Dental Implants: శాశ్వత పలువరుస కోసం
ABN, Publish Date - Sep 02 , 2025 | 04:11 AM
దంతాలు ఊడిపోతే, పైబడే వయసులో ఇవన్నీ సహజమే అని సర్దుకుపోయేవాళ్లే ఎక్కువ. కానీ దంతాల లోపం... జీవన నాణ్యతనూ, ఆయుష్షునూ తగ్గిస్తుంది. కాబట్టి ‘ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్’తో నాణ్యమైన కొత్త జీవితాన్ని మొదలు...
డెంటల్ ఇంప్లాంట్స్
దంతాలు ఊడిపోతే, పైబడే వయసులో ఇవన్నీ సహజమే అని సర్దుకుపోయేవాళ్లే ఎక్కువ. కానీ దంతాల లోపం... జీవన నాణ్యతనూ, ఆయుష్షునూ తగ్గిస్తుంది. కాబట్టి ‘ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్’తో నాణ్యమైన కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలంటున్నారు వైద్యులు.
పైబడే వయసులో పెద్దల్లో ఎముకలు క్షీణించి దంతాలు పూర్తిగా ఊడిపోతాయి. కొందరికి నోట్లో కొన్ని దంతాలే మిగిలి ఉంటే, ఇంకొందరికి ఉన్న దంతాలన్నీ కదులుతూ ఉంటాయి. ఈ కోవకు చెందిన వాళ్లందరూ ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్‌ను ఎంచుకోవచ్చు. అయితే ఇందుకు కొన్ని ఆరోగ్యపరమైన అర్హతలు కూడా కలిగి ఉండాలి. శారీరకంగా చురుగ్గా ఉంటూ, ఆరోగ్య సమస్యలన్నీ అదుపులో ఉన్నవాళ్లు ఈ రకమైన ఇంప్లాంట్స్‌కు పూర్తి అర్హులు. మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలున్నప్పుడు మందులతో అదుపులోకి తెచ్చుకుని, ఈ ఇంప్లాంట్స్‌ను అమర్చుకోవచ్చు. గుండె సమస్యలున్నవారు, ఈ దంతాలను అమర్చుకోవాలనుకుంటే, రక్తం పలుచనయ్యే మందులను ఐదు రోజుల పాటు ఆపవలసి ఉంటుంది. ఈ సందర్భంలో గుండె వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి.
రెండు రకాల ఇంప్లాంట్స్
ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్‌లో...‘టు స్టేజ్ ఇంప్లాంట్స్’, ‘సింగిల్ స్టేజ్ ఇంప్లాంట్స్’ అనే రెండు రకాలుంటాయి. ఇవి ఎవరికంటే....
టు స్టేజ్ ఇంప్లాంట్స్: వీటిని రెండు దశల్లో అమరుస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉండి, ఎముక దృఢంగా ఉండి, అత్యవసరంగా ఇంప్లాంట్స్ అమర్చుకోవలసిన అవసరం లేని వాళ్ల కోసం ఉద్దేశించిన ఇంప్లాంట్స్ ఇవి. ఈ ప్రక్రియలో మొదట దవడలో ఇంప్లాంట్స్‌ను అమర్చి, అవి పూర్తిగా ఎముకలో కలిసిపోయిన తర్వాత వాటికి క్యాప్స్ బిగించి, ఆ తర్వాత దంతాలను బిగిస్తారు
సింగిల్ స్టేజ్ ఇంప్లాంట్స్: ఒక వారంలో బిగించే ఇంప్లాంట్స్ ఇవి. ఎముక క్షీణించిన వారికి ఉద్దేశించిన ఈ ఇంప్లాంట్స్‌ను బిగించిన తర్వాత, రెండు నుంచి ఐదు రోజుల్లోపు దంతాలను అమరుస్తారు. అయితే దంతాలు బిగించిన తర్వాత మూడు నెలల పాటు గట్టి పదార్థాలను తినకూడదు.
వైద్యులు, ఉత్పత్తులు, రోగుల పరిస్థితి, స్వభావం... ఈ నాలుగు అంశాలూ ఫుల్ మౌత్ ఇంప్లాంట్ విజయావకాశాలను నిర్థారిస్తాయి. అనుభవమున్న సమర్థమైన వైద్యుల పర్యవేక్షణలో, మన్నికైన ఉత్పత్తులను ఎంచుకున్నప్పటికీ, ఇంప్లాంట్స్ పట్ల రోగులకున్న అంచనాలు వాస్తవానికి దగ్గరగా లేనప్పుడు నిరాశకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎముక దృఢత్వాన్ని పూర్తిగా కోల్పోయిన వారు, దంతాలు పూర్తిగా దెబ్బతిన్నవాళ్లు.. ఇలా రోగులు పలు రకాల పరిస్థితుల్లో వైద్యులను కలుస్తూ ఉంటారు. ఇంప్లాంట్స్‌తో వీళ్లందరికీ ఒకే రకమైన ఫలితం కనిపించకపోవచ్చు. కొందరికి మెరుగైన ఫలితం కనిపించవచ్చు. ఇంకొందరికి కొంత అసౌకర్యం ఉండొచ్చు. అయితే ఇవి శాశ్వత దంతాలు కాబట్టి కొందరికి అవసరాన్ని బట్టి అదనపు చికిత్సలు చేయవలసి రావచ్చు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా రోగులు ఈ ఇంప్లాంట్స్‌ను తమ శరీరంలో భాగాలుగా స్వీకరించే స్వభావాన్ని అలవరుచుకోవాలి. ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ బిగించుకున్న ఇతరులతో తమను తాము పోల్చుకోకూడదు. ఈ ఇంప్లాంట్స్‌తో జీవితం మెరుగు పడుతుందనీ, అన్నీ తినగలిగే వీలుండడం వల్ల ఆరోగ్యం పెరుగుతుందనీ, నలుగురిలో ఆత్మవిశ్వాసంగా తిరగగలిగే వీలుంటుందనే సానుకూల ధృక్పథాన్ని కూడా కలిగి ఉండాలి.
ఆయుర్దాయం పెంచే దంతాలు
దంతాలు లేని వాళ్లు కొన్ని పదార్థాలకే పరిమితమైపోతారు. నమిలే వీల్లేని మెత్తని పదార్థాలకే పరిమితమైపోతారు. దాంతో పోషక లోపాలకు లోనై, రోగనిరోధకశక్తి కుంటుపడి, తరచూ ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటారు. దాంతో ఆయుర్దాయం తగ్గుతుంది. దంతాల లోపంతో నలుగురిలో కలవడానికి ఇష్టపడకుండా ఇంటికే పరిమితమైపోవడం వల్ల ఒంటరితనం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. దంతాలు లేని వారిలో ఆహారలోపం వల్ల చేతులు వణకణం, బలహీనత లాంటివి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దంతాలు బిగించుకుని ఆత్మవిశ్వాసంతో పాటు ఆరోగ్యాన్నీ, తద్వారా ఆయుర్దాయాన్నీ పెంచుకోవాలి.
జాగ్రత్తలు తప్పనిసరి
ఇంప్లాంట్స్ అమర్చిన తర్వాత తగిన జాగ్రత్తలు పాటించనప్పుడు విఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే...
దంతాలు శుభ్రంగా ఉంచుకుంటూ గార పట్టకుండా చూసుకోవాలి
వాటర్ ఫ్లాసింగ్ చేసుకుంటూ ఉండాలి
బఠాణీలు నమలడం, ఎముకలు కొరకడం, దంతాలతో సీసాల మూతలు తీయడం లాంటివి చేయకూడదు
ఆరు నెలలకోసారి స్కేలింగ్ చేసుకోవాలి.
ఇంప్లాంట్స్ ఎవరికి?
40 నుంచి 80 ఏళ్ల వారు ఎవరైనా ఈ ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్‌ను అమర్చుకోవచ్చు. అయితే మధుమేం, అధిక రక్తపోటు లాంటి సమస్యలను మందులతో అదుపులో ఉంచుకోవాలి. ఈ ఇంప్లాంట్స్ విజయావకాశాలు 96 నుంచి 98ు ఉంటాయి. వీటికి జీవితకాలపు గ్యారెంటీ ఉంటుంది. పైన అమర్చుకునే క్యాప్స్‌కు రుసుము చెల్లించవలసి వస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు
హరీష్ రావును టార్గెట్ చేసింది అందుకేనా..?
For More AP News And Telugu News
Updated Date - Sep 02 , 2025 | 04:18 AM