AP Liquor Case: మద్యం కుంభకోణం కేసులో కీలక పురోగతి
ABN , Publish Date - Sep 05 , 2025 | 05:43 PM
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు సంస్థ ( సిట్) శుక్రవారం కీలక పురోగతి సాధించింది.
విజయవాడ, సెప్టెంబర్ 05: ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు సంస్థ ( సిట్) శుక్రవారం కీలక పురోగతి సాధించింది. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరుడు, ఆయనకు అత్యంత సన్నిహితు వైఎస్ అనిల్ రెడ్డి వద్ద పీఏగా విధులు నిర్వహిస్తున్న దేవరాజులను ఉన్నతాధికారులు ఈ రోజు.. సిట్ కార్యాలయానికి పిలిపించారు. మద్యం కుంభకోణం వ్యవహారంలో పలువురి పాత్రపై ఆయనకు ప్రశ్నలు సంధించి.. అతని నుంచి జవాబులు రాబడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ విచారణలో అతడు ఇచ్చే సమాచారం ఆధారంగా ఈ కేసు కీలక పురోగతి సాధిస్తుందని సిట్ అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ మద్యం కుంభకోణంలో ఇప్పటి వరకు పలువురిని సిట్ అధికారులు విచారించారు. ఆ క్రమంలో 12 మందిని అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఇక ఇదే కేసులో జగన్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం, మంత్రిగా పని చేసిన నారాయణ స్వామిని సైతం సిట్ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా ఆయన స్టేట్‌మెంట్‌ను వారు రికార్డు చేసుకున్నారు.
జగన్ ప్రభుత్వం హయాంలో మద్యం విక్రయాల లావాదేవిలన్ని నేరుగా జరిగాయి. అంటే ఎక్కడ డిజిటల్ చెల్లింపులు అనేవి జరగలేదు. ఈ ప్రభుత్వంలో జే బ్రాండ్ మద్యం విక్రయాలకు తెర తీశారు. ఈ మద్యం తాగడం వల్ల అనేక మంది మృత్యువాత పడ్డారు. అలాగే పలువురు అనారోగ్యానికి గురయ్యారు. అంతేకాకుండా.. ఈ మద్యం విక్రయాల్లో భారీగా అవినీతి చోటు చేసుకుందంటూ ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి ఓటరు పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది.
అనంతరం మద్యం కుంభకోణంపై సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డిను సిట్ అధికారులు అరెస్ట్ చేసి.. విచారించారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితోపాటు బాలాజీ గోవిందప్ప తదితరులను అరెస్ట్ చేశారు. వీరికి బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు.
కానీ వీరికి కోర్టు మాత్రం బెయిల్ మంజూరు చేయడం లేదు. దాదాపు రూ 3,500 కోట్ల మద్యం కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. అదీకాక.. ఈ కేసు విచారణలో భాగంగా హైదరాబాద్ శంషాబాద్‌లో రూ. 11 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ మద్యం కుంభకోణం ద్వారా సంపాదించిన నగదుతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రాజ్ కసిరెడ్డి పలు ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించి.. వారిని సైతం సిట్ అధికారులు జప్తు చేసిన విషయం విదితమే.
ఈ వార్తలు కూడా చదవండి
ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ, గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్
మరోసారి వైసీపీ ఫేక్ ప్రచారం.. అసలు విషయమిదే..
Read Latest Andhra Pradesh News and National News