AI Banana Saree Trend: బనానా శారీతో భద్రం సుమా
ABN, Publish Date - Sep 25 , 2025 | 02:22 AM
గూగుల్ జెమిని రూపొందించిన ‘నానో బనానా ఏఐ టూల్’ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఫొటోలు అప్‌లోడ్ చేసి క్షణాల్లో 3డి ఇమేజ్‌లా మార్చేసుకుని ఇన్‌స్టా, ఫేస్‌బుక్, వాట్స్‌పల్లో షేర్ చేసుకుంటూ మురిసిపోతోంది యువత...
‘బనానా శారీ’తో భద్రం సుమా...
గూగుల్ జెమిని రూపొందించిన ‘నానో బనానా ఏఐ టూల్’ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఫొటోలు అప్‌లోడ్ చేసి క్షణాల్లో 3డి ఇమేజ్‌లా మార్చేసుకుని ఇన్‌స్టా, ఫేస్‌బుక్, వాట్స్‌పల్లో షేర్ చేసుకుంటూ మురిసిపోతోంది యువత. ఇదిలా ఉంటే ఓ యువతికి ఎదురైన అనుభవం మాత్రం భయాందోళనలను కలిగించేలా ఉంది. కంటికి కనిపించకుండా గోప్యంగా ఉంచిన పుట్టుమచ్చను సైతం ఏఐ గుర్తించి ఫొటోలో చూపించిందని ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.
ఏంటీ శారీ ట్రెండ్..?
ఫ చీరలంటే ఇష్టపడని ఆడవాళ్లు ఉండరు. అందులోనూ చీరకట్టులో ఫొటో అంటే ఎగిరి గంతేస్తారు. అందుకే ఈ నానో బనానా ఏఐ శారీ ట్రెండ్ అంతలా పాపులర్ అయింది. ముందుగా ఏదైనా ఫొటోను అప్‌లోడ్ చేసి చీరకట్టులో ఎలా ఉండాలని అనుకుంటున్నారో దానికి తగ్గట్టు ప్రాంప్ట్ ఇస్తే చాలు. క్షణాల్లో కోరుకున్న ఫొటో కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. చీర రకం, చీర కట్టు, రంగు, బోర్డర్, పోల్కా డాట్స్, వింటేజ్ లుక్, రెట్రో స్టయిల్, అలనాటి నటీమణుల స్టయిల్, లాంగ్ హెయిర్, కర్లీ హెయిర్ లాంటివాటిని ప్రాంప్ట్‌లో వివరంగా చేరిస్తే చాలు చక్కగా ఫొటో వచ్చేస్తుంది. వానలో తడుస్తున్నట్లు, గొడుగు లేదా పూల సజ్జ పట్టుకున్నట్లు, గాల్లో చీర కొంగు ఎగురుతున్నట్లు ఉన్న మోడల్స్ యువతులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ఇలా ఏఐ తీసిన ఫొటోల్లో ఎంత అందంగా ఉన్నారో చూసుకుంటూ ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ల్లో షేర్ చేస్తూ మురిసిపోతున్నారు అమ్మాయిలు.
జెమినికి ఎలా తెలుసు..?
ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతున్న నానో బనానా శారీ ట్రెండ్‌ను చూసి తను కూడా ప్రయత్నించాలనుకుంది ఓ ఇన్‌ఫ్లుయెన్సర్. గూగుల్ జెమినిలోని ఫ్లాష్ 2.0 ఇమేజ్ మోడల్ సహాయంతో శారీ ఇమేజ్ పొందాలనుకున్నారు. అందులో భాగంగా ఫుల్ హ్యాండ్స్ ఉన్న చుడీదార్‌తోపాటు దుపట్టా వేసుకున్న ఫొటోను అప్‌లోడ్ చేశారు. ఆపై బ్లాక్ శారీ లుక్‌లో ఫొటో కావాలని ప్రాంప్ట్ ఇచ్చారు. వెంటనే నల్లచీర కట్టుకున్నట్లుగా ఓ స్టయిలిష్ ఫొటో ప్రత్యక్షమైంది. ఫొటో అందంగా వచ్చిందని ఆమె సంతోషించింది. అంతలోనే తన ఎడమ చేతిపై ఉన్న పుట్టుమచ్చ స్పష్టంగా కనిపిస్తుండడంతో ఒక్క నిమిషం భయం వేసిందని ఇన్‌స్టాలో చెప్పుకొచ్చారు ఆమె. ‘వాస్తవానికి నా ఎడమ భుజం మీద పుట్టుమచ్చ ఉంది. నేను అప్‌లోడ్ చేసిన ఫొటోలో అది కనిపించడం లేదు. అయినా ఏఐ ఇమేజ్‌లోకి ఎలా వచ్చింది? నా పుట్టుమచ్చ గురించి జెమినికి ఎలా తెలుసు? ఏదేమైనా సామాజిక మాధ్యమాలు, ఏఐ వేదికల్లో ఫొటోలు అప్‌లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి’ అంటూ ఆమె పోస్ట్ చేసిన వీడియో అందరినీ ఆలోచింపజేస్తోంది.
ఏ జాగ్రత్తలు
తీసుకోవాలంటే...
కొత్త ట్రెండ్స్ వచ్చినప్పుడు ఇష్టానుసారం ఫొటోలను అప్‌లోడ్ చేయడం, షేర్ చేయడం రెండూ మంచి పద్ధతులు కావు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం మరిచిపోకూడదు. లేదంటే ఫొటోలే కాదు వ్యక్తిగత సమాచారం, సోషల్ మీడియా ఖాతా కూడా దుర్వినియోగం కావచ్చు.
అప్‌లోడ్ చేసేముందు ఫొటోల మీద పేరు, ఊరు, ఫోన్ నెంబరు లాంటివి ఏవైనా ఉన్నాయేమో పరిశీలించుకోవాలి. ఫొటోల వెనక కూడా ఏమీ లేకుండా చూసుకోవాలి. ఎలాంటి సమాచారం ఉన్నా దాన్ని తొలగించాకే ఫొటోను అప్‌లోడ్ చేయడం మంచిది.
సామాజిక మాధ్యమాల్లో తప్పనిసరిగా ప్రైవసీ సెట్టింగ్స్ పెట్టుకోవాలి. ఫొటోలు, ఇతర సమాచారాన్ని అందరికీ కాకుండా కావాల్సినవాళ్లకు మాత్రమే కనిపించేలా ఏర్పాట్లు చేసుకోవాలి.
ఏఐ తీసిచ్చిన ఫొటోలను షేర్ చేసేముందు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. వీటిని వెరిఫై చేయడానికి నమ్మకమైన టూల్స్‌ని మాత్రమే ఉపయోగించాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్
అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు
For More AP News And Telugu News
Updated Date - Sep 25 , 2025 | 03:03 AM