Protein In Rice: అన్నంలో ప్రొటీన్లు పోకుండా
ABN, Publish Date - Aug 07 , 2025 | 01:49 AM
అన్నం తింటే లావైపోతాం. దీన్లో పిండిపదార్థాలు, చక్కెరలు మాత్రమే ఉంటాయి అనేది ఇప్పటివరకూ మనకున్న నమ్మకం. కానీ అన్నంలో ప్రొటీన్ల శాతం క్రమంగా పెరుగుతోందని పరిశోధనల్లో వెల్లడైంది. అటుకులు, మరమరాలు, బ్రౌన్ రైస్, పారాబాయిల్డ్ రైస్...
కౌన్సెలింగ్
డాక్టర్! తెల్ల అన్నంలో పిండి పదార్థాలు మినహా ప్రొటీన్లు ఉండవని అంటూ ఉంటారు. ఇదెంతవరకూ నిజం? పిల్లల్లో ఎదుగుదల లోపాలకు ఈ అంశమే కారణమా?
- ఓ సోదరి, హైదరాబాద్
అన్నం తింటే లావైపోతాం. దీన్లో పిండిపదార్థాలు, చక్కెరలు మాత్రమే ఉంటాయి అనేది ఇప్పటివరకూ మనకున్న నమ్మకం. కానీ అన్నంలో ప్రొటీన్ల శాతం క్రమంగా పెరుగుతోందని పరిశోధనల్లో వెల్లడైంది. అటుకులు, మరమరాలు, బ్రౌన్ రైస్, పారాబాయిల్డ్ రైస్, పాలి్‌షడ్ రైస్... ఇలా దక్షిణ భారతదేశంలో వాడుకలో ఉండే బహురూప బియ్యం మీద జరిపిన పరిశోధనల ద్వారా బియ్యాన్ని ప్రొటీన్ డైట్‌లో భాగం చేసుకోవచ్చనే వాస్తవం తెలిసింది. అయితే బియ్యంలో పోషకనష్టం జరగకుండా ఉండాలంటే తెల్లగా పాలిష్ పట్టకూడదు. బియ్యాన్ని పాలిష్ పట్టడం వల్ల పైపొరల్లో ఉండే బి1, బి2, బి6 విటమిన్లు నష్టపోయి పిండి పదార్థాలు మాత్రమే మిగిలిపోతాయి. కాబట్టి సన్నబియ్యం బదులుగా మర ఆడించని లేదా ఒక పట్టు బియ్యం, దంపుడు బియ్యం తినటం అలవాటు చేసుకోవాలి. అలాగే పోషకాహార లోపం పెద్దలతో పాటు పిల్లల్లో కూడా పెరుగుతోంది. అందుకు కారణం పదార్థాల్లోని పోషకాల పట్ల అవగాహన లేకపోవడమే!
ఐదేళ్లలోపు 39% మంది పిల్లల్లో వయసుకు తగిన ఎత్తు పెరగకపోవటమనే లోపం మన దేశంలో ఎంతోకాలంగా కొనసాగుతోంది. ఈ లోపానికి జన్యుపరమైన, వంశపారంపర్యమైన ఇతరత్రా కారణాలతోపాటు పోషకాహారలోపం కూడా ఓ ప్రధాన కారణమని పరిశోధనల్లో వెల్లడైంది. ఈ పోషకాహారలోపంలో కీలకమైంది తగినంత ఎదుగుదలకు తోడ్పడే ప్రొటీన్ ఆహారంలో ఉండకపోవటం.
ఇందుకు ప్రధాన కారణం ఏ పదార్థాల్లో ప్రొటీన్లు, ఇతర పోషకాలు ఉంటాయో అవగాహన లేకపోవటమే! ఈ దిశగా ఆలోచించి ప్రొటీన్లు ఎక్కువగా ఉండే మాంసాహారం మీద పరిశోధన చేసినప్పుడు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. వేర్వేరు మాంసాల్లోని ప్రొటీన్ల పరిమాణాల్లో, ఒకే జంతువులోని వేర్వేరు శరీర భాగాల్లోని ప్రొటీన్ పరిమాణాల్లో హెచ్చుతగ్గులున్నట్టు తెలిసింది. ఈ పరిశోధన ఆధారంగా విడుదలచేసిన ఫుడ్ టేబుల్ ఆధారంగా పిల్లలకు ఆహారం అందించగలిగితే ప్రొటీన్ లోపాన్ని అరికట్టవచ్చు.
డాక్టర్. పి.ఉదయ్ కుమార్
ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్త,
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్
(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్)
హైదరాబాద్.
ఈ వార్తలు కూడా చదవండి..
జీవీఎంసీ స్టాడింగ్ కమిటీ ఎన్నికల్లో స్తతా చాటిన కూటమి
ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు
మరిన్నీ తెలుగు వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Aug 07 , 2025 | 01:49 AM