Gooseberry Juice Benefits: ఉసిరికాయతో నోరూరేలా
ABN, Publish Date - Jul 19 , 2025 | 06:01 AM
బజారులో ఉసిరికాయలు కనిపిస్తే కొనకుండా ఉండలేం. ఇవి చిన్న, పెద్ద సైజుల్లో లభ్యమవుతూ ఉంటాయి.
బజారులో ఉసిరికాయలు కనిపిస్తే కొనకుండా ఉండలేం. ఇవి చిన్న, పెద్ద సైజుల్లో లభ్యమవుతూ ఉంటాయి. మరీ చిన్నగా ఉండే రాశి ఉసిరి కాయలనైతే అసలు వదిలిపెట్టం. వెంటనే కొనుక్కుని ఉప్పు చల్లుకుని తినేస్తూ ఉంటాం. ఇలాంటి ఉసిరికాయలతో తయారు చేసే కమ్మని రుచులు మీకోసం...
ఉసిరి జ్యూస్
కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు- నాలుగు, పుదీనా ఆకులు- ఎనిమిది, చిన్న అల్లం ముక్కలు- రెండు, ఉప్పు- చిటికెడు, తేనె- ఒక చెంచా, నిమ్మరసం- అర చెంచా, నీళ్లు- ఒక గ్లాసు
తయారీ విధానం: ఉసిరికాయలను నీళ్లతో కడిగి చిన్న ముక్కలుగా కోయాలి. అల్లం ముక్కలు, పుదీనా ఆకులను కూడా కడగాలి.
ఫ మిక్సీలో ఉసిరికాయ ముక్కలు, పుదీనా ఆకులు, అల్లం ముక్కలు, ఉప్పు, తేనె, నిమ్మరసం వేసి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక గాజు గ్లాసులోకి వడబోయాలి. ఇందులో రెండు ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేసుకోవడమే!
జాగ్రత్తలు
ఇందులో కొద్దిగా బెల్లం, మిరియాల పొడి కూడా కలుపుకుని తాగవచ్చు.
ఈ జ్యూస్‌లో చిటికెడు నల్ల ఉప్పు, జీలకర్ర పొడి వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. వగరుగా ఉందనిపిస్తే మరో పావు చెంచా నిమ్మ రసం కలుపుకోవచ్చు.
ఉసిరికాయ పచ్చడి
కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు- 11, నూనె- ఎనిమిది చెంచాలు, మినప్పప్పు- ఒకటిన్నర చెంచా, పచ్చి శనగ పప్పు- ఒక చెంచా, పచ్చి మిర్చి- 12, కరివేపాకు- రెండు రెమ్మలు, కొత్తిమీర- చిన్న కట్ట, ఉప్పు- అర చెంచా, చింతపండు- మూడు రెబ్బలు, వెల్లుల్లి రెబ్బలు- ఆరు, జీలకర్ర- అర చెంచా, ఆవాలు- అర చెంచా, ఇంగువ- పావు చెంచా, ఎండు మిర్చి- రెండు, పసుపు- పావు చెంచా
తయారీ విధానం: ఉసిరి కాయలను నీళ్లతో కడగాలి. తరవాత చాకుతో చిన్న ముక్కలుగా కోయాలి. కొత్తిమీరను తుంచి నీళ్లతో కడిగి ఉంచుకోవాలి. పచ్చిమిర్చిని ముక్కలుగా కోయాలి.
స్టవ్ మీద గిన్నె పెట్టి రెండు చెంచాల నూనె వేసి వేడిచేయాలి. ఇందులో ఒక చెంచా మినప్పప్పు, పచ్చి శనగ పప్పు వేసి దోరగా వేపాలి. తరవాత పచ్చి మిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసి చిన్న మంటమీద వేపాలి. వీటిని ఒక పళ్లెంలోకి తీయాలి. గిన్నెలో మరో మూడు చెంచాల నూనె వేసి వేడి చేయాలి. ఇందులో ఉసిరికాయ ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. మూతపెట్టి చిన్న మంట మీద మగ్గించాలి. ఉసిరికాయ ముక్కలు మెత్తబడిన తరవాత చింతపండు రెమ్మలు వేసి కలపాలి. రెండు నిమిషాలు తరవాత స్టవ్ మీద నుంచి దించి చల్లారనివ్వాలి.
మిక్సీలో పప్పులు-పచ్చి మిర్చి-కొత్తిమీర మిశ్రమం, ఉసిరికాయ ముక్కలు-చింతపండు మిశ్రమం, వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేయాలి. ఇందులో నీళ్లు పోయకూడదు. మధ్య మధ్యలో చెంచాతో కలుపుతూ బరకగా ఉండేలా గ్రైండ్ చేయాలి. తరవాత ఈ పచ్చడిని గిన్నెలోకి తీయాలి.
స్టవ్ మీద చిన్న మూకుడు పెట్టి మూడు చెంచాల నూనె వేసి వేడి చేయాలి. ఇందులో అర చెంచా మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండు మిర్చి ముక్కలు, కరివేపాకు, పసుపు వేసి దోరగా వేపాలి. తరవాత గిన్నెలోని పచ్చడిని కూడా వేసి బాగా కలిపి స్టవ్ మీద నుంచి దించాలి. ఉప్పు సరిచూడాలి. ఇలా తయారు చేసుకున్న ఉసిరికాయ పచ్చడిని వేడి అన్నంలో కలుపుకుని తింటే బాగుంటుంది.
జాగ్రత్తలు
ఉసిరికాయలను పది నిమిషాలు ఆవిరి మీద ఉడికిస్తే ముక్కలు కోయడం సులువుగా ఉంటుంది.
పచ్చిమిర్చికి బదులు ఎండు మిర్చి కూడా వేసుకోవచ్చు.
ఇష్టమైతే నువ్వులు లేదా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చు.
రోట్లో దంచి తయారుచేసుకుంటే ఈ పచ్చడి మరింత రుచిగా ఉంటుంది.
ఉసిరికాయ పులిహోర
కావాల్సినపదార్థాలు: ఉసిరికాయలు- ఆరు, బియ్యం- ఒక పెద్ద కప్పు, నూనె- మూడు చెంచాలు, వేరుశనగ గుండ్లు- రెండు చెంచాలు, పచ్చి శనగ పప్పు- ఒక చెంచా, మినప్పప్పు- అర చెంచా, ఆవాలు- అర చెంచా, పచ్చిమిర్చి- నాలుగు, ఎండు మిర్చి- మూడు, ఇంగువ- పావు చెంచా, పసుపు- అర చెంచా, కరివేపాకు- మూడు రెమ్మలు, ఉప్పు- ఒక చెంచా, నిమ్మకాయ- ఒకటి
తయారీ విధానం: ముందుగా బియ్యాన్ని కడిగి... పొడిపొడిగా ఉండేలా అన్నం వండాలి. ఈ అన్నాన్ని వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో పావు చెంచా ఉప్పు, ఒక చెంచా నూనె, కొద్దిగా కరివేపాకు వేసి కలపాలి. ఉసిరికాయలను కడిగి చిన్న ముక్కలుగా కోయాలి. వీటిని మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేయాలి.
స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి రెండు చెంచాల నూనె వేసి వేడి చేయాలి. ఇందులో ఆవాలు, వేరుశనగ గుండ్లు, పచ్చి శనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేపాలి. తరవాత ఇంగువ, పసుపు, ఎండు మిర్చి, పర్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి బాగా కలపాలి. ఇవి రెండు నిమిషాలు వేగాక గ్రైండ్ చేసుకున్న ఉసిరికాయల పేస్టు, ముప్పావు చెంచా ఉప్పు వేసి కలపాలి. మూతపెట్టి రెండు నిమిషాలు మగ్గించాలి. తరవాత మూత తీసి ముందుగా సిద్ధం చేసుకున్న అన్నం, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఒక నిమిషం తరవాత స్టవ్ మీద నుంచి దించి సర్వ్ చేసుకోవాలి. ఈ ఉసిరికాయ పులిహోరను వేడిగా తింటే బాగుంటుంది. చల్లారాక కూడా రుచిగానే అనిపిస్తుంది.
జాగ్రత్తలు
ఉసిరికాయ ముక్కలను మరీ మెత్తగా కాకుండా కొబ్బరి తురుంలా గ్రైండ్ చేయాలి.
కొద్దిగా పచ్చి కొబ్బరి తురుం కలిపితే పులిహోర కమ్మగా ఉంటుంది.
రాశి ఉసిరికాయల పప్పు
కావాల్సిన పదార్థాలు: రాశి ఉసిరి కాయలు- ఒక కప్పు, కందిపప్పు- అర కప్పు, ఉల్లిపాయ- ఒకటి, టమాటాలు- రెండు, పచ్చిమిర్చి- ఎనిమిది, పసుపు- పావు చెంచా, నూనె- రెండు చెంచాలు, ఆవాలు- అర చెంచా, జీలకర్ర- ఒక చెంచా, ఎండు మిర్చి- రెండు, వెల్లుల్లి రెబ్బలు- అయిదు, ఇంగువ- పావు చెంచా, కరివేపాకు- రెండు రెమ్మలు, కొత్తిమీర- కొద్దిగా, ఉప్పు- తగినంత
తయారీ విధానం: రాశి ఉసిరికాయలను కడిగి ముక్కలుగా కోయాలి. లోపలి గింజలు తీసివేయాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కోసుకోవాలి. కందిపప్పును కడిగి నీళ్లు పోసి అర గంటసేపు నానబెట్టాలి.
స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో నానబెట్టిన కందిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోయాలి. కుక్కర్ మీద మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి. తరవాత కుక్కర్‌ను స్టవ్ మీద నుంచి దించాలి. ఆవిరి మొత్తం పోయిన తరవాత మూత తీసి ఉసిరికాయ ముక్కలు వేసి కలపాలి. కుక్కర్‌ను మరల స్టవ్ మీద పెట్టి రెండు విజిల్స్ రానిచ్చి దించాలి. స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టి నూనె వేసి వేడి చేయాలి. ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి ముక్కలు, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, కరివేపాకు వేసి దోరగా వేపాలి. తరవాత ముందుగా ఉడికించుకున్న పప్పు-ఉసిరికాయ ముక్కల మిశ్రమం, ఉప్పు వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలు చిన్న మంట మీద మగ్గనివ్వాలి. చివరగా కొత్తిమీర తరుగు చల్లి స్టవ్ మీద నుంచి దించాలి. ఇలా తయారు చేసుకున్న రాశి ఉసిరికాయల పప్పు... వేడి అన్నం, చపాతీ, పూరీ, పుల్కాల్లోకి రుచిగా ఉంటుంది.
జాగ్రత్తలు
రాశి ఉసిరి కాయల్లో లేత పసుపు రంగులో ఉండేవి పుల్లగా ఉంటాయి. వీటిని మాత్రమే వేసి పప్పు వండాలి. ఆకుపచ్చగా ఉండేవి వగరుగా ఉంటాయి.
పప్పును మెత్తగా ఉడికించుకోవాలి. అప్పుడే రుచి బాగుంటుంది.
కందిపప్పుకు బదులు పెసరపప్పుతో కూడా ఈ వంటకం చేసుకోవచ్చు.
Updated Date - Jul 19 , 2025 | 06:01 AM