Dehradun Cloudburst:: డెహ్రాడూన్‌ను ముంచెత్తిన వానలు..నీట మునిగిన షాపులు, ఆలయాలు
ABN , Publish Date - Sep 16 , 2025 | 09:38 AM
ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో మంగళవారం కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగర వ్యాప్తంగా అనేక చోట్ల భారీ వరదలు సంభవించాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు, రోడ్లు, దుకాణాలు సహా పలు ఆలయాలు కూడా నీట మునిగాయి.
ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ తడిసి ముద్దవుతోంది. మంగళవారం కూడా కుండపోత వానలు కొనసాగడంతో నగరం జలప్రళయాన్ని ఎదుర్కొంటోంది (Dehradun Floods). క్లౌడ్ బరస్ట్ నగరాన్ని అల్లకల్లోలం చేస్తోంది. వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు. రోడ్లు నదుల్లా మారిపోయాయి. (Dehradun Cloudburst)
వందల కొద్దీ కార్లు, ఆటోలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. దుకాణాలు నీట మునిగి తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. పలు ఆలయాలు కూడా నీటిలో మునిగిపోయాయి. అనేక వీధులు ఇప్పుడు ప్రమాదంగా మారాయి. రెస్క్యూ బృందాలు స్పందించి సహాయ చర్యలు చేపట్టినా, భారీ వరద కారణంగా ప్రజల ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా తమ్సా నది ఒడ్డున ఉన్న ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ముఖ్యమంత్రి హెచ్చరిక, సహాయక చర్యలు
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఈ విషయంపై స్పందిస్తూ సహస్త్రధారా ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొన్ని దుకాణాలు ధ్వంసమయ్యాయని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. జిల్లా యంత్రాంగం, SDRF, పోలీసులు సంఘటనా స్థలంలో సహాయక, రక్షణ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో స్థానిక అధికారులతో వెళ్లి నిరంతరం సంప్రదిస్తూ, పరిస్థితిని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం వేగంగా స్పందిస్తూ, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో ఉందన్నారు.
మహాదేవ్ ఆలయం
డెహ్రాడూన్‌లోని తమ్సా నది ఉగ్రరూపం కారణంగా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఈ క్రమంలో ప్రసిద్ధ తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం కూడా ఈ వరదల్లో తీవ్రంగా దెబ్బతింది. ఆలయ ప్రాంగణం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఉదయం 5 గంటల నుంచి నది ప్రవాహం తీవ్రమై, ఆలయం చుట్టూ నీరు చేరిందని ఆలయ పూజారి అచార్య బిపిన్ జోషి తెలిపారు. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హరిద్వార్ జాతీయ రహదారి ఫన్ వ్యాలీ సమీపంలో ఉన్న వంతెన కూడా తీవ్రంగా దెబ్బతింది.
ఐఎండీ రెడ్ అలర్ట్
ఇదే సమయంలో భారత వాతావరణ శాఖ (IMD) డెహ్రాడూన్, తెహ్రీ గర్హ్వాల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది (Dehradun Cloudburst). మంగళవారం ఉదయం 9 గంటల వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 15 మి.మీ. కంటే ఎక్కువ వర్షం, గంటకు 87 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది. ఈ వాతావరణం రోజంతా కొనసాగే అవకాశం ఉందని, దీంతో మరింత నష్టం, అంతరాయాలు సంభవించవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నదులు, కాలువల దగ్గరకు వెళ్లకూడదని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని కోరారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి