Share News

Allianz Global Wealth Report 2025: కుటుంబాల సంపద మరింత పైకి

ABN , Publish Date - Sep 27 , 2025 | 06:03 AM

భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా కుటుంబాల సంపద పెరిగిపోతోంది. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఇది 8.7 శాతం వృద్ధితో 315.9 లక్షల కోట్ల డాలర్లకు (సుమారు రూ.28,026 లక్షల కోట్లు) చేరింది...

Allianz Global Wealth Report 2025: కుటుంబాల సంపద మరింత పైకి

గత ఏడాది 14.5 శాతం అప్‌.. దేశంలో మారుతున్న పెట్టుబడుల ట్రెండ్‌

షేర్లు, డిబెంచర్ల వైపు మొగ్గు.. అలియాంజ్‌ గ్లోబల్‌ వెల్త్‌ రిపోర్ట్‌ వెల్లడి

న్యూఢిల్లీ: భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా కుటుంబాల సంపద పెరిగిపోతోంది. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఇది 8.7 శాతం వృద్ధితో 315.9 లక్షల కోట్ల డాలర్లకు (సుమారు రూ.28,026 లక్షల కోట్లు) చేరింది. ఇందులో సగం వాటా అమెరికాదే. దాదాపు 60 దేశాల్లోని పెరుగుతున్న కుటుంబ సంపదలను పరిశీలించి అలియాంజ్‌ గ్లోబల్‌ అనే సంస్థ ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం గత పదేళ్లలో పెరిగిన ప్రపంచ కుటుంబాల సంపదలో 47 శాతం అమెరికా నుంచి రాగా 20 శాతం చైనా నుంచి, 12 శాతం పశ్చిమ ఐరోపా దేశాల నుంచి సమకూరింది.


భారత్‌లోనూ: మన దేశంలోనూ కుటుంబాల సంపద బాగానే పెరుగుతోంది. గత ఏడాది భారత్‌లోని కుటుంబాల సంపద గత ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేనంతగా 14.5 శాతం పెరిగిందని అలియాంజ్‌ గ్లోబల్‌ వెల్త్‌ నివేదిక -2025 తెలిపింది. గత రెండు దశాబ్దాల్లో మన దేశ కుటుంబాల పెట్టుబడుల స్వరూపంలోనూ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలోలా ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పొలాలు, నగ నట్రా కంటే బ్యాంక్‌ డిపాజిట్లు, షేర్లు, డిబెంచర్లు, పెన్షన్‌ ఫండ్లు, బీమా పాలసీల్లో మదుపు చేసేందుకు కుటుంబాలు ఇష్టపడుతున్నాయి. దీంతో గత 20 ఏళ్లలో భారత్‌లోని కుటుంబాల ఫైనాన్షియల్‌ ఆస్తులు ఐదు రెట్లు పెరిగాయి.

మరే వర్థమాన దేశంలోనూ కుటుంబాల ఫైనాన్షియల్‌ ఆస్తులు ఈ స్థాయిలో పెరగలేదని నివేదిక తెలిపింది. ఈ కాలంలో షేర్లు, డిబెంచర్ల ఆస్తులు 28.7 శాతం, బీమా-పెన్షన్‌ పథకాల ఆస్తులు 19.7 శాతం పెరిగాయి. అయితే ఇప్పటికే భారతీయ కుటుంబాల ఫైనాన్షియల్‌ ఆస్తుల్లో 54 శాతం వాటా బ్యాంక్‌ డిపాజిట్లదేనని ఆ నివేదిక పేర్కొంది.


ఇతర ప్రధానాంశాలు

  • 2024లో 15.6 శాతం వృద్ధితో 2,818 డాలర్లకు చేరిన భారత కుటుంబాల సగటు నికర ఫైనాన్షియల్‌ ఆస్తులు

  • 12.1 శాతం వృద్ధితో జీడీపీలో 41 శాతానికి చేరిన భారత కుటుంబాల అప్పులు

  • ద్రవ్యోల్బణాన్ని తీసివేస్తే గత ఏడాది 9.4 శాతం పెరిగిన భారత కుటుంబాల ఫైనాన్షియల్‌ ఆస్తులు

  • కొవిడ్‌ తర్వాత 40 శాతం పెరిగిన భారత కుటుంబాల కొనుగోలు శక్తి

  • మొత్తం కుటుంబ ఫైనాన్షియల్‌ ఆస్తుల పెట్టుబడుల్లో షేర్లు, డిబెంచర్ల వాటా 13 శాతం మాత్రమే

  • ప్రపంచ కుటుంబాల సంపదలో 60 శాతం.. 10 శాతం కుటుంబాల చేతుల్లో కేంద్రీకృతం

  • భారత్‌లోని 10 శాతం కుటుంబాల చేతిలో 65 శాతం కుటుంబ సంపద

  • గత 20 ఏళ్లలో 13 రెట్లు పెరిగిన భారతీయ కుటుంబాల ఫైనాన్షియల్‌ ఆస్తులు

ఇవి కూడా చదవండి..

ఫీవర్‌తో బాధపడుతున్న పవన్

మండలిలో అచ్చెన్న, బొత్స మధ్య మాటల యుద్ధం

Read latest AP News And Telugu News

Updated Date - Sep 27 , 2025 | 06:03 AM