Mittal Patels Transformative Work: ఆమె సంచార జాతుల చిరునామా
ABN, Publish Date - Sep 01 , 2025 | 05:30 AM
రాజ్యాంగం కల్పించిన ఎలాంటి హక్కులకూ నోచుకోని సంచార జాతులకు నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు మిత్తల్ పటేల్. ఆమె చొరవ ఏడున్నర లక్షల మందికి పైగా ప్రజలకు చట్టబద్ధమైన గుర్తింపు కల్పించింది...
రాజ్యాంగం కల్పించిన ఎలాంటి హక్కులకూ నోచుకోని సంచార జాతులకు నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు మిత్తల్ పటేల్. ఆమె చొరవ ఏడున్నర లక్షల మందికి పైగా ప్రజలకు చట్టబద్ధమైన గుర్తింపు కల్పించింది. వేలాదిమందికి ఉపాధిని, సొంత ఇళ్ళను అందించింది. మరోవైపు పర్యావరణ పరిరక్షణకు మిత్తల్ చేస్తున్న కృషి సర్వత్రా ప్రశంసాపాత్రమవుతోంది.
‘‘జీవితం అనూహ్యమైన మలుపు తిరగడానికి ఒక్క సంఘటన చాలు. నా జీవితాన్ని మార్చేసిన అలాంటి అనుభవం నాకు చిన్న పల్లెటూరులో ఎదురయింది. నేను పుట్టింది, పెరిగింది గుజరాత్ రాష్ట్రంలోని సంఖల్పూర్ గ్రామంలో. ఐఎఎస్ అధికారి కావాలన్నది నా లక్ష్యం. అందుకు తగినట్టుగానే చదువులో బాగా చురుగ్గా ఉండేదాన్ని. కోచింగ్ కోసం అహ్మదాబాద్‌కు వెళ్ళాను. మరోవైపు గుజరాత్ విద్యాపీఠ్‌లో జర్నలిజం కోర్సులో చేరాను. రెండు నెలల ఫెలోషి్‌పలో భాగంగా... ఒక పల్లెటూరి బయట నీలం రంగు ప్లాస్టిక్ షీట్లతో గుడారాలు వేసుకొని నివసిస్తున్న కుటుంబాలను కలుసుకున్నాను. అప్పుడు నేను తెలుసుకున్న విషయాలు దిగ్ర్భాంతి కలిగించాయి. వారందరూ సంచార జాతులకు చెందినవారు. ఎక్కడ పని దొరికితే అక్కడికి కుటుంబాలతో సహా వెళుతూ ఉంటారు. స్థిరమైన నివాసాలు లేవు. పిల్లలకు చదువు లేదు. మహిళలకు, బాలికలకు రక్షణ లేదు. వారు అత్యాచారాలకు గురైనా... స్థానికంగా అండ లేకపోవడం వల్ల ఫిర్యాదులు చేయడానికి కూడా భయపడతారు. రేషన్ కార్డులకు కానీ, ఇతర ప్రభుత్వ పథకాలకు కానీ నోచుకోలేదు. సంచార జాతులకు ఈ పరిస్థితి దేశమంతటా ఉందని తెలిసింది. అదే సమయంలో... దేశంలో సంచార జాతులపై అధ్యయనం చేస్తున్న ఒక ఎన్జీవోతో పరిచయం అయింది. దాని ప్రతినిధులతో కలిసి పని చేయడం ప్రారంభించాను.
సవాలుగా తీసుకున్నా...
సంచార (ఎన్‌టి), డినోటిఫైడ్ తెగలు (డీఎన్‌టి) తెగలకు చెందిన వారు మన దేశంలో అరవై లక్షల మందికి పైగా ఉన్నారు. వారిలో చాలామంది పాములను ఆడించడం, ఆటపాటల్లాంటి వివిధ పనులతో జీవిస్తూ, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తిరుగుతూ ఉంటారు. వీరిలో 198 తెగలపై ‘నేర జాతులు’ అనే ముద్రను నాటి బ్రిటిష్ ప్రభుత్వం వేసింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా వారు ప్రాథమికమైన హక్కులకు నోచుకోవడం లేదు. ఏ ప్రభుత్వం వారి సమస్యలకు తగిన పరిష్కారం చూపించడం లేదు. వారి తరఫున గళం విప్పాలనుకున్నాను. 2006లో ‘విచార్త సముదాయ్ సమర్థన్ మంచ్’ (విఎస్‌ఎ్‌సఎం) అనే సంస్థను ప్రారంభించాను. సంచార జాతులవారికి వారి హక్కుల గురించి వివరించడం, వారికి చట్టబద్ధమైన గుర్తింపు లభించేలా చేయడం మా సంస్థ ప్రధాన లక్ష్యం. దీనిలో ప్రధానమైన ఇబ్బంది ఏమిటంటే... వారి జీవన శైలి కారణంగా ఒకే చోట ఉండరు. శాశ్వత చిరునామా ఉండదు. అధికారికమైన పత్రాలను సంపాదించడం చాలా కష్టం. కానీ దాన్ని ఒక సవాలుగా తీసుకున్నాను. ముప్ఫై మందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేశాను. మేమందరం గ్రామాల్లో తిరిగి సంచార జాతులవారి వివరాలను సేకరించాం. అధికారులను, ప్రజా ప్రతినిధులను కలిసి వారి సమస్యలను వివరించాం. మొదట్లో స్పందన నామమాత్రంగానే వచ్చినా... మా పట్టుదల చూసి వారు కూడా సహకరించారు. గుజరాత్‌లో... పదేళ్ళలో దశలవారీగా 60 వేలమందికి ఓటర్ కార్డులు ఇప్పించగలిగాం. ఆ తరువాత ఇది ఒక ఉద్యమంగా మారింది. ఎంతోమంది మా సంస్థతో చేతులు కలిపారు. మా కృషితో ... ఏడున్నర లక్షల మందికి పైగా సంచార జాతులవారు చట్టబద్ధమైన గుర్తింపును పొందారు. అయిదు వేలమంది విద్య, ఉద్యోగాలు పొందారు. మా సంస్థ చేపట్టిన ‘లైవ్‌లీహుడ్ ప్రాజెక్ట్’ ద్వారా పన్నెండు వేల కుటుంబాలకు వడ్డీ లేని రుణాలను అందించి, స్వయం ఉపాధికి దోహదం చేశాం. వేలమందికి ఇళ్ళ స్థలాలను ప్రభుత్వ సహకారంతో అందజేయగలిగాం. ఈ వర్గాల వారి పిల్లల చదువుకోసం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గుజరాత్‌తో పాటు పలు రాష్ట్రాల్లో మా కార్యకలాపాలు సాగుతున్నాయి.
వారి సంతోషమే ప్రేరణ
అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం కూడా మా సంస్థ పని చేస్తోంది. ఇప్పటివరకూ పదహారున్నర లక్షల చెట్లు నాటాం, 380కి పైగా చెరువులను పునరుద్ధరించాం. దీన్ని ఎందరో ప్రముఖులు ప్రశంసించారు. నా కార్యక్రమాలకు గుర్తింపుగా... ‘నారీ శక్తి పురస్కార్’ లాంటి అనేక అవార్డులు లభించాయి. అన్నిటికన్నా... మా సంస్థ ద్వారా ప్రయోజనం పొందినవారిలో పెరిగిన ఆత్మవిశ్వాసం, వారిలో కనిపించే సంతోషం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు, ప్రభుత్వ పథకాలు, విద్య, ఉద్యోగాలు అర్హులైన సంచారజాతులవారందరికీ అందించాలనే నా ఆశయాన్ని కొనసాగించడానికి మరింత ప్రేరణ కలిగిస్తోంది.’’
ఇవి కూడా చదవండి
హరీష్ రావు తప్పు చేశారని కమిషన్ చెప్పింది: ముఖ్యమంత్రి రేవంత్
కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోంది.. మంత్రి ఉత్తమ్‌పై హరీష్‌రావు ఫైర్
Updated Date - Sep 01 , 2025 | 05:30 AM