ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Cricketer Nallapureddy Sricharani: గల్లీ నుంచి ఢిల్లీ దాకా మన చిన్నా

ABN, Publish Date - Sep 17 , 2025 | 02:08 AM

పిక్సీ హెయిర్‌ కట్‌.. నుదుటికి బ్లూ బాండ్‌.. బంతి చేతపడితే అవతల ఎవరున్నా తికమకపడాల్సిందే! బయట మామూలుగా మాట్లాడే ఈ అమ్మాయి క్రికెట్‌ గ్రౌండ్‌లో ప్రవేశిస్తే కొదమ సింహమే. ఆమె ఎవరో కాదు...

పిక్సీ హెయిర్‌ కట్‌.. నుదుటికి బ్లూ బాండ్‌.. బంతి చేతపడితే అవతల ఎవరున్నా తికమకపడాల్సిందే! బయట మామూలుగా మాట్లాడే ఈ అమ్మాయి క్రికెట్‌ గ్రౌండ్‌లో ప్రవేశిస్తే కొదమ సింహమే. ఆమె ఎవరో కాదు నల్లపురెడ్డి శ్రీచరణి. మన రాయలసీమ నుంచి టీమ్‌ ఇండియాకు ఎంపికయిన మహిళా క్రికెటర్‌. ఐదు నెలల క్రితం డబ్ల్యూపీఎల్‌లో అరంగేట్రం.. ఆ తర్వాత భారత వన్డే.. టీ20 జట్లలో ఆగమనం. ఇలా క్రికెట్‌లో దూసుకుపోతున్న శ్రీచరణి ఈ నెలఖరున మన దేశంలో జరగనున్న మహిళా వన్డే వరల్డ్‌కప్‌ కోసం సన్నద్ధమవుతోంది. ‘నవ్య’తో శ్రీచరణి పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే..

‘‘మాది కడప జిల్లాలోని యర్రంపల్లి గ్రామం. నాన్న చంద్రశేఖరరెడ్డి విద్యుత్‌ శాఖలో పనిచేస్తారు. అమ్మ రేణుక గృహిణి. అక్క చరిత ఎంఎస్‌ పూర్తి చేసి అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. ఇంట్లో అందరూ నన్ను ‘చిన్నా’ అని పిలుస్తారు. చిన్నప్పటి నుంచి నాకు ఆటలంటే చాలా ఇష్టం. చదువుకన్నా ఆటలంటేనే ఆసక్తి. మామయ్య కిషోర్‌రెడ్డి, మా కాలనీలోని మగ పిల్లలతో క్రికెట్‌ బాగా ఆడేదాన్ని. ఒక విధంగా మామయ్యనే నా మొదటి కోచ్‌. ఆయన ఇప్పటికీ నా మ్యాచ్‌లు చూసి సలహాలు ఇస్తూ ఉంటారు. నేను కేవలం క్రికెట్‌ మాత్రమే కాదు.. ఖోఖో, బ్యాడ్మింటన్‌ లాంటివి కూడా ఆడేదాన్ని. ఖోఖోలో జాతీయ స్థాయిలో ఆడేదాన్ని. అథ్లెటిక్స్‌ ట్రైనింగ్‌కు కూడా ఎంపికయ్యా! నేను పదో తరగతి చదువుతున్నప్పుడు- గుంటూరులో ఖోఖో ఆడటానికి వెళ్లా! అక్కడ అనుకోకుండా ఒక క్రికెట్‌ మ్యాచ్‌ను చూశా. ఎందుకో తెలియదు.. ఆ మ్యాచ్‌ నా మనస్సులో ముద్ర పడిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మతో - ‘‘నేను ఇక నుంచి క్రికెట్‌ మాత్రమే ఆడతా! పెద్ద క్రికెటర్‌ అవుతా! ’’ అని చెప్పా. అమ్మ సరే అంది కానీ నాన్న కొన్ని నెలల వరకూ ఒప్పుకోలేదు. నా పట్టుదల చూసి చివరకు ఆయన కూడా ఒప్పుకున్నారు. పదో తరగతి అయిన తర్వాత క్రికెట్‌లో శిక్షణ తీసుకోవటం ప్రారంభించా. మొదట పొద్దుటూరులో.. ఆ తర్వాత హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో రంజీ మాజీ క్రికెటర్‌ సురేష్‌ సార్‌ దగ్గర శిక్షణ తీసుకున్నా. మొదట్లో నేను పేస్‌ బౌలర్‌ని. సురేష్‌ సార్‌ దగ్గరకు వచ్చిన తర్వాత ఆఫ్‌ స్పిన్నర్‌గా మారా! ఆ సమయంలోనే అండర్‌ 19కి ఎంపికయ్యా.

మలుపు తిప్పిన ఘటన..

బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో 2019లో అండర్‌-19 వరల్డ్‌కప్‌ కోసం హైలెవల్‌ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోని ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను ఆ శిబిరానికి ఎంపిక చేశారు. నాకు ఛాన్స్‌ వస్తుందనుకున్నా! కానీ రాలేదు. ఆ బాధ నన్ను చాలా కాలం వేధించింది. అయితే నాలో పట్టుదలను కూడా పెంచింది. కొవిడ్‌ తర్వాత అండర్‌-19 స్థాయిలో ఆల్‌రౌండర్‌గా సత్తా చాటడంతో 2022లో ఆంధ్ర సీనియర్‌ జట్టులో చోటు లభించింది. నాకు దొరికిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్లేదాన్ని. 2023లో ముంబయిలో జరిగిన టీ20 చాంపియన్‌షి్‌పలో నేను ఆడాను. నా ఆటను ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌కు చెందిన కొందరు పరిశీలించారట! ఆ విషయం అప్పుడు నాకు తెలియదు. 2024లో జరిగిన ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) వేలంలో నన్ను ఢిల్లీ జట్టు రూ. 55 లక్షలకు కొనుగోలు చేసింది. ఫైనల్‌లో ముంబయిపై పరుగులు కట్టడి చేయడంతో పాటు కీలక వికెట్లు తీయడంతో బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాను. ఆతర్వాత జరిగిన ఛాలెంజర్‌ ట్రోఫీలో 9 వికెట్లు పడగొట్టడంతో తొలుత వన్డే, ఆతర్వాత టీ20ల్లో భారత జట్టు తరఫున అరంగేట్రం చేయగలిగా. గత జూన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీ్‌సలో అరంగేట్రం మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు తీయడం నా కెరీర్‌లో ఒక మధురానుభూతి. భారత్‌ అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాల జాబితాలో (4/12) నా పేరు రెండోదని తెలిసి చాలా సంతోషించా.

అమ్మ చేతి వంట ఇష్టం..

స్వతహాగా నేను భోజన ప్రియురాలిని. స్వీట్లు తప్ప మిగిలిన అన్నింటినీ ఒక పట్టు పడతా. అమ్మ చేతి వంట అంటే చాలా ఇష్టం. ఈ మధ్య వివిధ ప్రాంతాల్లో జరిగే దేశవాళీ క్రికెట్‌ పోటీల్లో ఎక్కువగా ఆడుతుండడంతో ఇంటి భోజనానికి దూరమయ్యా. నేను ఎప్పుడైనా సరిగ్గా ఆడకపోతే దానికి కారణం సరిగ్గా తినకపోవడమేనని అనుకొని ఇంటికి వచ్చినప్పుడల్లా అమ్మ నాకు ఏదో ఒకటి వండి తినిపించే పనిలోనే ఉంటుంది. ఈ మధ్య ఎక్కువ సినిమాలు చూడడం లేదు కానీ ఒకప్పుడు ప్రభా్‌స మూవీ ఏది వచ్చినా వెంటనే చూసేదాన్ని. క్రికెట్‌లో యువరాజ్‌, స్మృతి మంధాన, హర్మన్‌, జెమీమా అంటే బాగా ఇష్టం. యువరాజ్‌ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టిన వీడియో అయితే ఇప్పటివరకు ఎన్నిసార్లు చూశానో లెక్క లేదు. ఎప్పటికైనా యువరాజ్‌లా అలా సిక్సర్లు కొట్టాలనే కోరిక ఉంది. ప్రస్తుతానికైతే బౌలింగ్‌ పైనే ఫోక్‌స పెట్టాను. జట్టు అవసరానికి తగ్గట్టు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటడానికి సిద్ధమే.

ఒత్తిడికి లోనుకాను..

మైదానంలో అడుగు పెట్టాక ఆటపైనే పూర్తిగా దృష్టి పెడతాను. గ్రౌండ్‌ అవతల ఏమవుతోందో పట్టించుకోను. ఒక బంతి సరిగ్గా వేయకపోతే తర్వాతి బంతి ఇంకా బాగా వేయాలనే ఆలోచిస్తా కానీ ఒత్తిడికి లోనుకాను. సీనియర్లు నుంచి మంచి సహకారం ఉండడం, వారంతా బాగా ప్రోత్సహించడం కూడా నాకు కలిసొచ్చింది. నేను ఎదుట వాళ్లు ఏం చెప్పినా శ్రద్ధగా వింటాను వాళ్లు ఏ ధోరణిలో చెప్పినా ‘నా మంచి కోసం చెబుతున్నారు కదా’ అని ఆ విషయాలను అర్థం చేసుకొని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తా. అదే నా బలం.

కచ్చితంగా వరల్డ్‌కప్‌ గెలుస్తాం..

ప్రతి క్రికెటర్‌కు వరల్డ్‌క్‌పలో ఆడడం, ఆ ప్రతిష్ఠాత్మకమైన ట్రోఫీను గెలవడం అనేది ఒక కల. అలాంటి మెగా టోర్నీలో ఆడే అవకాశం నాకు చిన్న వయసులోనే రావడం నిజంగా నా అదృష్టమే. ఈసారి ప్రపంచకప్‌ మన దేశంలోనే జరుగుతుండడం, విశాఖపట్నం కొన్ని మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుండడం, సొంత గడ్డపై తెలుగు వాళ్ల ముందు ఆడడం గౌరవంగా భావిస్తున్నా. వరల్డ్‌క్‌పలో మన టీమిండియా హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ నుంచి మనకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముంది. ఎంత పోటీ ఉన్నా కచ్చితంగా వరల్డ్‌కప్‌ గెలుస్తామనే నమ్మకం ఉంది.

ఎస్‌.ఎ్‌స.బి సంజయ్‌, హైదరాబాద్‌

మార్కర్‌తో గుర్తులు..

కెరీర్‌ ప్రారంభంలో నెట్స్‌లో బౌలింగ్‌ చేస్తున్నప్పుడు మంచి లెంగ్త్‌లో బంతి పడి వికెట్లు తీసినప్పుడు పిచ్‌పై బాల్‌ పడిన చోట మార్కర్‌తో గుర్తు పెట్టుకొనేదాన్ని. అది గుర్తు వస్తే ఇప్పుడు నవ్వొస్తుంది. ఇంత సేపే ప్రాక్టీసు చేయాలని టైమ్‌ పెట్టుకోను. నా బౌలింగ్‌పై ఆత్మ సంతృప్తి కలిగేంత వరకు సాధన చేస్తాను. చివరిగా ఒక మంచి బంతి వేశాకే ప్రాక్టీసు ముగిస్తాను.

ఇవి కూాడా చదవండి..

సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు

డెహ్రాడూన్‌ను ముంచెత్తిన వానలు..నీట మునిగిన షాపులు, ఆలయాలు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 17 , 2025 | 11:51 AM