Banana Peel Face Pack: అరటిపండు తొక్కతో ఇలా చేస్తే
ABN, Publish Date - Sep 06 , 2025 | 02:22 AM
సాధారణంగా మనం అరటిపండు తిని దాని తొక్కను పడేస్తూ ఉంటాం. అలాకాకుండా ఈ తొక్కతో ఫేస్‌ప్యాక్‌లు తయారుచేసుకుని వాడితే ముఖసౌందర్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ ఫేస్‌ప్యాక్‌ల....
సాధారణంగా మనం అరటిపండు తిని దాని తొక్కను పడేస్తూ ఉంటాం. అలాకాకుండా ఈ తొక్కతో ఫేస్‌ప్యాక్‌లు తయారుచేసుకుని వాడితే ముఖసౌందర్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ ఫేస్‌ప్యాక్‌ల తయారీ గురించి తెలుసుకుందాం...
ముందుగా అరటిపండు తొక్కను పసుపు నీళ్లతో శుభ్రంగా కడగాలి. తరవాత చిన్న ముక్కలుగా తుంచి మిక్సీలో వేసి కొన్ని నీళ్ల చుక్కలు చిలకరించి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పేస్టుని గిన్నెలోకి తీసుకోవాలి. అందులో అరచెంచా బియ్యప్పిండి, అర చెంచా చక్కెర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి మెల్లగా మర్ధన చేయాలి. అరగంట తరవాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. అరటిపండుతొక్క... చర్మానికి తేమను అందిస్తుంది. దీంతో ముఖం మీద ఏర్పడిన నల్ల మచ్చలు, ఎండ వల్ల వచ్చే టానింగ్ లాంటివి తగ్గిపోతాయి. చక్కెర... మృత కణాలను తొలగించి చర్మాన్ని మెరిపిస్తుంది. బియ్యప్పిండి చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది.
అరటి తొక్క పేస్టులో ఒక చెంచా తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తరవాత మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తూ ఉంటే ముఖం తాజాగా మెరుస్తూ కనిపిస్తుంది.
అరటి తొక్క పేస్టులో రెండు చెంచాల పెరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంటసేపు ఆరనివ్వాలి. తరవాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తూ ఉంటే చర్మ రంధ్రాలు పరిశుభ్రమవుతాయి. మొటిమలు, గుల్లలు రావు. చర్మం ఛాయగా మృదువుగా మారుతుంది.
అరటి తొక్క లోపలి భాగంతో ముఖాన్ని కింది నుంచి పైకి మెల్లగా రుద్దాలి. పావుగంట తరవాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తూ ఉంటే నుదుటి మీద, పెదవుల చుట్టూ ఏర్పడిన గీతలు, ముడుతలు మాయమవుతాయి. చర్మం బిగుతుగా ప్రకాశవంతంగా మారుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫలించిన ప్రభుత్వ ప్రయత్నం.. తెలంగాణకు యూరియా రాక..
మద్యం కుంభకోణం కేసులో కీలక పురోగతి
Read Latest TG News and National News
Updated Date - Sep 06 , 2025 | 02:22 AM