Battula Vijayabharathi: ఆ పొదుపు పాట ప్రార్థనా గీతమైంది
ABN, Publish Date - Oct 08 , 2025 | 01:51 AM
కరువుకు, వలసలకు నిలయమైన రాయలసీమలోని ఓర్వకల్లు ప్రాంతాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చారు బత్తుల విజయభారతి. పేద మహిళలను పొదుపుబాట పట్టించారు. వందల కోట్ల రూపాయల...
వినూత్నం
కరువుకు, వలసలకు నిలయమైన రాయలసీమలోని ఓర్వకల్లు ప్రాంతాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చారు బత్తుల విజయభారతి. పేద మహిళలను పొదుపుబాట పట్టించారు. వందల కోట్ల రూపాయల లావాదేవీలు సాగించే స్థాయికి ఎదిగేలా ప్రేరణనిచ్చారు. ముప్ఫయ్యేళ్ల క్రితం ఆమె నాటిన పొదుపు విత్తనం మహా వృక్షంగా మారి, వేలాది మందికి ఆధారంగా నిలుస్తోంది ఓర్వకల్లు మండలం పొదుపులక్ష్మి ఐక్య సంఘం గౌరవ సలహదారు విజయభారతి కథ... ఆమె మాటల్లోనే...
‘‘అది 1995 ఆగస్టు నెల. యూఎన్‌డీపీ (ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం) చేపట్టిన దక్షిణాసియా పేదరిక నిర్మూలన కార్యక్రమం తరఫున ప్రాజెక్టు ఆఫీసరుగా కర్నూలు జిల్లాకు వచ్చాను. నాకు ఆ ప్రాంతం గురించి ఏ మాత్రం అవగాహన లేదు. మా కార్యక్రమంలో మహిళలను ఎలా భాగస్వాముల్ని చేయాలి? పల్లెలకు వెళ్లి చెబితే... నా మాటలు వింటారా? ఒక బృందంగా కలిసి నడుస్తారా? ఇవన్నీ ఆ రోజు నా మదిలో మెదిలిన ప్రశ్నలు. ఆ సమయంలో అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు నంద్యాలలో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి నేనూ వెళ్లాను. అక్కడ ఓర్వకల్లు మండలం కాల్వ గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు నాకు పరిచయమయ్యారు. వారి ఊరికి వస్తానంటే... ఆప్యాయంగా ఆహ్వానించారు. రెండు రోజుల తరువాత ఆ గ్రామం వెళ్లి, ఆ మహిళలను కలిశాను. ఆ తరువాత క్రమం తప్పకుండా అక్కడికి వెళ్లేదాన్ని. రోజూ పదిమంది మహిళలను కలిసి, పొదుపు ఆవశ్యకతను వివరించేదాన్ని. ‘‘రోజంతా కష్టపడితే నాలుగు రూకలు కావడంలేదు. రోజుకో రూపాయి పొదుపు అంటే ఎలాగమ్మా?’’ అంటూ మొదట్లో వాళ్లు పట్టించుకోలేదు. ఈలోగా అప్పటి సీఎం చంద్రబాబు పొదుపు ఉద్యమాన్ని ఊరూరుకీ తీసుకువెళ్లారు. దాంతో... పది మహిళలను ఒప్పించి తొలి పొదుపు సంఘం ఏర్పాటు చేయగలిగాను. అనంతరం ఉశేనాపురం గ్రామం వైపు అడుగులు వేశాను. అలా 25 గ్రామాల్లో పొదుపు ఉద్యమ స్ఫూర్తిని రగిలించలిగాను.
సామాజిక అంశాలపై దృష్టి
మహిళలను రోజుకో రూపాయి పొదుపు ఉద్యమ బాటలో నడిపించాలంటే.. పల్లెసీమల్లో పట్టిపీడిస్తున్న సమస్యల మీద దృష్టి పెట్టడం ముఖ్యమని నిర్ణయించాం. తల్లులు పనికి వెళ్తే.... వారి పసిపిల్లల ఆలనాపాలన చూసేలా... ఆయాలను నియమించి, ‘అమ్మఒడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. బాల్య వివాహాలను అరికట్టడం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలికల విద్య, ఒంటరి మహిళలకు చేయూత, విద్య, ఆర్యోగం, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ, మరుగుదొడ్ల నిర్మాణం... ఇలా సామాజిక అంశాలపై కూడా చైతన్యం కలిగించాం. అప్పటి జిల్లా కలెక్టరుతో మాట్లాడి, వితంతువులు, భర్తలు వదిలేసిన మహిళల కోసం కాల్వ గ్రామంలో ‘జీవన జ్యోతి కాలనీ’ నిర్మించాం. వివిధ గ్రామాల్లో 2,500 మంది బాల కార్మికులను గుర్తించి, వారి కోసం ‘భవిత బాల కార్మికుల పాఠశాల’ను ఏడేళ్లు నిర్వహించాం. చదువుతో పాటు ఏపీ రెసిడెన్షియల్, సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో సీట్లు వచ్చేలా శిక్షణ ఇప్పించాం. ఆ పిల్లలు జీవితంలో స్థిరపడేంత వరకు చదివించాం. వాళ్లలో వంద మంది నర్సులు, ముగ్గురు డాక్టర్లు, 24 మంది ఇంజనీర్లు, ఇద్దరు ఎస్‌ఐలు ఉన్నారు. పలువురు ఉపాధ్యాయులుగా కంప్యూటర్ ఆపరేటర్లుగా స్థిరపడ్డారు. 2000 సంవత్సరంలో మహిళల భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన కోసం ‘సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ’ (సెర్ప్)ని నాటి సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారు. అది దేశంలోనే తొలి ప్రయోగం. దాని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలతో పనిచేసే అవకాశం కలిగింది. ఆ సమయంలో ‘జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం...’ అనే పాట రాశాను. ఇప్పుడు అది రెండు తెలుగు రాష్ట్రాల్లో పొదుపు మహిళల ప్రార్థన గీతం అయ్యింది. ‘సెర్ప్’ను దేశంలోని అన్ని రాష్ట్రాలు ‘స్టేట్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్’ (ఎస్‌ఆర్‌ఎల్‌ఎం) పేరిట అమలు చేయడంలో కర్నూలు జిల్లాకు దివంగత మాజీ గవర్నర్ పెండేకంటి వెంకట సుబ్బయ్య కుమారుడు సీనియర్ ఐఏఎస్ అధికారి విజయకుమార్ కృషి ఎంతో ఉంది.
రూ.395 కోట్లు టర్నోవర్
కాల్వ గ్రామంలో పది మందితో ఒక సంఘంగా మొదలైన పొదుపు ఉద్యమం ఊరూరా విస్తరించింది. 1998లో 500 పొదుపు సంఘాలతో.... 5 వేల మందితో ఏర్పాటైన ‘ఓర్వకల్లు మండలం పొదుపు లక్ష్మి ఐక్య సంఘం’ పరిధిలో.... ప్రస్తుతం 1,250 సంఘాలున్నాయి. 12,500 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వ కమ్యూనిటీ ఇన్వె్‌స్టమెంట్ ఫండ్ రూ.1.20 కోట్లు, యూఎన్‌డీపీ ప్రాజెక్టు సీడ్ క్యాపిటల్ రూ.30 లక్షలు కలిపి ఐక్య సంఘానికి రూ.1.50 కోట్ల నిధి చేకూరింది. ఆ డబ్బును పొదుపు సంఘాలకు 12 శాతం వడ్డీకి అప్పులు ఇవ్వడం, ఇచ్చిన అప్పు సకాలంలో వసులు చేయడం ద్వారా ఐక్య సంఘం నిధి దాదాపు రూ.5.50 కోట్లకు చేరింది. మహిళలే సొంతంగా ‘మ్యూచువల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సోసైటీ’ (మహిళా బ్యాంక్) ఏర్పాటు చేశారు. రూపాయి పొదుపుతో మొదలు పెట్టిన ఈ సంఘాలు సుమారు రూ.395 కోట్ల టర్నోవర్‌కు చేరాయంటే మహిళలు సాధించిన విజయమే. వారు 3,75 ఎకరాల్లో మండల ఐక్య సంఘం సొంత ఆఫీసు, 15 గ్రామాల్లో గ్రామ సమాఖ్య ఆఫీసులు నిర్మించుకున్నారు. మా ఓర్వకల్లు మండలం పొదుపు లక్ష్మి ఐక్య సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ‘నేషనల్ రిసోర్స్ ఆర్గనైజేషన్’ హోదా ఇచ్చింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలకు, సిబ్బందికి శిక్షణ ఇవ్వడమే కాదు... గ్రామ, మండల సమాఖ్య లీడర్లు సీఆర్‌పీలుగా పలు రాష్ట్రాలకు వెళ్లి సుమారుగా 50 వేల మంది శిక్షణ ఇచ్చారు. శ్రీలంక, ఇటలీ, మాల్దీవులు, నేపాల్ తదితర దేశాలకు వెళ్లి, అక్కడి జీవన ప్రమాణాలపై అధ్యయనం చేసే స్థాయికి ఓర్వకల్లు మహిళలు చేరుకున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పీ-4 కార్యక్రమంలో భాగంగా మా మండల ఐక్య సంఘం ద్వారా పది కుటుంబాలను ఎంపిక చేశాం. పేదరికం వల్ల విద్యకు దూరం అవుతున్న పిల్లలు, జబ్బుల బారిన పడి వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేని ఐదు కుటుంబాలకు తొలి విడతగా ఆర్థిక చేయూత అందించాం. వారి పిల్లల చదువు బాధ్యతలు మండల సమాఖ్య తీసుకుంది. అయిదేళ్లలో వంద కుటుంబాలకు పీ-4 కింద చేయూత ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం.’’
గోరంట్ల కొండప్ప కర్నూలు
ఫోటోలు : ఎస్‌ఎండీ రఫీ
బోధన నుంచి నుంచి పొదుపు ఉద్యమం వైపు
మా స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు. నాన్న బి.రామయ్య సమాచార, ప్రజా సంబంధాల శాఖలో జిల్లా పీఆర్‌వోగా, అమ్మ పి. అంజిమ్మ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా పనిచేసి, రిటైర్ అయ్యారు. నేను ఎంఈడీ పూర్తి చేసి.... నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరాను. నా చెల్లెళ్లలో భవాని డాక్టరుగా, రమా సుందరి గుంటూరు పాలిటెక్నిక్ కళాశాలలో సీనియర్ లెక్చరర్‌గా పని చేస్తున్నారు. తమ్ముడు శ్రీనివాస్ చక్రవర్తి యూఏఎ్‌సలో స్థిరపడ్డాడు. నేను లెక్చరర్‌గా పని చేస్తున్న సమయంలో 1991లో సంపూర్ణ అక్షరాస్య కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. నన్ను రిసోర్స్ పర్సన్‌గా తీసుకున్నారు. ఆ తరువాత డ్వాక్రా (పొదుపు) ఉద్యమానికి అప్పటి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. సంపూర్ణ అఽక్షరాస్యత కార్యక్రమంలో నేను చురుగ్గా పాల్గొనడంతో... నెల్లూరు జిల్లా డీఆర్‌డీఏ పీడీ సతీశ్‌చంద్ర సూచన మేరకు నాటి కలెక్టరు ఎం.సాంబశివరావు నన్ను డీఆర్‌డీఏ డ్వాక్రా ప్రాజెక్టు ఆఫీసర్‌గా నియమించారు. అలా బోధన నుంచి పొదుపు ఉద్యమ బాట పట్టాను. నెల్లూరు జిల్లా లేగుంటపాడు గ్రామంలో... తొలి రూపాయి పొదుపు కార్యక్రమం మొదలు పెట్టాం. ఆ తరువాత కుప్పంలో మూడు నెలలు పని చేశాను. అదే సమయంలో యూఎన్‌డీపీ పేదరిక నిర్మూలన కార్యక్రమంలో భాగంగా పైలెట్ ప్రాజెక్టు కింద కర్నూలు జిల్లాలో ఏడు మండలాలు ఎంపికయ్యాయి. అలా... ప్రాజెక్టు ఆఫీసరుగా ఓర్వకల్లుకు వచ్చాను.
ఈ వార్తలు కూడా చదవండి..
పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!
Read Latest Telangana News And Telugu News
Updated Date - Oct 08 , 2025 | 01:51 AM