Vintage Watches: వింటేజ్ వాచ్‌లతో ట్రెండీగా
ABN, Publish Date - Aug 24 , 2025 | 03:45 AM
ప్రత్యేకమైన డిజైన్లతో అందరినీ అలరించిన వింటేజ్ వాచ్‌లు మళ్లీ ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. అద్భుతమైన చేతిపని నైపుణ్యం, ఒకప్పటి హస్తకళల వైభవం మేళవించినట్లుండే ఈ వాచ్‌లు ప్రస్తుతం ఫ్యాషన్ ప్రియులను అలరిస్తున్నాయి...
ప్రత్యేకమైన డిజైన్లతో అందరినీ అలరించిన వింటేజ్ వాచ్‌లు మళ్లీ ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. అద్భుతమైన చేతిపని నైపుణ్యం, ఒకప్పటి హస్తకళల వైభవం మేళవించినట్లుండే ఈ వాచ్‌లు ప్రస్తుతం ఫ్యాషన్ ప్రియులను అలరిస్తున్నాయి. ప్రముఖ సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, సింగర్లు, వ్యాపారవేత్తలు ఇలా అందరూ ఈ ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు. బంగారం, ప్లాటినంతో రూపొందించి వజ్రాలు, రత్నాలు పొదిగి వినూత్నంగా తీర్చిదిద్దిన అలనాటి కళాత్మక గడియారాలు ఎన్నో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. విభిన్నంగా జోడించిన చెయిన్, బెల్ట్‌లతో ఖరీదైన బ్రాస్‌లెట్లను తలపిస్తున్నాయి.
ఇటీవల కరీనా కపూర్ ఖాన్.. అత్యంత అరుదైన జేగర్ లీ కౌల్టర్ వాచ్ ధరించి తళుక్కుమన్నారు. అలాగే అనన్య పాండే కూడా ఆడెమర్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ మినీ ఫ్రోస్టెడ్ గోల్డ్ వాచ్ పెట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇది 1997 దశకంలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. 18 క్యారెట్ బంగారు కేసు దీని ప్రత్యేకత. డేవిడ్ బెక్‌హామ్.. వజ్రాలతో నిండిన కస్టమ్ ట్యూడర్ బ్లాక్ బే క్రోనోను ఎడమ చేతికి పెట్టుకుని వింబుల్డన్‌లో మెరిశాడు. నిక్ జోనాస్.. 1970 నాటి రోలెక్స్ డే డేట్‌ను ధరించి కనిపించాడు. ఇలా యాభై ఏళ్లనాటి వింటేజ్ వాచ్‌లు మరల కనువిందు చేస్తున్నాయి.
ఎలా ఎంచుకోవాలంటే..!
క్లాసిక్ గడియారాలకు సంబంధించి ఒకప్పుడు అత్యంత ఆదరణ పొందిన డిజైన్లు, మోడల్స్, బ్రాండ్లను గురించి వివరంగా తెలుసుకోవాలి. వెనక్కి ప్రయాణించి శోధించే కొద్దీ అపురూపమైన వాచ్‌లు వెలుగులోకి వస్తాయి. పాత పుస్తకాలు చదవడం, వెబ్‌సైట్‌లు పరిశీలించడం, అప్పటి ప్రకటనలు లేదా మేగజైన్లు చూడడం లాంటివి ఉపకరిస్తాయి.
ఈ వింటేజ్ వాచ్‌ల విలువ ఎక్కువగానే ఉంటుంది. కనీసం ముప్పయి వేల నుంచి కొన్ని లక్షల వరకు ఖరీదు ఉండవచ్చు. వింటేజ్ వాచ్‌ను ధరించాలంటే ముందుగా బడ్జెట్‌ను అంచనా వేసుకుని అందుకు తగ్గట్టు నిర్ణయం తీసుకోవాలి. సీకో, లాంగైన్స్, టిస్సోట్ లాంటి బ్రాండ్లు చక్కని స్టయిలిష్ వింటేజ్ వాచ్‌లను అందుబాటులో ఉంచుతున్నాయి. ప్రామాణికత పాటిస్తూ అనుభవం ఉన్న నమ్మకమైన డీలర్ల సలహా ప్రకారం వింటేజ్ వాచ్‌లు కొనుగోలు చేయడం మంచిది.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 24 , 2025 | 03:45 AM