Atchannaidu Botsa Clash: మండలిలో అచ్చెన్న, బొత్స మధ్య మాటల యుద్ధం
ABN , Publish Date - Sep 26 , 2025 | 01:29 PM
సూపర్ సిక్స్.. సూపర్ హిట్ కాదు.. సూపర్ డూపర్ హిట్ అయిందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. రెండు జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే ప్రజలు వైసీపీకి డిపాజిట్లు రాకుండా చేశారు.
అమరావతి, సెప్టెంబర్ 26: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుపై శాసన మండలిలో వాడీ వేడీ చర్చ జరిగింది. ఈ అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu), విపక్ష నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆరు పథకాలు అమలు చేస్తే.. అది సూపర్ హిట్ అంటారని.. మూడు కార్యక్రమాలు చేసి అయిపోయిందంటే ఎలా... అన్నీ చేయాలి కదా అని విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘మేమిచ్చిన హామీలన్నింటినీ అమలు చేశాం. సూపర్ సిక్స్.... సూపర్ హిట్ కాదు.. సూపర్ డూపర్ హిట్ అయింది. రెండు జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే ప్రజలు వైసీపీకి డిపాజిట్లు రాకుండా చేశారు. సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారనేందుకు ఫలితాలు నిదర్శనం’ అని మంత్రి చెప్పుకొచ్చారు.
బొత్స: గతంలో కుప్పం మున్సిపాలిటీ కూడా మేము గెలిచాం.
అచ్చెన్న: కుప్పం ఎన్నికల్లో నామినేషన్లు వేయించలేదు. నామినేషన్లు వేస్తే పేజీలు కూడా చించేసి ప్రజాస్వామ్యం లేకుండా చేశారు. ఇటీవల జడ్పీటీసీ ఎన్నికల్లో 11 మంది నామినేషన్లు వేయగా గెలిచాం. అన్ని పార్టీలు నామినేషన్లు వేయగా ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరిగాయి.
బొత్స: డీఎస్సీలో కూటమి ప్రభుత్వం కేవలం 16 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. వైసీపీ హయాంలో ఇదే సమయానికి 1.50 లక్షల ఉద్యోగాలిచ్చాం.
అచ్చెన్న: వైసీపీ హయాంలో వైసీపీ కార్యకర్తలకు వాలంటీర్ల ఉద్యోగాలిచ్చారు. అధికారంలో ఉండగానే కార్యకర్తల ఉద్యోగాలనూ తీసేశారు అంటూ ఫైర్ అయ్యారు.
ఎమ్మెల్సీ ప్రశ్న.. మంత్రి ధీటైనా సమాధానం..
సూపర్ సిక్స్ హామీల అమలు చర్చలో వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడారు. సూపర్ సిక్స్ హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. 16 రకాల బస్సులుండగా కేవలం 5 కేటగిరీ బస్సుల్లోనే ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశారని తెలిపారు. తొలి ఏడాదిలో కూటమి ప్రభుత్వం 2 సిలిండర్లను ఎగ్గొట్టిందంటూ వ్యాఖ్యానించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల అమలు కోసం నిధులు విడుదల చేయడం లేదని వైసీపీ ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీ నెరవేర్చలేదన్నారు వరుదు కళ్యాణి.
వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి ఆరోపణలను ధీటుగా తిప్పికొట్టారు మంత్రి అచ్చెన్నాయుడు. వైసీపీ హయాంలో 5 ఏళ్లు పాటు ఆర్థిక విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం తొమ్మిదిన్నర లక్షల కోట్లతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని విమర్శించారు. అప్పులు చేశాం కాబట్టి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చలేరని వైసీపీ సభ్యులు ఆశించారని.. ఆర్ధిక ఇబ్బందులు చాలా ఉన్నా అధిగమించి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చుతోందని స్పష్టం చేశారు. చంద్రబాబు లాంటి వ్యక్తి రాష్ట్రంలో పుట్టడం సీఎం కావడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. వైసీపీ ప్రభుత్వం మూసేసిన అన్న క్యాంటీన్లను ప్రారంభించి పేదల ఆకలి తీర్చుతున్నారని తెలిపారు.
సూపర్ సిక్స్ హామీలన్నింటినీ ఏడాదిలోనే అమలు చేసి ప్రజలకు మేలు చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు 20 వేలు సాయం చేస్తామన్నామని.. రాష్ట్రం 14 వేలు కేంద్రం 6 వేలు చొప్పున రైతులకు ఇస్తామని చెప్పి అమలు చేస్తున్నామని చెప్పారు. 3 లక్షల మంది కౌలు రైతులకూ అన్నదాత సుఖీభవ కింద ఆర్ధిక సాయం చేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్క రైతుకూ అన్నదాత సుఖీభవ కింద ఆర్ధిక సాయం అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
ఎస్కేయూలో అక్రమాలు.. చర్యలు తప్పవన్న మంత్రి లోకేష్
Read latest AP News And Telugu News