Nupur Bora: సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు
ABN , Publish Date - Sep 16 , 2025 | 02:45 PM
బోరాపై స్థానిక యాక్టివిస్ట్ గ్రూప్ క్రిషక్ ముక్తి సంగ్రామ్ సమితి లాంఛనంగా ఫిర్యాదు చేసింది. భూములకు సంబంధించిన సేవలకు ఆమె 'రేట్ కార్డ్' పెట్టారని, భూముల రికార్డుల్లో మార్పులు చేసేందుకు రూ.1,500 నుంచి రూ.2 లక్షల వరకూ లంచంగా తీసుకునే వారని ఆరోపించింది.
గువాహటి: అస్సాం (Asssam)కు చెందిన సివిల్ సర్వీస్ (ACS) అధికారిణి నూపుర్ బోరా (Nupur Bora) ముఖ్యమంత్రి ప్రత్యేక విజిలెన్స్ సెల్ సోదాల్లో అడ్డంగా పట్టుబడ్డారు. ఆమె ఇంట్లో రూ.92 లక్షల నగదు, రూ.2 కోట్లు విలువచేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. భూకుంభకోణం, ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి.
అక్రమ సెటిలర్స్ (Miya) పేరున ప్రభుత్వ, సతారా భూముల అక్రమ రిజిస్ట్రేషన్లకు బోరా పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) తెలిపారు. బెంగాలీ మాట్లాడే ముస్లింలను 'మియా'గా మిలుస్తారు. వీరిని బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన అక్రమ వలసదారులుగా బీజేపీ చెబుతోంది.
ముందుగా అనుకున్న ప్రకారం బోరా నివాసంపై గత ఆదివారం రాత్రి దాడులు జరపాల్సి ఉండగా ఆమె గెస్ట్ హౌస్‌లో ఉండటంతో సోదాల్లో జాప్యం జరిగింది. సోమవారం ఉదయం ఆపరేషన్ తిరిగి ప్రారంభమైంది. గువాహటిలోని ఆమె నివాసంతో పాటు ఆమెకు సంబంధించిన మరో మూడు ప్రాంతాల్లో అధికారులు సోదాలు జరిపారు. బార్‌పేటలో అద్దెకు ఉంటున్న ఇంటిలో కూడా అధికారులు సోదాలు చేపట్టారు.
బోరాపై స్థానిక యాక్టివిస్ట్ గ్రూప్ క్రిషక్ ముక్తి సంగ్రామ్ సమితి (KMSS) లాంఛనంగా ఫిర్యాదు చేసింది. భూములకు సంబంధించిన సేవలకు ఆమె 'రేట్ కార్డ్' పెట్టారని, భూముల రికార్డుల్లో మార్పులు చేసేందుకు రూ.1,500 నుంచి రూ.2 లక్షల వరకూ లంచంగా తీసుకునే వారని కేఎంఎస్ఎస్ ఆరోపించింది. నూపుర్ బోరా కేవలం ఆరేళ్ల సర్వీసులోనే పెద్ద మొత్తంలో సంపద కూడబెట్టారని విజిలెన్స్ సెల్ అధికారులు తెలిపారు. కూడబెట్టిన ఆస్తులు, ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను సోదాల్లో స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
డెహ్రాడూన్‌ను ముంచెత్తిన వానలు..నీట మునిగిన షాపులు, ఆలయాలు
యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, సోనూసూద్‌కి ఈడీ నోటీసులు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి