Geethu Shivakumar: గీతు ఐటీలో టాప్
ABN, Publish Date - Sep 20 , 2025 | 03:20 AM
ఆ అమ్మాయి హైస్కూల్ వయసులోనే జేబు ఖర్చుల కోసం వెబ్‌సైట్స్ రూపొందించింది. 19 ఏళ్ల వయసులో హ్యాకథాన్‌లో ఉత్తమ వెబ్ డెవలపర్‌గా ముఖ్యమంత్రి నుంచి అవార్డును అందుకుంది...
ప్రేరణ
ఆ అమ్మాయి హైస్కూల్ వయసులోనే జేబు ఖర్చుల కోసం వెబ్‌సైట్స్ రూపొందించింది. 19 ఏళ్ల వయసులో హ్యాకథాన్‌లో ఉత్తమ వెబ్ డెవలపర్‌గా ముఖ్యమంత్రి నుంచి అవార్డును అందుకుంది. ఆ ప్రతిభే ఆమెను నేడు ఐదు దేశాలకు ఐటీ కంపెనీలు నడిపే స్థాయికి చేర్చింది. తిరువనంతపురానికి చెందిన గీతు శివకుమార్ ప్రస్థానమిది. ఆసక్తికరమైన ఆమె ఐటీ ప్రయాణం గురించి తెలుసుకుందాం!
కళాశాలలో నిర్వహించిన హ్యాకథాన్‌లో ఏకైక మహిళా విజేతగా పేరు తెచ్చుకుంది గీతు శివకుమార్. ఇది పదిహేనేళ్ల నాటి సంగతి. ఇప్పుడామె మొబైల్ యాప్స్ అభివృద్ధితో పాటు డిజిటల్ మార్కెటింగ్ చేపట్టే కేరళలోని ‘పేస్ హైటెక్’ సాఫ్ట్‌వేర్ కంపెనీ సిఇఒ. గీతకు పట్టుదలే ప్రధానం. పరిస్థితులకు తగ్గట్టు అలవాటు పడే ధైర్యాన్ని కలిగి ఉండడం, సవాళ్లను ఎదుర్కొనే తెగువను కలిగి ఉండడం ముఖ్యమని అంటుంది గీతు.
‘‘2015లో ‘పేస్ హైటెక్’ను ప్రారంభించినప్పుడు, ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ఉన్నాను. హ్యాకథాన్ విజేతగా, దానికి న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించాను. అయితే ఆ ఈవెంట్ మొత్తంలో నాకు కేవలం ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మాత్రమే కనిపించారు. పరిస్థితిలో ఇంకా మార్పు రాలేదని నేనప్పుడే గ్రహించాను. అమ్మాయిలు పెళ్లి చేసుకుని, అత్తగారింటికి వెళ్లిపోవడమే సరైన మార్గమనే నమ్మకం మన సమాజంలో లోతుగా పాతుకుపోయింది. తల్లితండ్రుల ఒత్తిడి వల్ల ప్రతిభను పక్కనపెట్టిన ఎంతో మంది అమ్మాయిలను నేను చూశాను. కానీ నిజానికి ఆడపిల్లలకు తల్లితండ్రుల మద్దతు ఎంతో అవసరం. అది లేకపోతే ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉండాలి. స్వయంగా అద్దె కట్టుకుంటూ, ఖర్చులను భరించగలిగితే ఆడపిల్లలను నియంత్రించే శక్తి ఎవరికీ ఉండదు’’ అంటూ సమాజంలో ప్రతిభావంతులైన ఆడపిల్లల పరిస్థితి గురించి ఒక సందర్భంలో వివరించింది గీతు.
స్వయంకృషితో ఎదిగి...
గీతు స్వతంత్ర ప్రస్థానం ఎంతో చిన్న వయసులోనే మొదలైంది. హైస్కూల్‌లో ఉన్నప్పుడే వ్యక్తిగత ఖర్చులకు సరిపడా డబ్బు సంపాదించుకోవడం కోసం ఫ్రీల్యాన్సర్‌గా వెబ్‌సైట్లు రూపొందించడం మొదలుపెట్టింది. 2011లో, రాష్ట్రస్థాయి ఐటి ఫెస్ట్‌లో కేరళకు చెందిన ఉత్తమ వెబ్ డెవలపర్‌గా ముఖ్యమంత్రి ఉమేన్ చాందీ నుంచి అవార్డు కూడా అందుకుంది. కానీ ఆమె అక్కడితో సంతృప్తి చెందలేదు. ‘‘పరిశ్రమలో ఎక్కువ దోపిడీకి గురయ్యేవాళ్లు ఫ్రీల్యాన్సర్లే! అతి తక్కువ వేతనానికి ఎంతో ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు. కాబట్టే నేను ఫ్రీల్యాన్సర్‌గా మిగిలిపోవాలనుకోలేదు. సొంతగా ఏదైనా మొదలుపెడదామని అనుకున్నాను. అది రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదు. క్రమేపీ నా మీద నాకు స్పష్టత ఏర్పడిన తర్వాత ఆ నిర్ణయం తీసుకున్నాను. అయితే ఐటి పరిశ్రమ నుంచి ఏమాత్రం మద్దతు దక్కలేదు. అప్పటికే సేవల కంపెనీలతో నిండిపోయిన మార్కెట్లో నేను నిలదొక్కుకోలేనని ఎంతో మంది అన్నారు. కానీ మా కాలేజీ ప్రిన్సిపాల్, కాలేజీలో ఉన్న ఇంక్యుబేటర్‌ను ఉపయోగించుకోమని నన్ను ప్రోత్సహించారు. ఆ విధంగా నాదైన ఉనికిని సృష్టించుకోగలిగే అవకాశాన్ని అందుకోగలిగాను’’ అంటూ చెప్పుకొచ్చింది గీతు.
కృత్రిమ మేథస్సుకు ధీటుగా...
గీతు... ఇంజనీరింగ్ చివరి ఏడాది నాటికి ప్లేస్‌మెంట్ కంపెనీలు అందించే జీతం కంటే ఎక్కువ సంపాదించడం మొదలుపెట్టింది. అదే సమయంలో సొంత కంపెనీ నడపగలిగే సత్తా ఉన్నప్పుడు, ఇంకొకరి కింద పనిచేయడం ఎందుకని అనుకుంది. కానీ ఆ తర్వాత కృత్రిమ మేథ మూలంగా సాఫ్ట్‌వేర్ పరిశ్రమ వేగంగా మారిపోవడం మొదలుపెట్టింది. గీతు ఆ పరిస్థితికి బెదిరిపోకుండా, దాన్నొక సవాలుగా స్వీకరించింది. ‘‘మానవ సృష్టిని ఏదీ అధిగమించలేదని అనుకునేదాన్ని. కానీ కృత్రిమ మేధ కవిత్వం రాసేయడం, విజువల్స్‌ను రూపొందించడం చూసి, నా ఆలోచన తప్పని అర్థం చేసుకున్నాను. ఆ పరిస్థితికి అలవాటుపడకపోతే నా ఉనికి కనుమరుగైపోయే ప్రమాదం ఉందని కూడా గ్రహించాను. అలా కృత్రిమ మేధను పరిగణనలోకి తీసుకుని కంపెనీ సేవలను కొత్తగా తీర్చిదిద్దాను. కృత్రిమ మేధ చేయలేని పనులను కనిపెట్టాను. అలా ఈ రంగంలో వెనకబడిపోకుండా నిలదొక్కుకోగలిగాను’’ అంటూ తాను అధిరోహించిన అతి పెద్ద అవరోధం గురించి వివరించింది గీతు. నేడు గీతు సారఽథ్యంలోని ‘పేస్ హైటెక్’ కంపెనీ కార్యాలయాలు భారతదేశమంతటా విస్తరించాయి. సింగపూర్, మధ్యప్రాచ్యంలో కూడా ఈ కంపెనీ కార్యాలయాలున్నాయి. పట్టుదలతో ప్రయత్నిస్తే సాధ్యంకానిదంటూ ఉండదు. తాజా పోకడలకు తగ్గట్టు మనల్ని మనం మలుచుకుంటూ ముందుకు సాగగలిగితే ఎన్ని సవాళ్లు ఎదురైనా... విజేతగా నిరూపించుకోగలుగుతాం అనడానికి గీతు కథే ఒక ఉదాహరణ.
ఇవి కూడా చదవండి..
డీయూఎస్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయభేరి
హఫీజ్‌ను కలిసినందుకు మన్మోహన్ కృతజ్ఞతలు.. అఫిడవిట్‌లో యాసిన్ మాలిక్ వెల్లడి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 20 , 2025 | 03:20 AM