ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Healthy Diet Tips: ఇలా చేస్తే బరువు బలాదూర్‌

ABN, Publish Date - Sep 23 , 2025 | 05:09 AM

బరువు తగ్గడం కోసం సరైన ఆహారాన్ని ఎంచుకోవడమే కాదు, ఆ ఆహారాన్ని ఎక్కువ సార్లు నమిలి తినాలి. అలాగే ఆహార వేళలు, నిద్రవేళలు కూడా క్రమం తప్పకుండా పాటించగలిగితే, తక్కువ సమయంలో ఎక్కువ బరువును...

వెయిట్‌ లాస్‌

బరువు తగ్గడం కోసం సరైన ఆహారాన్ని ఎంచుకోవడమే కాదు, ఆ ఆహారాన్ని ఎక్కువ సార్లు నమిలి తినాలి. అలాగే ఆహార వేళలు, నిద్రవేళలు కూడా క్రమం తప్పకుండా పాటించగలిగితే, తక్కువ సమయంలో ఎక్కువ బరువును వదిలించుకోవడం కష్టమేమీ కాదని తాజాగా నటుడు మాధవన్‌ నిరూపించారు. మాధవన్‌ పాటించిన నియమాల్లో ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయో వైద్యులు వివరిస్తున్నారు.

ఉపవాసాలు, వ్యాయామాలు, ఆహార నియమాలు... ఇలా బరువు తగ్గడం కోసం అనేక ప్రయత్నాలు చేసి విసిగిపోయినవాళ్లు, అందుకు అడ్డుపడే ఇతరత్రా అంశాల మీద కూడా దృష్టి పెట్టాలి. బరువు తగ్గకపోగా, కడుపుబ్బరం, అజీర్తి లాంటివి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఫుడ్‌ ఇన్‌టాలరెన్స్‌, ఫుడ్‌ అలర్జీలను కూడా పరీక్షించుకోవాలి. అలాగే కొన్ని పదార్థాలు శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచుతాయి. వీటిలో అత్యధిక చక్కెరను కలిగి ఉండే పదార్థాలు ప్రధానమైనవి. వీటితో కీళ్ల వాపులు, మలబద్ధకం, పొట్టలో వాయువులు, నొప్పులు వేధిస్తాయి. అలాగే ఇన్‌ఫ్లమేషన్‌ బరువు తగ్గే ప్రయత్నాలకు అడ్డుపడుతూ ఉంటుంది. కాబట్టి ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉండే రంగురంగుల పండ్లు, కూరగాయలు, నట్స్‌, సీడ్స్‌ తినాలి. వీటితో ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గి, బరువు తగ్గే ప్రక్రియ ఊపందుకుంటుంది. అలాగే ఇన్‌ఫ్లమేషన్‌ను ప్రోత్సహించే ఫాస్ట్‌ ఫుడ్స్‌, నూనెలో వేయించిన పదార్థాలు, తీయని పానీయాలు తీసుకోవడం మానేయాలి.


రాత్రి భోజనం సాయంత్రమే...

రాత్రి తినే భోజనానికీ ఉదయం తీసుకునే అల్పాహారానికీ మధ్య కనీసం 12 గంటల నిడివి ఉండాలి. కానీ రాత్రి ఆలస్యంగా 12 గంటలకు తిని, ఉదయాన్నే 8 గంటలకే బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకున్నప్పుడు జీర్ణ వ్యవస్థకు సరిపడా విశ్రాంతి అందదు. అలాగే సాయంత్రానికి మన మనసు, శరీరం, అంతర్గత అవయవాలన్నీ విశ్రాంత స్థితిలోకి చేరుకోవడం మొదలుపెడతాయి. కాబట్టి సాయంత్రం వీలైనంత పెందలాడే భోజనం ముగించేయడం మంచిది. ఈ అలవాటును అలవరుచుకోవడం వల్ల తిన్న ఆహారం పూర్తిగా జీర్ణమయ్యే సమయం చిక్కుతుంది.

మూడు భోజనాలు తినొచ్చు

కొంతమంది రోజుకు రెండు భోజనాలు, ఒక భోజనానికే పరిమితమైపోతూ ఉంటారు. కానీ నిజానికి రోజుకు మూడుసార్లు లేదా సాయంత్రం ఐదు గంటలకు ఒక స్నాక్‌తో కలిపి నాలుగు సార్లు తింటూ కూడా బరువు తగ్గొచ్చు. అయితే తిన్న ప్రతిసారీ ఏం తింటున్నామన్నది గమనించుకోవాలి. రోజుకు సరిపడా క్యాలరీలను అందించే ఆహారాన్ని మూడు, నాలుగు భాగాలుగా విభజించుకుని తినడం వల్ల బరువు పెరిగే సమస్య ఉండదు. అదనపు క్యాలరీలు అందించే ఆహారంతోనే అసలు సమస్యంతా! కాబట్టి ఒంటిపూట భోజనంతో, లేదా రెండు పూటల భోజనంతో అవసరానికి మించి ఎక్కువ క్యాలరీలు తీసుకోడానికి బదులుగా మూడు భోజనాలతో తక్కువ క్యాలరీలు పొందుతూ బరువును తగ్గించుకోవచ్చు. అలాగే ఆహారంలోని క్యాలరీలతో పాటు అందే ప్రొటీన్‌ పరిమాణం మీద కూడా దృష్టి పెట్టాలి. భోజనంలో ప్రొటీన్‌ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

నిద్ర.. నీళ్లు

రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రపోయినా, సరిపడా నిద్రపోకపోయినా శరీరానికి కోలుకునే సమయం దక్కదు. దాంతో భౌతిక ఒత్తిడి పెరుగుతుంది. ఆలస్యంగా నిద్రపోయేవాళ్లు రాత్రి భోజనం తర్వాత కూడా చిరుతిళ్లు తినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ విధంగా అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరుకుని బరువు పెరుగుతారు. అలాగే తిన్నది పూర్తిగా జీర్ణమవడానికి సరిపడా నీళ్లు అవసరం. కాబట్టి రోజుకు కనీసం రెండు నుంచి రెండున్నర లీటర్ల నీళ్లు తీసుకోవాలి.

ఆహారం నమిలి తినాలి

ఆహారాన్ని హడాహుడిగా, ఆదరాబాదరాగా తినేయడం సరికాదు. చక్కగా నమిలి తినడం వల్ల, తినే వేగం తగ్గి, తక్కువ ఆహారం తినగలుగుతాం. అలాగే ఆహారం తింటున్న సంకేతాలు మెదడుకు అంది తక్కువ ఆహారంతోనే సంతృప్తి చెందగలుగుతాం! ఆహారాన్ని చక్కగా నమిలి తినడం వల్ల, జీర్ణాశయానికి శ్రమ తగ్గుతుంది. పోషక శోషణ పెరుగుతుంది.

వ్యాయామం ఇలా...

కండరాలు క్యాలరీలను చక్కగా ఉపయోగించుకోవాలంటే, కండరాలను పెంచే రెసిస్టెన్స్‌ వ్యాయామాలు చేయాలి. ప్రత్యేకించి బరువు తగ్గాలనుకునేవాళ్లు గుండె వేగాన్ని పెంచే వ్యాయామాలతో పాటు కండరాలు పెరిగే వ్యాయామాలు చేయడం తప్పనిసరి.

ఆరోగ్య సూత్రాలు

నటుడు మాధవన్‌ అనుసరించిన ఆహార సూత్రాలను మనం కూడా అనుసరించవచ్చు. అందుకోసం పాటించవలసిన నియమాలు ఇవే!

  • తింటున్న ఆహారం మీద దృష్టి పెట్టాలి. తినేటప్పుడు ఫోన్లు, టివిలకూ, కబుర్లకూ దూరంగా ఉండాలి. ప్రతి ముద్దనూ ఎక్కువ సార్లు నమిలి తినాలి.

  • ఆహార వేళలు కచ్చితంగా పాటించాలి. రోజులో చివరి భోజనం వీలైనంత త్వరగా (సాయంత్రం 6-7 గంటలు) ముగించాలి.

  • ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ చేయొచ్చు. అందుకోసం ఎవరికి వారు వారి జీవనశైలిని బట్టి 12 నుంచి 14 గంటల రాత్రి ఉపవాసం పాటించాలి. మధుమేహులు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవాళ్లు ఉపవాసం విషయంలో వైద్యుల సలహా తీసుకోవాలి.

  • ఆహారంలో కూరగాయలు, పొట్టు తీయని ధాన్యాలు, ప్రొటీన్‌ పెంచి, పాలిష్‌ పట్టిన పదార్థాలు, చక్కెర, కొవ్వు పదార్థాలు తగ్గించాలి.

  • నడక, రెసిస్టెన్స్‌ ట్రైనింగ్‌, సరిపడా నిద్ర, నీళ్లు.. వీటి మీద దృష్టి పెట్టడంతో పాటు, నిద్రకు ముందు స్ర్కీన్‌ టైమ్‌ తగ్గించాలి. కంటినిండా నిద్రపోవాలి.

  • అలర్జీలు, ఇన్‌టాలరెన్స్‌లు ఎవరికి వారు గమనించుకోవాలి. కడుపుబ్బరం, అజీర్తి, అపానవాయువులు, దురదలు లాంటివి వేధిస్తూ ఉంటే వైద్యులను కలవాలి.

  • సాధారణంగా బరువు తగ్గడం కోసం, తీసుకుంటున్న క్యాలరీలు, ఖర్చవుతున్న క్యాలరీల మీదే దృష్టి పెడుతూ ఉంటాం. కానీ ఆహారాన్ని ఎలా నములుతున్నాం, ఎంత తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం, ఎంత నిద్రపోతున్నాం అన్నది కూడా ముఖ్యం. వీటిని ఎవరికి వారు పరిశీలించుకుని, వైద్యుల సూచనల మేరకు ఆహార, వ్యాయామ నియమాలను పాటించగలిగితే ఆరోగ్యకరమైన తీరులో అధిక బరువును వదిలించుకోవచ్చు.

అన్నం, రోటీలతో పొట్టను నింపేస్తే అవి త్వరగా జీర్ణమై తరచూ ఆకలి వేధిస్తుంది. కాబట్టి సంతృప్తితో పాటు సరిపడా పోషకాలను అందించే కూరగాయలు ఎక్కువగా, అన్నం, రోటీలు తక్కువగా తీసుకోవాలి. అందుకోసం భోజన పళ్లెంలో పావు వంతును మాత్రమే అన్నం లేదా రోటీతో నింపుకోవాలి. ఇంకొక పావు వంతు సలాడ్‌/కూరగాయలు, పావు వంతు ప్రొటీన్‌ (చికెన్‌/చేపలు/గుడ్లు/రాజ్మా, సెనగలు), పావు వంతు పప్పు, పెరుగుతో నింపేయాలి.

హరిత శ్యామ్‌ బి

హెచ్‌ఒడి ఆఫ్‌ డైటరీ,

అపోలో హాస్పిటల్స్‌,

జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌

ఈ వార్తలు కూడా చదవండి..

ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ

ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 23 , 2025 | 05:09 AM