Asmita Paul: ఆత్మరక్షణ కేరాఫ్ అస్మిత
ABN, Publish Date - Oct 06 , 2025 | 05:35 AM
భయం, ఆంక్షలు, వేధింపులు... వీటన్నిటినీ ఎదుర్కోవాలంటే మహిళలకు ఆత్మరక్షణ విద్య తప్పనిసరి అంటోంది అస్మితా పాల్. దేశవ్యాప్తంగా ఈ అంశంపై అవగాహన పెంచడం కోసం...
భయం, ఆంక్షలు, వేధింపులు... వీటన్నిటినీ ఎదుర్కోవాలంటే మహిళలకు ఆత్మరక్షణ విద్య తప్పనిసరి అంటోంది అస్మితా పాల్. దేశవ్యాప్తంగా ఈ అంశంపై అవగాహన పెంచడం కోసం స్కూటీ మీద ఏడువేల కిలోమీటర్లకి పైగా ఒంటరిగా పర్యటించి, ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. ఇరవయ్యేళ్ళ ఈ అసోం అమ్మాయి సెల్ఫ్ డిఫెన్స్ శిక్షకురాలుగా ఎంతోమందిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది.
‘‘నాలుగు నెలల క్రితం నా పర్యటనలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఉన్నాను. అక్కడ మహిళలకు, బాలికలకు ఆత్మరక్షణ విద్యల ఆవశ్యకత గురించి ఒక కార్యక్రమం నిర్వహించాను. నేను బయలుదేరబోతూ ఉంటే... పదమూడేళ్ళ అమ్మాయి బిడియపడుతూ నా దగ్గరకు వచ్చింది. ‘‘అక్కా! బలంగా, దృఢంగా ఉండాలని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ నిన్ను చూసిన తరువాత... సెల్ఫ్ డిఫెన్స్ విద్యలు నేర్చుకోవాలనిపిస్తోంది’’ అంటూ నన్ను గట్టిగా హత్తుకుంది. ఆ అమ్మాయిలో అమాయకత్వంతో పాటు ధైర్యం కూడా కనిపించింది. నా మనసు చలించిపోయింది. నేను చెప్పే మాటల్లో నిజాన్ని ఒకే ఒక్క అమ్మాయి అర్థం చేసుకున్నా... నా ప్రయాణం సఫలమైనట్టేనని భావించాను. ఈ సంఘటన ఆ తరువాత సాగించిన ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకోగలిగే ప్రేరణను కలిగించింది.
ఇది ప్రతి అమ్మాయి అనుభవం
మాది అసోంలోని గువహటికి చెందిన దిగువ మధ్య తరగతి కుటుంబం. నేను యావరేజ్ స్టూడెంట్‌ని. కానీ ఆటల్లో ముందుండేదాన్ని. ఆత్మ రక్షణ విద్యలు నేర్చుకోవాలనే ఆలోచన రావడానికి కారణం... నా చుట్టూ ఉన్న పరిస్థితులే. వీధుల్లో వెళ్తూ ఉంటే పోకిరీలు వేధించేవారు. ఆ సంగతి ఇంట్లో చెబితే... ‘‘ఇక అటువైపు వెళ్ళకు’’ అనేవారు, ఆంక్షలు పెట్టేవారు. ఇవన్నీ నాలో భయాన్ని పెంచేవి. ఇది నా సమస్య మాత్రమే కాదు... దాదాపు ప్రతి అమ్మాయి నిత్యం ఎదుర్కొనే అనుభవం. ‘ఎంతకాలం ఇలా భయపడుతూ బతకాలి?’ అని ఆలోచించినప్పుడు, నాకు తోచిన పరిష్కారం... ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవడం. అందుకోసం నా కుటుంబాన్ని ఒప్పించడానికి ఎంతో శ్రమపడాల్సి వచ్చింది. శిక్షణలో చేరిన తరువాత... రోజురోజుకూ నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అవాంఛనీయమైన సందర్భాలు ఎదురైనప్పుడు... నన్ను నేను కాపాడుకోగలననే ధైర్యం కలిగింది. శిక్షణ పూర్తి చేశాక... సెల్ఫ్ డిఫెన్స్ శిక్షకురాలిగా మారాను. మా ప్రాంతంలోని అమ్మాయిలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాను.
స్కూటీయే ఎందుకంటే...
ఆత్మరక్షణ విద్యలు కేవలం శరీర దారుఢ్యానికి, మనల్ని రక్షించుకోవడానికి మాత్రమే కాదు... అవి మహిళా సాధికారతకు కూడా దోహదం చేస్తాయి. సమాజంలో ప్రతి అమ్మాయి సురక్షితంగా, స్వేచ్ఛగా జీవించాలంటే ఈ విద్యలుతప్పనిసరి అనేది నా అభిప్రాయం. ఈ విషయంపై దేశవ్యాప్తంగా మహిళలకు అవగాహన కలిగించడం కోసం పర్యటన చేయాలనే ఆలోచన కొన్నాళ్ళ క్రితం వచ్చింది. దానికి ప్రణాళిక వేసుకుంటున్నప్పుడు... ప్రయాణానికి స్కూటీని ఎంచుకోవాలనుకున్నాను. ఎందుకంటే మన దేశంలో అమ్మాయిలు ఎక్కువగా ఉపయోగించేది స్కూటీనే. నేను దానిమీద వేల కిలోమీటర్లు ఒంటరిగా ప్రయాణిస్తే... వారు నాతో తొందరగా కనెక్ట్ అవుతారని అనుకున్నాను. అదే నిజమైంది. ప్రయాణానికి ముందు... అవసరమైన పత్రాలన్నిటినీ సిద్ధం చేసుకున్నాను. ఎక్కడైనా వాహనం ఆగిపోతే ఇబ్బంది పడకుండా...మరమ్మతు ఎలా చేయాలో నేర్చుకున్నాను.
తొలి మహిళగా...
ఈ ఏడాది మే 18న... గువహటిలో ప్రారంభించిన నా యాత్ర... జమ్మూ కాశ్మీర్ మీదుగా... 22 రాష్ట్రాల్లో, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో, పొరుగు దేశమైన నేపాల్‌లో కొనసాగింది. 27 రోజుల తరువాత కన్యాకుమారిలో ముగిసింది. మొత్తం 7,234 కిలోమీటర్ల దూరం ప్రయాణించాను. నాలుగు రాష్ట్రాల గవర్నర్ల నుంచి, నేపాల్ ప్రభుత్వం నుంచి సత్కారాలు అందుకున్నాను. గువాహటి నుంచి జమ్ముకశ్మీర్, కన్యా కుమారి వరకూ... గరిష్ట దూరం స్కూటీ మీద ఒంటరిగా పర్యటించిన ఈశాన్య రాష్ట్రాలకు చెందిన తొలి మహిళగా... ‘ఇండియన్ బుక్ ఆఫ్‌ది రికార్ట్స్’లో నాకు చోటు లభించింది. ఏదైనా గ్రామంలో ఆగినప్పుడు... అమ్మాయిలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతోపాటు మహిళా సాధికారత గురించి, ఆడపిల్లల భద్రతలో ఆత్మరక్షణ విద్యల ప్రాధాన్యం గురించి, వారు చదువుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించాను. ప్రతి అమ్మాయి కలలు కనాలి, వాటిని నెరవేర్చుకోవడానికి ముందుకు సాగాలి. ఇదే నా యాత్ర ద్వారా ఇవ్వాలనుకున్న సందేశం. నా ప్రయాణం కొందరిలో స్ఫూర్తి కలిగించినా నా ప్రయత్నం ఫలించినట్టే.’’
ఈ వార్తలు కూడా చదవండి...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
Updated Date - Oct 06 , 2025 | 05:35 AM