Ayurvedic Remedies: జలుబు జ్వరాలకు చెల్లుచీటీ
ABN, Publish Date - Aug 12 , 2025 | 04:27 AM
వానాకాలం విజృంభించే జ్వరాల గురించి మనందరికీ తెలిసిందే! అయితే మారుతున్న కాలంతో పాటు శరీరంలో చోటుచేసుకునే మార్పులకు తగ్గట్టు ఆహార, జీవనశైలులను మార్చుకోగలిగితే వానాకాలం జ్వరాల నుంచి రక్షణ...
వానాకాలం వెతలు
వానాకాలం విజృంభించే జ్వరాల గురించి మనందరికీ తెలిసిందే! అయితే మారుతున్న కాలంతో పాటు శరీరంలో చోటుచేసుకునే మార్పులకు తగ్గట్టు ఆహార, జీవనశైలులను మార్చుకోగలిగితే వానాకాలం జ్వరాల నుంచి రక్షణ పొందవచ్చని ఆయుర్వేదం చెప్తోంది.
శరీరంలోని వాత, పిత్త, కఫాల్లోని హెచ్చుతగ్గులతో జ్వరాలు సోకుతూ ఉంటాయి. వాత జ్వరం, పిత్త జ్వరం, కఫ జ్వరంతో పాటు రెండు, మూడు దోషాలు కలిసిన సన్నిపాతిక జ్వరాలు కూడా వానాకాలంలో సోకుతూ ఉంటాయి. అలాగే ఇన్‌ఫెక్షన్లు, దోమకాట్ల వల్ల సోకే విషమ జ్వరాలు కూడా ఈ కాలంలో వేధిస్తూ ఉంటాయి. సంతత, సతత, అన్యేదుష్య, త్రితీయక, చాతుర్ధక అనే ఐదు రకాల విషమ జ్వరాలే... మలేరియా, డెంగు, వైరల్ జ్వరాలు. మనమిప్పుడు ఆధునిక వైద్యంలో ఆచరిస్తున్నట్టు, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, దోమలు దరి చేరకుండా జాగ్రత్త పడడం లాంటి ముందస్తు జాగ్రత్తలతో ఈ జ్వరాలను అడ్డుకోవచ్చు. అలాగే ఈ కాలంలో ఆహార కలుషితం వల్ల ఇన్‌ఫెక్షన్లు కూడా పెరుగుతాయి. కాబట్టి మారే రుతువులకు అనుగుణంగా మన దినచర్య, రుతు చర్య, జీవనశైలులను మలుచుకోవాలి.
జలుబు, జ్వరాలకు అడ్డుకట్ట ఆయుర్వేదంలో జ్వరాలకు పలు రకాల చికిత్సలున్నప్పటికీ ఇంట్లో స్వయంగా చేసుకోగలిగే కొన్ని స్వల్ప చికిత్సలు కూడా ఉన్నాయి. సాధారణంగా ఈ కాలంలో జలుబుతో కూడిన జ్వరం ఎక్కువ మందిని వేధిస్తుంది. జలుబు జ్వరంగా మారక ముందే మొదలుపెట్టే వీలున్న చికిత్సలు కూడా ఉన్నాయి. అవేంటంటే...
ఐదు తులసి ఆకులు, ఐదు మిరియాలు దంచి, మూడు పూటలా నమిలి తినాలి. దీంతో ఉన్న జలుబు తగ్గడంతో పాటు రాకుండా రక్షణ కూడా దక్కుతుంది
అలర్జీ సంబంధిత జలుబుతో ముక్కు నుంచి నీరు కారుతున్నప్పుడు ఇంట్లో దంచుకున్న పసుపు రెండు చిటికెలు తీసుకుని, అరగ్లాసు పాలలో కలుపుకుని తాగాలి. దాంతో రోగనిరోధకశక్తి పెరిగి, అలర్జీ తగ్గిపోతుంది
జలుబుతో పాటు గొంతు గరగరలాడుతుంటే, మిరియాలు పొడి చేసుకుని, పాలలో కలిపి తాగాలి
గుడూచి... జ్వరానికి ఉత్తమమైన ఔషథం. జ్వరం మొదలైన వెంటనే మూడు లేదా నాలుగు గుడూచి ఆకులను దంచి, రసాన్ని తాగాలి
జ్వరం తీవ్రమైనప్పుడు అనుభవం ఉన్న ఆయుర్వేద వైద్యులను సంప్రతించి, ఆనందభైరవ రసం, త్రిభువనకీర్తి రసం తీసుకోవాలి
ముందస్తుగానే జ్వరాన్ని అడ్డుకోవడం కోసం మాత్రల రూపంలో దొరికే మృత్యుంజయ రసాన్ని తీసుకోవచ్చు. దీన్ని రోజుకు రెండు పూటలా, వారం రోజుల పాటు వాడుకోవాలి
దగ్గు మొదలైనప్పుడు లవంగాది వటి తీసుకోవచ్చు
అడ్డసరం రసం తాగినా ఈ కాలంలో వేధించే దగ్గుల నుంచి ఉపశమనం దక్కుతుంది
ఆచారాల్లోనే ఆరోగ్యం
ఈ కాలంలో తినే ఆహారం తాజాగా ఉండాలి. ఏ పూటకాపూట వండుకుని, వేడిగా తినాలి. నిల్వ ఉన్న ఆహారం, నీరు తాగకూడదు. మరీ ముఖ్యంగా వర్షాలు ఉధృతంగా కురుస్తున్నప్పుడు ఆకుకూరలు తినడం మానేయడం మంచిది. నిజానికి వానాకాలం నుంచి రక్షణ కల్పించే అలవాట్లు మన సంప్రదాయాల్లోనే ఉన్నాయి. ఈ కాలంలో మాంసాహారం తేలికగా జీర్ణమవక శరీరంలో ఆమం పెరుగుతుంది. వానాకాలంలో వచ్చే శ్రావణమాసంలో మాంసాహారానికి దూరంగా ఉండడం వెనకున్న కారణం ఇదే! అలాగే చవితి నాటి పత్రికి బ్యాక్టీరియా, వైర్‌సలను తరిమే గుణాలుంటాయి. అలాగే ఆ రోజు తుమ్మి కూర తింటాం. దాంతో వ్యాధినిరోధకశక్తి పెరిగి వానాకాలం వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి. వాకిళ్లకు, పెళ్లిళ్లలో పందిళ్లకు కట్టే మామిడి తోరణాలకు కూడా కొన్ని ప్రయోజనాలున్నాయి. చెట్టు నుంచి కోసిన తర్వాత వారం రోజుల వరకూ కూడా మామిడాకుల నుంచి ఆక్సిజన్ విడుదల అవుతూనే ఉంటుంది. అలాగే ఈ ఆకులు వైరస్, బ్యాక్టీరియాల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇలా ప్రతి ఆచారం వెనక నిగూఢమైన ఆయుర్వేద శాస్త్రం దాగి ఉంటుంది. కాబట్టి ఆయా ఆయుర్వేద ఆరోగ్య సూత్రాలను అనుసరించగలిగితే, వానాకాలం రుగ్మతల నుంచి ప్రతి ఒక్కరూ సులువుగా బయటపడగలుగుతారు.
వానాకాలం ఆహారం
శరీరం మొత్తం వాత, పిత్త, కఫ దోషాలు ఆవరించి ఉంటాయి. ఇవి సమ స్థితిలో ఉన్నప్పుడు ఆరోగ్యం నిక్షేపంగా ఉంటుంది. కానీ ఈ కాలంలో కఫాన్ని పెంచే చల్లని పదార్థాలు, తీపి పదార్థాలు తినడం వల్ల జలుబు, దగ్గు, జ్వరాలు వేధిస్తాయి. అలాగే ఈ కాలంలో జీర్ణశక్తి తగ్గుతుంది. కాబట్టి తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం, పాలు, వెన్న, మీగడ, తీపి పదార్థాలు మానేయాలి. పెరుగుకు బదులు మజ్జిగ తీసుకోవాలి. అలాగే ఇడ్లీ, దోసెల రూపంలో మినప్పప్పు ఎక్కువగా తింటూ ఉంటాం. కానీ మినప్పప్పు ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటుంది కాబట్టి కఫం పెరిగి, బరువు పెరుగుతాం. జలుబు, దగ్గు వేధిస్తాయి. కాబట్టి ఈ కాలంలో మినప్పప్పు వాడకం తగ్గించాలి. కాయగూరలు ఎక్కువగా తినాలి. తినే ఆహారం వేడిగా ఉండేలా చూసుకోవాలి. కడుపును మూడు భాగాలు చేసుకుని, ఒక భాగం ఆహారంతో, రెండో భాగం నీటితో నింపి, మూడో భాగాన్ని ఖాళీగా వదిలేస్తూ ఉండాలి. ఇలాంటి అలవాటుతో జీర్ణశక్తి కుంటుపడకుండా ఉంటుంది. ఇలా ఆయుర్వేద శాస్త్రం సూచించే అలవాట్లను అలవరుచుకోగలిగితే వానాకాలం వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.
డాక్టర్ ఎన్. ఉమా శ్రీనివాస రావు
ప్రొఫెసర్ అండ్ వైస్ ప్రిన్సిపాల్,
డాక్టర్ బి.ఆర్.కె.ఆర్. గవర్నమెంట్
ఆయుర్వేదిక్ కాలేజి, హైదరాబాద్.
ఇవీ చదవండి:
ట్రంప్ సుంకాల ఎఫెక్ట్.. భారత టెక్స్‌టైల్ ఉత్పత్తుల దిగుమతులకు అమెరికా సంస్థల బ్రేక్
పాన్ కార్డు ఇనాక్టివ్ అయ్యిందా.. ఇలా చేస్తే సమస్యకు పరిష్కారం
Updated Date - Aug 12 , 2025 | 04:27 AM