ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bathukamma: బతుకమ్మ సమానత్వానికి ప్రతీక

ABN, Publish Date - Sep 29 , 2025 | 06:10 AM

సామాన్యుల ఇళ్ల ముంగిళ్ల నుంచి బతుకమ్మను విశ్వవిద్యాలయం మెట్లు ఎక్కించిన మొట్టమొదటి పరిశోధకురాలు బండారు సుజాతా శేఖర్‌. ఊరూరా తిరిగి గ్రామీణ మహిళల నాలుక మీద లిఖతమైన..

సామాన్యుల ఇళ్ల ముంగిళ్ల నుంచి బతుకమ్మను విశ్వవిద్యాలయం మెట్లు ఎక్కించిన మొట్టమొదటి పరిశోధకురాలు బండారు సుజాతా శేఖర్‌. ఊరూరా తిరిగి గ్రామీణ మహిళల నాలుక మీద లిఖతమైన కొన్నివందల బతుకమ్మ పాటలను ఆమె సేకరించారు. వాటిలోని పౌరాణిక, సామాజిక, సాంస్కృతిక, భాషా విశేషాల స్ఫూర్తిని ఎలుగెత్తి చాటారు. కనుమరుగవుతున్న మరికొన్ని పాటలకు పునర్జీవం పోశారు. బతుకమ్మ సంబురంలోని సామాజిక దీప్తిని తన పరిశోధనతో లోకానికి చాటిన ఆమెను ‘నవ్య’ పలకరించింది.

‘‘తెలంగాణ అంతటా ఇప్పుడు బతుకమ్మ ఆడుతున్నారని సంతోషపడాలా? ఆ పేరుతో చాలామంది డీజే పాటలతో, దాండియాలతో పిచ్చి గంతులేస్తున్నారని బాధపడాలా? అనేది తెలియడం లేదు. ఇవాళ కొన్ని వందల మంది పాడుతున్న ‘చిత్తు చిత్తుల బొమ్మ...’ లాంటి పాటలెన్నింటినో నా పరిశోధన ద్వారా పాతికేళ్ల కిందట వెలుగులోకి తెచ్చాను. మా సొంతూరు నల్గొండ జిల్లా దేవరకొండ. మా అమ్మ బండారు అనసూయమ్మనోట బతుకమ్మ పాటలు వింటూ పెరిగిన నాకు ఆ పాటలంటే ప్రాణం. పరిశోధనంటూ చేస్తే... బతుకమ్మమీదే చేయాలని అనుకున్నాను. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ అడ్మిషన్‌ ఇచ్చేముందు ఎనిమిదితో కూడిన ప్యానల్‌ నన్ను ఇంటర్వ్యూ చేశారు. అప్పటికే దేవరకొండ దగ్గర ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నాను. ‘‘బతుకమ్మ మీద పరిశోధన చేస్తాను’’ అని నేను అనగానే... ‘‘‘భుజాన సంచి తగిలించుకొని ఊరూరా తిరుగుతావా?’’ అని అడిగారు. ‘‘ఊర్లో కూర్చొంటే పీహెచ్‌డీ సీట్లు వస్తాయా?’’ అన్నారు. అదృష్టవశాత్తూ నాకు పాటలు వచ్చు కనుక అవి పాడి వినిపించాను. బతుకమ్మ పాటలపై నా పరిశోధన ముఖ్య ఉద్దేశాన్ని వివరిస్తూ రాసిన 30 పేజీల సినాప్సిస్‌ కూడా ఇచ్చాను. అది ప్యానల్‌కు బాగా నచ్చడంతో పీహెచ్‌డీలో ప్రవేశం కల్పించారు. తెలుగు జానపద సాహిత్యం పురాగాఽథ పరిశోధకురాలు రావి ప్రేమలత మేడమ్‌ను పర్యవేక్షకురాలిగా నియమించారు. అలా బతుకమ్మ పాటలు - పౌరాణిక, సామాజిక, సాంస్కృతిక, భాషా విశేషాలపై 1998లో పరిశోధన ప్రారంభించాను. నాలుగేళ్లలో పీహెచ్‌డి పూర్తి చేసి డాక్టరేట్‌ అందుకున్నాను.

ఊరూరా తిరిగి...

బతుకమ్మ పాటల సేకరణ అంత సులువుగా సాగలేదు. దసరా, సంక్రాంతి, వేసవి సెలవుల్లోనే కాదు... కొన్నిసార్లు ప్రత్యేకంగా స్కూలుకు సెలవుపెట్టి మరీ పాటల కోసం తెలంగాణ ఉమ్మడి పది జిల్లాలలోని చాలా గ్రామాలు తిరిగాను. బతుకమ్మకు ఇప్పుడున్నంత ప్రాచుర్యం ఆనాడు లేదు. తెలంగాణ ఉద్యమం పుణ్యమా అని ఇప్పుడు ఊరూ - వాడా బతుకమ్మ పండుగను ఘనంగా చేస్తున్నారు. చిన్న, పెద్ద అంతా కలసి ఉత్సాహంగా ఆడుతున్నారు. ఆ రోజుల్లో ఇంత సందడి లేదు. పాటలు వచ్చిన కొద్దిమంది పెద్దవాళ్ళకు తోడుగా గృహిణులు కొంతమంది చేరి, తొమ్మిది రోజులపాటు బతుకమ్మ ఆడుతుండేవారు. అమ్మాయిలైతే తమకు సంబంధం లేదన్నట్టు దూరంగా ఉండేవారు. బతుకమ్మ పాటలు పాడే వారిని వెతుక్కుంటూ ఎన్నో గ్రామాలకు వెళ్లాను. ‘‘పాటలు రికార్డు చేసుకుంటాను, పాడండి’’ అని అడిగితే, ‘‘నుడుగులు’ (పాటలు) ఏమి చేసుకుంటావమ్మా!’’ అని విసుక్కునే వారు. కొంతమంది అయితే ‘‘పో పోవమ్మా! పనిపాటలేదా?’’ అని చిరాకుపడేవాళ్లు. ఇంకొంతమంది సిగ్గుపడేవారు. అలా రకరకాల అనుభవాలు. ఒక్కొక్కరి దగ్గర కొన్ని గంటల తరబడి కూర్చొని, పాటలు సేకరించాను. అక్షరం ముక్క రాని ఆడవాళ్లు అలవోకగా పాటలు అల్లి లయబద్ధంగా పాడుతుంటే అవన్నీ రాసుకున్నాను. పండితులకు ఎంత మాత్రం తీసిపోని విధంగా వారంతా కొన్ని వందల పాటలు ఆశువుగా పాడడం ఒక అద్భుతం. ప్రతి మహిళ నాకు ఒక వాగ్దేవిగా కనిపించేది. ఊరూరా తిరిగి సెల్‌ఫోన్లు లేని ఆ రోజుల్లో 700కుపైగా పాటలు సేకరించాను.

బతుకమ్మ పాటలు...

ఈ తొమ్మిది రోజులూ ఆడవాళ్లందరూ కలిసి సాధక బాధకాలను, కష్టసుఖాలను పాటగా అల్లి పాడుకోవడం ఈ పండుగలో చూస్తుంటాం. అత్తకోడళ్లు, యారాళ్లు, అన్నాచెల్లెళ్లు ఇలా... నిత్యజీవితంలో ఎదుర్కొనే కడగండ్ల మీదా బోలెడు బతుకమ్మ పాటలున్నాయి. సాంఘిక ఆచారాలు, వస్తు సంస్కృతి, కళలు, జానపద విజ్ఞానం కలగలసిన బతుకమ్మ పాటలలో కథా గేయాలు, అలాగే కథారహితమైన గేయాలు కనిపిస్తాయి. జానపదుల నోళ్లలో జీవం పోసుకున్న ఆ పాటల్లోని ఛందస్సు, అలంకారాలు, నవరస పోషణ అబ్బురపరుస్తుంది. దుర్మార్గుల ఆకృత్యాలకు బలైన ఒక మహిళ గాథను ‘అండాలమ్మ పాట’గా నేటికీ భువనగిరి జిల్లాలో బతుకమ్మ పండుగ నాడు పాడుతున్నారు. ‘పంద్రాగస్టుని ఉయ్యాలో, పండుగొచ్చిందమ్మ ఉయ్యాలో’ అంటూ దేశ స్వాతంత్ర్యానంతరం హైదరాబాద్‌ రాష్ట్రంలో తలెత్తిన అరాచకాలు ఇతివృత్తంగా మరొకచోట పాడతారు. నల్గొండ జిల్లాలోని జాన్‌పహాడ్‌హలోని ఉరుసు ఉత్సవాన్ని వర్ణిస్తూ మతసామరస్యాన్ని కొనియాడుతూ ఇంకో పాట ఆలపిస్తారు. ఇలా మహిళల భావాలు, స్వభావాలు, రామాయణ, మహాభారత గాథలు, స్థానిక చరిత్ర, ఇంట, బయట ఆడవాళ్లకు ఎదురయ్యే ఒడుదొడుకులు, వాటిని ఎదుర్కొనే ఉపాయాలు ఇతివృత్తంగా ‘కోల్‌’, ‘ఉయ్యాలో’, ‘వలలో’ లాంటి మకుటాలతో సాగే బతుకమ్మ పాటలలోని పౌరాణిక, సామాజిక, భాషా, సాంస్కృతిక విలువలను నా పరిశోధనలో వివరించాను. అది పుస్తకంగానూ వచ్చింది. ఇప్పటికి మూడు ముద్రణలు అయ్యాయి.

ఒక్కోచోట ఒక్కోలా ఆట...

బతుకమ్మ పండుగ చేసుకునే తీరు తెలంగాణ అంతటా దాదాపుగా ఒక్కటే. అయినా, పాటల రూపాంతరాలు, ఆటలో అడుగులు మాత్రం ఒక్కోచోట ఒక్కోలా ఉంటాయి. ఒక పాట ఒకచోట సానుకూల దృక్పథంతో సాగితే మరొక చోట హితబోధ రీతిలో పాడతారు. వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో వలయాకారంలో తిరుగుతూ కోలాటం ఆడుతూ బతుకమ్మను కొలుస్తారు. చప్పట్లు కొట్టేప్పుడు శరీర కదలికల్లోనూ శ్రామిక మహిళలకు, గృహిణులకు మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంటుంది. మరికొన్ని గ్రామాలలో మహిళలు బతుకమ్మను వాయినంగా ఇచ్చిపుచ్చుకుంటారు. కొన్ని ఊర్లలో మగవాళ్లు బతుకమ్మను పేర్చడం చూశాను. వాళ్లే నెత్తినపెట్టుకొని చెరువుకు తీసుకెళతారు. మెదక్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలలో బాలికలతో బొడ్డెమ్మ పండుగ బాగా జరుపుతారు. హన్మకొండ, నల్గొండ ప్రాంతాలలోని కొన్ని గ్రామాలలో భూస్వామ్యుల అరాచకరాలు భరించలేక బతుకమ్మ పండుగ చేయరు. ఇంకొందరు కలిసిరాలేదని ఈ పండుగ చేసుకోరు. మలిదశ తెలంగాణ ఉద్యమకాలం నుంచి మాత్రం ప్రతి ఇల్లు బతుకమ్మకు లోగిలిగా మారింది. సకల జనుల పండుగ అయింది.

మహిళల వల్లే బతికింది...

బతుకమ్మను బతికించింది ముమ్మాటికి గ్రామీణ మహిళల మౌఖిక సాహిత్యమే. కొన్నివందల ఏళ్లనాటి బతుకమ్మ పండుగ సంప్రదాయం ఈనాటికి కొనసాగిస్తున్నామంటే అదంతా అమ్మల పుణ్యమే. ఒకనాడు తెలంగాణ బిడ్డల పలకరింపునకు పెద్దగా నోచుకోని బతుకమ్మను ఇవాళ దేశ దేశాలలోని తెలంగాణ వారంతా కలసి ఘనంగా ఆడుతున్నారు. రెండు దశాబ్దాల కిందట ముంబయిలోని మన వలస శ్రామికుల వీధిలో ఇద్దరు లేదా ముగ్గురు మహిళలు మాత్రమే బతుకమ్మ ఆడేవారు. ఇప్పుడు అక్కడ పండుగ నాడు వందలమంది మహిళలు జమవుతున్నారు. బతుకమ్మ ఆడుతున్నారు. నేను ‘బతుకమ్మ’ సినిమాకు ఆరుపాటలు అందించాను. నా భర్త శేఖర్‌ సహకారంతో ‘బతుకమ్మ ఫౌండేషన్‌’ నెలకొల్పాను. మా స్తోమత మేరకు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రధానోపాధ్యాయురాలిగా నిరుడు ఉద్యోగ విరమణ చేసిన నాటి నుంచి పూర్తి సమయం సాహిత్య సృజనకు కేటాయిస్తున్నాను. అణాగ్రంథమాల వ్యవస్థాపకులలో ఒకరైన తెలంగాణ వైతాళికుడు కేసీగుప్త జీవిత జీవిత చరిత్ర రాయడం నాకు దక్కిన మరొక అరుదైన అవకాశం. తీజ్‌ పండుగకు, బొడ్డెమ్మకు సారుప్యత ఉన్నా... బతుకమ్మ మన నేల సాహిత్య, సాంస్కృతిక, జీవన విధానానికి ప్రతీక. అది మన అస్తిత్వం. దాండియా, డీజేలకు దూరంగా సహజసిద్ధంగా బతుకమ్మను ఆడుదాం.’’

సాంత్వన్‌

అంతరాల దొంతరలకు అతీతం

పూలు అంగట్లో కొని పేర్చమని బతుకమ్మ అడగలేదు. పెద్ద బతుకమ్మను పేర్చాలని పోటీలుపడి మరీ పేర్చడం, అందులో కృత్రిమపూలు వాడడం పండుగ స్ఫూర్తికి విరుద్ధం. పొలాలవెంట సులువుగా దొరికే తంగెడు, గునుగు, బీర, కాకర, జిల్లేడు, గుమ్మడి, బంతి, చామంతి, ముత్యపు పూలతో పూజించడమే అమ్మకు అసలైన ఆరాధన. బతుకమ్మను పేర్చడం, మధ్యలో నింపడంలోనూ కళాత్మకత ఉట్టిపడుతుంది. తెలంగాణ తల్లి సిగలో పూసే తీరొక్క పూలన్నీ ఒకచోట ఆలయ గోపురంగా కొలువుదీరినట్టుగా ‘మనుషులంతా ఒక్కటే’ అన్నది బతుకమ్మ సందేశం. రకరకాల పూల పేర్పు సమానత్వానికి ప్రతీక. రంగురంగుల పుష్పాల రాశి... ఐకమత్యానికి నిదర్శనం. బతుకమ్మ అందరికీ అమ్మ. బతుకమ్మ ఆటకు కులభేదాలు లేవు. మహిళలందరూ అంతరాల దొంతరలకు అతీతంగా... అంతా కలసిమెలసి సంతోషంగా ఆట, పాటలతో చేసుకునే పండుగ బతుకమ్మ.

ఇవీ చదవండి:

Allianz Global Wealth Report 2025: కుటుంబాల సంపద మరింత పైకి

Pharma Stocks Plunge: ఫార్మా సుంకాల షాక్‌

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 29 , 2025 | 06:12 AM