Anushka Jaiswal Farming: సాగు పథంలో జై త్ర యాత్ర
ABN, Publish Date - Aug 20 , 2025 | 01:33 AM
అనుష్కా జైస్వాల్... సగటు అమ్మాయిలకు భిన్నం... ఆలోచనల్లో... ఆచరణలో. చదువు అవ్వగానే ఉద్యోగాల వెంట పరిగెత్తలేదు. మంచి జీతంతో బడా కంపెనీల్లో స్థిరపడిపోయి... నలుగురిలో ఒకరిలా జీవితం గడపాలనీ అనుకోలేదు...
అభిరుచి
అనుష్కా జైస్వాల్... సగటు అమ్మాయిలకు భిన్నం... ఆలోచనల్లో... ఆచరణలో. చదువు అవ్వగానే ఉద్యోగాల వెంట పరిగెత్తలేదు. మంచి జీతంతో బడా కంపెనీల్లో స్థిరపడిపోయి... నలుగురిలో ఒకరిలా జీవితం గడపాలనీ అనుకోలేదు. ఎవ్వరూ ఊహించని విధంగా... వ్యవసాయాన్ని కెరీర్‌గా మలుచుకొని... అద్భుతాలు సృష్టిస్తున్నారు. రక్షిత సాగు చేపట్టి... విభిన్న పంటలు పండించి... ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తున్నారు. మరికొంతమంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ... వారిని సాధికారత వైపు నడిపిస్తున్న 28 ఏళ్ల అనుష్క కథ ఇది.
‘‘అది 2017. ఢిల్లీ నగరం... హిందూ కాలేజీలో ప్లేస్‌మెంట్స్ డ్రైవ్ జరుగుతోంది. దాని కోసం విద్యార్థులందరూ కొన్ని రోజులుగా తీవ్ర స్థాయిలో సన్నద్ధమవుతున్నారు. ఎలాగైనా మంచి కంపెనీలో ఉద్యోగం దక్కించుకోవాలన్న పట్టుదల వారిలో. ఒక పక్కన కూర్చొని అందరినీ గమనిస్తున్నాను. కానీ ఎందుకో నేను పెద్దగా ఆసక్తి చూపలేదు. నేను కోరుకున్నది ఇలా కూర్చొని చేసే రొటీన్ ఉద్యోగం కాదనే స్పష్టత ఉంది. మరి నా మనసు ఏం కోరుకొంటోంది? అప్పటికి అంతుపట్టలేదు. ఏదైతేనేం... క్యాంపస్ ఇంటర్వ్యూ వదిలేశాను. విశేషం ఏంటంటే... కాలేజీ ప్లేస్‌మెంట్ సెల్ అధ్యక్షురాలిని నేనే. ‘మంచి అవకాశం వదిలేసుకున్నావ’ని స్నేహితులు అన్నారు. కావచ్చేమో! అలాగని మనసుకు నచ్చని పని చేయలేను కదా! అందుకే ఎకనామిక్స్‌లో డిగ్రీ తీసుకొని హిందూ కాలేజీ నుంచి బయటకు వచ్చాను.
మిద్దె తోటతో మొదలైంది...
డిగ్రీ తరువాత ఫ్రెంచ్ భాష నేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఢిల్లీలోని ‘సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ’లో చేరాను. కొన్నాళ్లు తరగతులకు వెళ్లాను. అదీ నచ్చలేదు. ఏంచేయాలో తోచక మా స్వస్థలం... ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూకు వచ్చేశాను. ఖాళీగా ఉండడంతో మా మేడ మీద పూలు, టమాటా తదితర కూరగాయల మొక్కలు వేశాను. సరదాగా మొదలైన వ్యాపకం... ఇష్టంగా మారిపోయింది. విత్తు వేయడం, మొక్క పెరగడం, ప్రతిఫలం చేతికి రావడం... ఒక బిడ్డకు జన్మనిచ్చి, పెంచిన అనుభూతి కలిగింది. మనసుకు ఎంతో ఆహ్లాదంగా, ఆనందంగా అనిపించింది. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను... ఇకపై నా కెరీర్ వ్యవసాయంలోనే అని. విషయం మా అన్నయ్యకు చెబితే... తను మరింత ప్రోత్సహించాడు. అలా నా ఆలోచన మిద్దె తోట నుంచి వ్యవసాయం వైపు మళ్లింది.
అధ్యయనం తరువాత...
అన్నయ్య అండతో వ్యవసాయం చేయాలని అనుకున్నాను. కానీ నాకు దాని గురించి ఓనమాలు తెలియవు. మాది రైతు కుటుంబం కాదు. అందుకే నోయిడాలోని ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ టెక్నాలజీ’లో చేరాను. దాంతోపాటు పూర్తి స్థాయి అవగాహన కోసం మరికొన్ని అనుబంధ కోర్సులు చదివాను. అంతర్జాలంలో విస్తృతంగా అధ్యయనం చేశాను. ఈ క్రమంలోనే రక్షిత సాగుపై ఆసక్తి కలిగింది. అలా 2020లో ఒక ఎకరం పొలం తీసుకొని పాలీహౌస్ ఏర్పాటు చేశాను. మొదట ఇంగ్లీష్ కీరదోస పండించాను. తరువాత వివిధ రకాల క్యాప్సికమ్ వేశాను. సాధారణ రైతుల కంటే రెట్టింపు ఉత్పత్తి సాధించాను. నాలుగేళ్లలో నా పేరు లఖ్‌నవూతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని వారికి కూడా పరిచయమైంది.
విభిన్న పంటలు...
ఆశించిన దానికంటే అధిక ఉత్పత్తి రావడంతో మరో ఐదు ఎకరాల భూమి తీసుకున్నాను. అందులో క్యాప్సికమ్, కీరాతో పాటు చైనా క్యాబేజీ, పాలకూర లాంటివి సాగు చేస్తున్నాను. వచ్చిన ఉత్పత్తిని ‘బ్లింకిట్, బిగ్ బాస్కెట్’ తదితర ఆన్‌లైన్ స్టోర్స్‌లకు విక్రయిస్తున్నాను. కొంత దిగుబడిని లులూ మాల్ తరహా సూపర్ మార్కెట్‌లకు విక్రయిస్తున్నాను. ఈ ప్రయాణంలో నాకు అర్థమైంది ఏంటంటే... భవిష్యత్ రక్షిత సాగుదే. ముఖ్యంగా చిన్నతరహా రైతులకు ఎంతో ప్రయోజనకరం. తక్కువ నీటి వినియోగంతోపాటు వాతావరణ మార్పులకు తట్టుకొని నిలబడగలదు. నిదానంగా పుట్టగొడుగుల సాగు కూడా మొదలుపెట్టాను. రక్షిత సాగువల్ల రైతుకు శ్రమ తగ్గుతుంది. వరదలు, తుపానులకు పంట కొట్టుకుపోకుండా నికర రాబడి లభిస్తుంది. ఎరువులు లేకుండా సేంద్రియ పద్ధతిలో పండించడంవల్ల మంచి మార్కెట్ ఉంటుంది.
సందేహించినవారే...
ప్రస్తుతం ఏడాదికి 210 టన్నుల క్యాప్సికమ్ పండిస్తున్నాను. టర్నోవర్ కోటి రూపాయలు దాటింది. ముప్ఫై మంది నాతో కలిసి పని చేస్తున్నారు. వారిలో అత్యధికం మహిళలే. నేను నేర్చుకున్నది ఆసక్తి గల మహిళలు అందరికీ నేర్పిస్తున్నా. తద్వారా మరికొంతమంది ఆడపిల్లలు, మిద్దె తోట పెంచుతున్నవారు... వ్యవసాయాన్ని కెరీర్‌గా ఎంచుకొనే అవకాశం కలుగుతుంది. ఈ మధ్యనే రకరకాల పూలు, పండ్ల మొక్కలతో నర్సరీ ఏర్పాటు చేశాను. మొదట్లో నేను వ్యవసాయం చేస్తానంటే... ‘ఆడపిల్లవు... నీవల్ల ఏమవుతుంది’ అన్నవారు ఉన్నారు. మా ప్రాంతంలో సాగు అంటే మగవారే. అలాంటిచోట నేను పొలంలోకి దిగి, ప్రయోగాత్మక విధానాలతో ఎరువులు లేకుండా అధిక దిగుబడి సాధిస్తున్నాను. ఒక మహిళగా ఇది నేను సాధించిన విజయం. అందుకు గర్వపడుతున్నా.’’
మొదట్లో నేను వ్యవసాయం చేస్తానంటే... ‘ఆడపిల్లవు... నీవల్ల ఏమవుతుంది’ అన్నవారు ఉన్నారు. మా ప్రాంతంలో సాగు అంటే మగవారే. అలాంటిచోట నేను పొలంలోకి దిగి, ప్రయోగాత్మక విధానాలతో ఎరువులు లేకుండా అధిక దిగుబడి సాధిస్తున్నాను. ఒక మహిళగా ఇది నేను సాధించిన విజయం. అందుకు గర్వపడుతున్నా.’’
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీకి బిగ్ షాక్... కీలక నేతపై కేసు
నన్ను చంపేందుకు వైసీపీ నేత ప్లాన్ చేశారు: కావ్యా కృష్ణారెడ్డి
Read Latest AP News and National News
Updated Date - Aug 20 , 2025 | 01:33 AM