ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Brain Tumor Surgery: మెదడు కణుతులకు సమర్థ సర్జరీలు

ABN, Publish Date - Aug 26 , 2025 | 01:04 AM

మెదడులో కణుతులకు వయసుతో సంబంధం లేదు. అవి క్యాన్సర్‌ కణుతులు కావచ్చు, కాకపోవచ్చు. అవి ఏ కోవకు చెందినవైనా వాటిని తొలగించే అత్యాధునిక సర్జరీలు ఇప్పుడు అందుబాటులోకొచ్చాయి. మెదడులో...

బ్రెయిన్‌ ట్యూమర్‌

మెదడులో కణుతులకు వయసుతో సంబంధం లేదు. అవి క్యాన్సర్‌ కణుతులు కావచ్చు, కాకపోవచ్చు. అవి ఏ కోవకు చెందినవైనా వాటిని తొలగించే అత్యాధునిక సర్జరీలు ఇప్పుడు అందుబాటులోకొచ్చాయి. మెదడులో క్యాన్సర్‌ కణుతులు, వాటి చికిత్సల గురించి వైద్యులేమంటున్నారో తెలుసుకుందాం!

40 ఏళ్ల లోపు వారిలో తలెత్తే మెదడు క్యాన్సర్లు, శరీరంలో వేరొక చోటు నుంచి అక్కడకు వ్యాపిస్తాయి. 40 ఏళ్లు పైబడిన వారిలో నేరుగా మెదడుకే సోకుతాయి. అయితే ఈ క్యాన్సర్‌ ఫలానా వయసు వారికే వస్తుందని కచ్చితంగా చెప్పడానికి కూడా వీల్లేదు. ఇది ఎవరికైనా రావచ్చు. న్యూరోఫైబర్‌ మెటోసిస్‌ టైప్‌2 కోవకు చెందిన వారికి క్యాన్సర్‌ రహిత గడ్డలు మెదడుతో సహా శరీరంలో ఎక్కడైనా రావచ్చు. వీటిలో క్యాన్సర్‌ గడ్డలు కూడా ఉండొచ్చు. మెదడులో క్యాన్సర్‌ ప్రధానంగా, పలు రకాల లక్షణాలతో బయల్పడుతూ ఉంటుంది. అవేంటంటే...

  • తలనొప్పి, వాంతులు

  • కంటిచూపు సమస్యలు

  • మాటలు తడబడడం, మాట్లాడడంతో ఇబ్బందులు

  • శరీరం తూలడం

  • కాళ్లూ, చేతుల్లో బలహీనత

  • ప్రవర్తనా సమస్యలు (దురుసుగా ఉన్నవారు మందకొడిగా మారడం, మందకొడిగా ఉన్నవారు దురుసుగా ప్రవర్తించడం). సాధారణంగా మెదడు కణుతులతో తలెత్తే ప్రవర్తనా మార్పులను మానసిక సమస్యలుగా పొరబడుతూ ఉంటారు. కానీ తలనొప్పి, వాంతులతో పాటు ప్రవర్తనలో స్పష్టమైన మార్పులు కనిపించినప్పుడు, తప్పనిసరిగా న్యూరాలజిస్టులను సంప్రతించాలి.

నిర్థారణ పరీక్షలు ఇవే!

మెదడులోని కణుతుల గురించి స్పష్టమైన అవగాహన కోసం మెదడు ఎమ్మారై విత్‌ కాంట్రాస్ట్‌ పరీక్ష చేయవలసి ఉంటుంది. అలాగే ఈ పరీక్షతో కణితి ఉన్న ప్రదేశం నిర్థారించుకున్న తర్వాత, జనరల్‌ అనస్థీషియా ఇచ్చి సర్జరీ చేయాలా? లేదంటే అవేక్‌ సర్జరీ చేయొచ్చా? అన్నది వైద్యులు నిర్థారిస్తారు. కణితి ఇంద్రియాలను నియంత్రించే మెదడులోని ప్రదేశాలకు దూరంగా ఉన్నప్పుడు జనరల్‌ ఎనస్థీషియాతో సర్జరీ చేయవచ్చు. బదులుగా కణితి ఇంద్రియాలతో అనుసంధానమై ఉన్న ప్రదేశాలకు దగ్గరగా ఉన్నప్పుడు, పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఉండడం కోసం రోగిని మెలకువగా ఉంచి చేసే సర్జరీని వైద్యులు ఎంచుకోవలసి వస్తుంది.

అవేక్‌ సర్జరీ అంటే?

మెదడులో ‘ఎలోక్వెంట్‌ కార్టెక్స్‌’ అనే ప్రదేశం ఉంటుంది. ఈ ప్రదేశం శరీర కదలికలు, ఇంద్రియాలు, చూపు, వినికిడి, భాష, జ్ఞాపకశక్తులకు సంబంధించినది. ఈ ప్రదేశంలో ఏర్పడే కణుతులతో సంబంధిత అవయవాలు, ఇంద్రియాల్లో సమస్యలు తలెత్తినప్పుడు, ఆ ప్రాంతం దెబ్బతినకుండా కణితిని సమూలంగా తొలగించడం కోసం వైద్యులు అవేక్‌ సర్జరీని ఎంచుకుంటారు. మెదడు కణితి వల్ల మాట్లాడడంలో సమస్య ఉన్నప్పుడు, సర్జరీ చేసే సమయంలో సదరు రోగికి కొన్ని చిత్రాలు చూపిస్తూ, మాట్లాడిస్తూ, మెదడులోని సంబంధిత ప్రదేశం దెబ్బతినకుండా సురక్షితంగా కణితిని తొలగిస్తారు. బదులుగా జనరల్‌ అనస్థీషియాలో ఇదే సర్జరీ చేసినప్పుడు, కణితిని సమూలంగా తొలగించే వీలుండకపోవచ్చు. అలాగే స్పీచ్‌తో అనుసంధానమై ఉన్న మెదడు ప్రదేశం దెబ్బతినే ప్రమాదం కూడా ఉండొచ్చు. కాబట్టి అవేక్‌ సర్జరీని ఎంచుకోవడం ద్వారా సదరు ప్రదేశానికి బదులుగా దాని పక్క నుంచి నేరుగా కణితిని చేరుకుని, పూర్తిగా తొలగించగలిగే వీలుంటుంది. కంటిచూపు, అవయవాలు, వినికిడికి సంబంధించిన మెదడులోని క్యాన్సర్‌ కణుతులన్నిటికీ వైద్యులు అవేక్‌ సర్జరీనే ఎంచుకుంటారు. ఇంద్రియాలతో అనుసంధానమై ఉన్న మెదడు ప్రదేశాలకు బదులుగా ఇతర ప్రదేశాల్లో కణుతులు ఉన్నప్పుడు పూర్తిగా మత్తిచ్చి చేసే సర్జరీని వైద్యులు ఎంచుకుంటారు.

అత్యాధునిక సాంకేతికతలతో...

మెదడు సర్జరీ అనగానే విపరీతంగా భయపడిపోయే వాళ్లే ఎక్కువ. కానీ నేడు మెదడు సర్జరీలపరంగా అత్యంత సురక్షితమైన, ప్రభావవంతమైన సాంకేతికతలు అందుబాటులోకొచ్చాయి.

ఎమ్మారై: సర్జరీకి ముందు చేసే ఎమ్మారైలోనే కణితి కచ్చితమైన ప్రదేశం తెలుస్తుంది

న్యూరో నావిగేషన్‌: ఇది వైద్యులకు జిపిఎ్‌సలా సహాయపడుతుంది. దీని సహాయంతో సర్జరీ సమయంలో వైద్యులు క్యాన్సర్‌ కణితిని సూటిగా చేరుకోగలుగుతారు. సర్జరీ తదనంతరం కణితిని పూర్తిగా తొలగించినట్టు నిర్థారించుకోవడం కూడా వైద్యులు న్యూరో నావిగేషన్‌ మీదే ఆధారపడతారు.

ఇంట్రా ఆపరేటివ్‌ మానిటరింగ్‌: సర్జరీ సమయంలో మెదడుతో పాటు దాన్లోని క్రియలన్నీ సక్రమంగా పని చేస్తున్నట్టు నిర్థారించుకోడానికి ఇంట్రా ఆపరేటివ్‌ మానిటరింగ్‌ తోడ్పడుతుంది

హై ఎండ్‌ మైక్రోస్కోప్‌: సూక్ష్మ రక్తనాళాలను కనిపెట్టి, రక్తస్రావాన్ని నివారించడం కోసం ఇది సహాయపడుతుంది

అల్ర్టాసోనిక్‌ ఆస్పిరేటర్‌: మెదడులోని క్యాన్సర్‌ గడ్డను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి, బయటకు లాగే పరికరం ఇది కీమో థెరపీ, రేడియేషన్‌ సర్జరీతో మెదడులోని క్యాన్సర్‌ గడ్డను తొలగించిన తర్వాత, ఆ క్యాన్సర్‌ దశ ఆధారంగా వైద్యులు కీమోథెరపీ, రేడియేషన్‌ కాలాన్ని నిర్ణయిస్తారు. మెదడు క్యాన్సర్‌ చికిత్సలో వైద్యులు రేడియేషన్‌ థెరపీతో పాటు మాత్రలు కూడా ఇస్తారు. మాత్ర ఇచ్చిన 40 నిమిషాల తర్వాత అందించే రేడియేషన్‌తో ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

రోబోట్‌ అసిస్టెడ్‌ సర్జరీ

మెదడులోని అన్ని కణుతులనూ సర్జరీతో తొలగించే వీలుండకపోవచ్చు. దగ్గరకు చేరుకోలేనంత లోతుగా కణితి ఏర్పడినప్పుడు వైద్యులు రోబోట్‌ అసిస్టెడ్‌ సర్జరీ సహాయంతో కణితిలోని చిన్న ముక్కను బయటకు తీసి, దాని దశను తెలుసుకుని రేడియేషన్‌, కీమోథెరపీ సూచిస్తూ ఉంటారు. అలాగే మెదడులో లోతుగా ఉన్న కణితిని సమూలంగా తొలగించానికి కూడా ఇదే సర్జరీ తోడ్పడుతుంది.

అది అపోహ మాత్రమే!

మెదడు సర్జరీతో చేతులు, కాళ్లు చచ్చుబడితాయన్నది అపోహ మాత్రమే! నేడు అందుబాటులో ఉన్న సాంకేతికతలను సమర్థంగా వినియోగించుకోగలిగితే, 98ు మంది రోగులు ఎటువంటి దుష్ప్రభావాలూ లేకుండా పూర్తిగా కోలుకుంటారు. అలాగే మెదడు సర్జరీతో తలెత్తే దుష్ప్రభావాలు కూడా క్రమేపీ తొలగిపోతాయి. మెదడు ఎడమ వైపు ఉన్న కణితికి సర్జరీ చేసినప్పుడు, శరీరంలో కుడివైపు అవయవాల్లో కొంత బలహీనత కనిపించవచ్చు. కుడివైపు సర్జరీ తర్వాత ఎడమ వైపు అవయవాలు బలహీన పడవచ్చు. అయితే ఈ బలహీనత కూడా తాత్కాలికమే! సర్జరీ తదనంతర ఫిజియోథెరపీతో ఈ సమస్యలన్నీ సర్దుకుంటాయి. కేవలం 2 నుంచి 3ు రోగులకు మాత్రమే శాశ్వత లోపాలు తలెత్తుతాయి.

డాక్టర్‌ ఆర్‌. అయ్యాదురై,

సీనియర్‌ రోబోటిక్‌ న్యూరోసర్జన్‌,

యశోద హాస్పిటల్స్‌,

సికింద్రాబాద్‌.

Also Read:

గుండె జబ్బులకు దారితీసే మూడు కారణాలు ఇవే..

కోహ్లీ బ్యాట్ వల్ల నాకు బ్యాడ్ నేమ్..

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 26 , 2025 | 01:04 AM