Heart Health Tips: బీ కేర్ ఫుల్.. గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లు ఇవే..
ABN , Publish Date - Aug 25 , 2025 | 06:19 PM
ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులు మరణాలకు ప్రధాన కారణంగా మారాయి. అయితే, గుండె సమస్యలకు దారితీసే మూడు ముఖ్యమైన ప్రమాద కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: గతంలో వయస్సు పెరుగుతున్న కొద్దీ గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుండేది. కానీ, ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరికి ఎప్పుడు గుండె సమస్య వస్తుందో చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. గుండె జబ్బులు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. అనారోగ్యకర జీవనశైలి, అనారోగ్యకర ఆహారం, అధిక స్థాయిలో ఒత్తిడి ఉండడం రక్తపోటు పెరగడానికి, గుండెపై ఒత్తిడి పెరగడానికి కారణమవుతాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులు మరణాలకు ప్రధాన కారణంగా మారాయి. దాదాపు 17.9 మిలియన్ల మంది మరణిస్తున్నారు. అయితే, గుండె సమస్యలకు దారితీసే మూడు ముఖ్యమైన ప్రమాద కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఊబకాయం
ఊబకాయం గుండె జబ్బులకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అధిక బరువు ఉండటం వల్ల అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తగిన ఆహారం తీసుకోకపోవడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్, అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు వస్తాయి. ఇవి రక్తనాళాలను దెబ్బతీసి, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. దాంతో గుండెపై అదనపు ఒత్తిడి పడుతుంది. 2024లోని ఒక అధ్యయనం ప్రకారం, 1999 నుంచి 2020 వరకు అమెరికాలో ఊబకాయం కారణంగా గుండె జబ్బులతో మరణాలు 180% పెరిగాయి. అందుకే బరువును నియంత్రించడం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం.
అనారోగ్యకర జీవనశైలి
కూర్చునే జీవనశైలి కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఎక్కువసేపు కూర్చోవడం రక్తపోటు, కొలెస్ట్రాల్, బరువు నియంత్రణను కష్టతరం చేస్తుంది. 2024లో జరిగిన పరిశోధన ప్రకారం, రోజుకు 10 గంటలకంటే ఎక్కువసేపు కూర్చునే వాళ్లలో గుండె సమస్యలు, మరణాల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేసినా, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే హాని పూర్తిగా తగ్గదు. కాబట్టి రోజు మొత్తం కదులుతూ, శరీరాన్ని చురుకుగా ఉంచుకోవడం చాలా అవసరం.
ధూమపానం
గుండెకు అత్యంత ప్రమాదకరమైన అలవాటు ధూమపానం. ఇది ఊపిరితిత్తులను మాత్రమే కాదు, రక్తనాళాలను కూడా దెబ్బతీస్తుంది. 2021లో వచ్చిన ఒక అధ్యయనం ప్రకారం, ధూమపానం చేసే వాళ్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కంటే గుండె జబ్బుల వల్ల చనిపోయే అవకాశమే ఎక్కువ. చాలా మంది ధూమపానం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందని అనుకుంటారు, కానీ గుండెపోటు, స్ట్రోక్ వంటి హృదయ సమస్యలు ముందుగానే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని గ్రహించరు. కాబట్టి, ఊబకాయం తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ధూమపానం మానేసి శరీరాన్ని చురుకుగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read:
నిక్కీ భాటి హత్యలో షాకింగ్ నిజాలు.. కొడుకు కళ్ల ముందే..
ఏసీ గదుల్లో పడుకునే వారికి పీడకలలు ఎక్కువగా వస్తాయా?
ఫ్రిజ్ లేకపోయినా టమోటాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచే మేజిక్ ట్రిక్ ఇదే!