్యాలకు లేదా వారి సొంత ఊళ్ళో ప్రసిద్ధమైన కలియట్టం పండుగకు సరోజిని వచ్చినప్పుడు మాత్రమే కలుసుకొనేవాళ్ళం. సద్మావతికి పొరుగు ఊరికి చెందిన వ్యక్తితో వివాహం కావడంతో ఆ ప్రాంతంలోనే స్థిరపడింది. నా భర్త సైన్యంలో పని చేయడంతో అనేక రాష్ట్రాల్లో నివసించడానికి, పలు ప్రదేశాలను సందర్శించడానికి నాకు అవకాశం కలిగింది’’ అని గుర్తు చేసుకున్నారు సరోజిని. ఆమె భర్త మరణించడంతో... కొన్నేళ్ళ క్రితం మాతమంగళానికి వచ్చి... అక్కడే స్థిరపడ్డారు. మళ్ళీ ఆ స్నేహితులిద్దరూ తరచుగా కలుసుకొనేవారు. కొత్త ప్రాంతాలకు కలిసి తిరగాలనే వారి చిన్ననాటి కోరిక మళ్ళీ బలపడింది.
పింఛన్ డబ్బు దాచుకొని...
‘‘మా స్నేహం గురించి మా పిల్లలకు తెలుసు. ఇద్దరం కలిసి పర్యటనలు జరపాలనుకుంటున్నామని వారికి చెప్పగానే.... మా నిర్ణయాన్ని గట్టిగా బలపరచడమే కాదు... ఏర్పాట్లన్నీ చేయడానికి ఎంతో ఉత్సాహం చూపించారు. కానీ మరీ అవసరమైతే తప్ప వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడం మాకు ఇష్టం లేదు. అందుకే మా పింఛన్ డబ్బులను దాచుకోవడం ప్రారంభించాం. ముందుగా దగ్గరలోని ప్రసిద్ధ దేవాలయాలకు వెళ్ళాలని ప్రణాళిక వేసుకున్నాం’’ అని వివరించారు సరోజిని, పద్మావతి. కేరళలోని శబరిమల, గురువాయూరు, తమిళనాడులోని రామేశ్వరం, మదురై, ధనుష్కోటి, పళని తదితర ఆలయాలను సందర్శించారు. ఆ పర్యటనల్లో... కొందరు టూరిస్ట్ ఆపరేటర్లు, పర్యాటక బృందాల సభ్యులు వారికి పరిచయమయ్యారు. వారితో కలిసి ఉత్తర భారతదేశ యాత్రలు చేపట్టారు. వారణాసి, బదరీనాథ్, కేదార్‌నాథ్, రాజస్థాన్, గుజరాత్, కశ్మీర్... ఇలా ఎన్నో ప్రాంతాలు చుట్టేశారు. ‘‘ఇప్పటివరకూ మేము చూసిన వాటన్నిటిలో అందమై ప్రదేశం... కశ్మీర్. ఇక... కేదార్‌నాథ్‌కు గుర్రం మీద వెళ్ళాం. అది మరచిపోలేని అనువభవం. ఇటీవలే హైదరాబాద్ వెళ్ళొచ్చాం. మాకు బాగా నచ్చేసింది’’ అంటున్నారు పద్మావతి, సరోజిని.
జ్ఞాపకాల బహుమతి
‘‘ఇప్పటివరకూ మేము సందర్శించిన విదేశం ఒక్కటే... మలేషియా. దానికోసం చాలా నెలలపాటు పింఛన్ డబ్బులు దాచుకున్నాం. వచ్చేనెలలో కోల్‌కతా వెళ్తున్నాం. ప్రతి పర్యటనకు ముందు... ఎక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకోవడం, వాటికోసం ఏర్పాట్లు చేసుకోవడం మాకు ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది. ప్రతి పర్యటనా మాకు ఎన్నో జ్ఞాపకాలను బహుమతిగా ఇస్తోంది. ఎంతో సంతోషం కలిగిస్తోంది. అందుకే... ఆరోగ్యంగా ఉన్నంతవరకూ ప్రయాణాలు కొనసాగిస్తాం’’ అని చెబుతున్నారు ఈ బాల్యమిత్రులు.
ఇవి కూడా చదవండి
ఢిల్లీ పేలుళ్లు.. నిధులు సమీకరణలో కీలకంగా మహిళా డాక్టర్
ఎన్డీయేదే విజయం.. 7 ఎగ్జిట్ సర్వేలు జోస్యం
Updated Date - Nov 12 , 2025 | 06:28 AM