Mechanical Engineering: కోర్ బ్రాంచెస్‌లో కీలకం మెకానికల్ ఇంజనీరింగ్
ABN, Publish Date - Jul 07 , 2025 | 05:19 AM
కోర్ ఇంజనీరింగ్‌లో ప్రఽధానమైన వాటిలో మెకానికల్ ఒకటి. యాంత్రీకరణతో కలిగిన ప్రయోజనాలు ఎన్నో. మానవ నాగరికతలో అది చెప్పుకోదగ్గ మైలురాయి. యంత్రం ఎలా పనిచేస్తుందో తెలియాలంటే మెకానికల్ ఇంజనీరింగ్‌పై...
కోర్ ఇంజనీరింగ్‌లో ప్రఽధానమైన వాటిలో మెకానికల్ ఒకటి. యాంత్రీకరణతో కలిగిన ప్రయోజనాలు ఎన్నో. మానవ నాగరికతలో అది చెప్పుకోదగ్గ మైలురాయి. యంత్రం ఎలా పనిచేస్తుందో తెలియాలంటే మెకానికల్ ఇంజనీరింగ్‌పై అవగాహన ఉండాలి. ఈ డిసిప్లిన్‌పై అవగాహనకు తోడు అధ్యయనంతో వచ్చే ఉద్యోగాలు, కెరీర్ పరంగా ఎదుగుదల ఎలా ఉంటుందో చూద్దాం.
కదలిక ఉన్న పరికరాల డిజైన్, అభివృద్ధి, ఏర్పాటు, నిర్వహణ, మరమ్మతులు సహా సమస్తం మెకానికల్ ఇంజనీరింగ్ పరిధిలోకి వస్తాయి. రోజువారి జీవితం ఈ సబ్జెక్టుతో ముడిపడి ఉంది. బహుళ అంతస్తుల భవనం మొదలుకుని డ్రైవ్ చేసే వాహనం వరకు మెకానికల్ ఇంజనీరింగ్ ఉనికికి ఉదాహరణలే. ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఇందులో భాగం. సైన్స్, మేథ్స్ ఉపయోగించి మెకానికల్ ఇంజనీర్లు పలు సమస్యలకు పరిష్కారాన్ని కనుగొంటారు. ఫీల్డ్‌లో ఎదురయ్యే సమస్యలకు టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్‌తో మంచి పరిష్కారం చూపిస్తారు. అందుకే మెకానికల్ ఇంజనీర్లు బయోమెడికల్, మాన్యుఫాక్చరింగ్, కన్‌స్ట్రక్షన్, ఆటోమేటివ్ రంగాల్లో ఉపాధిని పొందగలుగుతున్నారు.
వివిధ బ్రాంచ్‌లు
మెకానికల్ ఇంజనీరింగ్ పరిధిలోకి పలు బ్రాంచీలు వస్తాయి. ఆడిటివ్ మాన్యుఫాక్చరింగ్, అడ్వాన్స్‌డ్ మెకట్రానిక్స్ అండ్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఆటోమేషన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్, ఆటోమొబైల్ మెయింట్‌నెన్స్ ఇంజనీరింగ్, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఆటోమేటివ్ టెక్నాలజీ, మాన్యుఫాక్చరింగ్ ఇంజనీరింగ్, మాన్యుఫాక్చరింగ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, మాన్యుఫాక్చరింగ్ ప్రాసెస్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్, మాన్యుఫాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మాన్యుఫాక్చరింగ్ టెక్నాలజీ, మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ అండ్ మెకట్రానిక్స్ ఇంజనీరింగ్(ఆడిటివ్ మాన్యుఫాక్చరింగ్), మెకానికల్ అండ్ రైల్ ఇంజనీరింగ్, మెకానికల్ అండ్ స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్(ఆటోమొబైల్), మెకానికల్ ఇంజనీరింగ్(ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్), మెకానికల్ ఇంజనీరింగ్(మాన్యుఫాక్చరింగ్ ఇంజనీరింగ్), మెకానికల్ ఇంజనీరింగ్(ప్రొడక్షన్), మెకానికల్ ఇంజనీరింగ్(వెల్డింగ్ టెక్నాలజీ), మెకానికల్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్, మెకానికల్ ఇంజనీరింగ్ డిజైన్, మెకట్రానిక్స్ ఇంజనీరింగ్, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, ఆటోమేటివ్ మాన్యుఫాక్చరింగ్ టెక్నాలజీ, ఆటోమొబైల్ సర్వీసింగ్ వంటివన్నీ మెకానికల్ ఇంజనీరింగ్ పరిధిలోకే వస్తాయి.
కెరీర్ అవకాశాలు
కన్‌స్ట్రక్షన్ ఇంజనీర్: పెద్ద పెద్ద నిర్మాణాల్లో కూడా మెకానికల్ ఇంజనీర్ అవసరం ఉంటుంది. వెంటిలేషన్, కూలింగ్, హీటింగ్ వంటి పనులు అక్కడ ఉండేవారికి ఎలాంటి అపాయం కలుగని రీతిలో ఉండేందుకు మెకానికల్ ఇంజనీర్ల సూచనలు, సలహాలు అవసరం.
ఆటోమేటివ్ ఇంజనీర్: ఆటోమోటివ్ ఇండస్ట్రీలో వివిధ వాహనాల ఉత్పత్తి, డిజైనింగ్‌లో వీరి సేవలు అవసరం. ఇందులో మళ్ళీ కస్టమర్, మిలిటరీ వాహనాలంటూ ప్రత్యేకంగానూ ఉంటాయి. సురక్షితంగా కొత్త ఫీచర్లు, ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఏరోడైనమిక్స్ తదితరాల్లో మెకానికల్ ఇంజనీర్ల పాత్ర ఉంటుంది.
రోబోటిక్ ఇంజనీర్: రోబోటిక్స్ నిర్మాణం, ప్లాన్, నిర్వహణలో పాలుపంచుకోవాలి. డిజైన్, టెక్నాలజీకి తోడు హెల్త్‌కేర్, మెడికల్ డివైజ్‌ల కోసం రోబోట్లను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
ప్రాసెస్ ఇంజనీర్: తార్కికంగా ఆలోచించడం, సరికొత్తగా చేయాలన్న ఆలోచన - అమలుపై ఆసక్తి ఉన్న మెకానికల్ ఇంజనీర్లు బీటెక్ తరవాత ప్రాసెస్ ఇంజనీరింగ్‌ను ఎంచుకోవాలి. సంబంధిత విధానాల మెరుగుదలలో ప్రాసెస్ ఇంజనీర్ల పాత్ర ఇతోధికంగా ఉంటుంది. వాటర్ అండ్ పవర్ సప్లయ్, ఫార్మాస్యూటికల్స్, డ్రగ్ మాన్యుఫాక్చరింగ్ ఇండస్ట్రీలో వీరి అవసరం చాలా ఉంటుంది.
మాన్యుఫాక్చరింగ్ ఇంజనీర్: వస్తువుల ఉత్పత్తికి అవసరమైన మెషీన్ల డిజైనింగ్ మాన్యుఫాక్చరింగ్ ఇంజనీర్ పరిధిలోకి వస్తుంది. మెషీన్ విభాగాలు వేటినైనా వీరే రూపొందిస్తారు. అప్లయిన్సెస్ నుంచి ఫుడ్ వరకు వాటికి అవసరమైన పరికరాలను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది.
ప్రాజెక్ట్ మేనేజర్: వివిధ పనులను ప్రాజెక్టులుగా మలిచి టీమ్‌లను సదరు సంస్థలు నియమిస్తాయి. వారందరితో సక్రమంగా పనిచేయిస్తేనే సదరు ప్రాజెక్ట్ పని పూర్తవుతుంది. ప్రాజెక్టుకు మేనేజర్‌గా అనుభవం బాగా ఉన్న వ్యక్తులను నియమిస్తారు. తమ టీమ్‌లోని సభ్యులతో సమర్థంగా పనిచేయించడమే కాదు, ఫలితాలను రాబట్టే పనిని వీరు చేయాల్సి ఉంటుంది.
సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ ఇంజనీర్: కస్టమర్ బిల్డింగ్‌లో వీరుంటారు. యంత్రాలు సమర్థంగా, నిరంతరాయంగా పనిచేసే విషయంలో నిమగ్నమై ఉంటారు. క్లయింట్ విజిట్స్, మెషీన్ల చెకింగ్, పనికిరానివాటిని తొలగించి కొత్తవాటిని ఉంచడం వంటి పనులు ఉంటాయి.
మెటీరియల్స్ ఇంజనీర్: వివిధ యంత్రాల ఉత్పత్తిలో మెటీరియల్ సేకరణ, పరీక్షించడం, మోడిఫై, ఎవాల్యుయేషన్ పనులు ఉంటాయి.
కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీర్: ఫ్యాక్టరీ లేదంటే పనిచేసే చోట పరిశోధన, డిజైన్, డెవల్‌పమెంట్, సిస్టమ్స్ ఇన్‌స్టలేషన్ పనులు ఉంటాయి. మాన్యుఫాక్చరింగ్ ప్రాసెస్ పక్కాగా జరిగేలా చూడాల్సిన బాధ్యత వీరిదే.
ప్రొఫెసర్స్, లెక్చరర్స్: మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ లేదంటే యూజీసీ నెట్/ సీఎ్‌్‌సఐఆర్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయితే ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో బోధకులుగా రాణించవచ్చు. అంటే అకడమిక్ వాతావరణంలో ఉండొచ్చు.
ప్రభుత్వ ఉద్యోగాలు: యూపీఎస్సీ నిర్వహించే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి ఎంపికైతే ఆరంభంలోనే మంచి జీతం, అధికారిక హోదా తద్వారా సక్సె్‌సఫుల్ కెరీర్‌ను నిర్మించుకోవచ్చు. ప్రభుత్వంలో నీటిపారుదల వ్యవస్థలు మొదలుకుని పలు ఇతర విభాగాల్లో మెకానికల్ ఇంజనీర్లు అవసరమవుతారు.
ఆంత్రప్రెన్యూర్‌షిప్: బాస్‌గా మారడం అన్నమాట. సొంతంగా పైకి ఎదగాలన్న ఆకాంక్ష ఉంటే అందుకు సొంత ఆలోచనలు తోడైతే ఇండిపెండెంట్‌గా యూనిట్ పెట్టుకోవచ్చు. ఒకరి కింద పనిచేయాల్సిన అవసరం ఉండదు. తానే మరికొందరికి ఉపాధి కల్పించవచ్చు.
ప్రయోజనాలు
మనిషి దైనందిన జీవితంతో ముడిపడినది మెకానికల్ ఇంజనీరింగ్. అందులో భాగంగా వివిధ పరిశ్రమల్లో తలెత్తే సమస్యల పరిష్కారంలో మెకానికల్ ఇంజనీర్లు విశిష్ట పాత్రను పోషిస్తారు. మెషీన్స్‌కు సంబంధించి మాన్యుఫాక్చరింగ్, డిజైనింగ్, మెయింటెనెన్స్, అనాల్సిస్ కాన్సెప్టులు బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో భాగం. ఈ నాలుగేళ్ళ కోర్సు మెకానికల్ ఇంజనీరింగ్‌లో ఉజ్వల కెరీర్‌కు రహదారిని నిర్మిస్తుంది. మేథ్స్, ఫిజిక్స్, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, థియరీ ఆఫ్ మెకానిక్స్, మెషీన్ డ్రాయింగ్, కంప్యూటర్ గ్రాఫిక్స్ తదితరాలు కోర్సులో ఉంటాయి. మాన్యుఫాక్చరింగ్, రీసెర్చ్, డిజైన్ ఎక్వి్‌పమెంట్‌కు సంబంధించి నైపుణ్యాల పెంపునకు పై అంశాల అధ్యయనం ఉపయోగపడుతుంది. సంబంధిత నైపుణ్యాలకు పదునుపెట్టుకోవడం ద్వారా మాత్రమే ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం లభిస్తుంది.
ప్రొ. ఎన్.వి.రమణారావు
డైరెక్టర్, ఎన్‌ఐటి రాయపూర్
ఈ వార్తలు కూడా చదవండి
సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో దరఖాస్తుల ఆహ్వానం
డిజిటల్ అరెస్టు పేరుతో.. వృద్ధుడికి రూ.53 లక్షల కుచ్చుటోపీ
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jul 07 , 2025 | 05:20 AM