NTTPS Pollution Issue: ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Sep 22 , 2025 | 11:58 AM
కూటమి ప్రభుత్వం వచ్చాక ప్లాంట్ నిర్వహణకు నిధులు కేటాయించారని ఎమ్మెల్యే వసంత వెల్లడించారు. ప్లాంట్ నుంచి కాలుష్యం పరిమితికిమించి విడుదల అవుతోందని.. విద్యుత్ ప్లాంట్ అమరావతికి కూడా అతి సమీపంలో ఉందని తెలిపారు.
అమరావతి, సెప్టెంబర్ 22: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సందర్భంగా విజయవాడ నార్ల తాతారావు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా కాలుష్యంపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (MLA Vasantha Krishna Prasad) ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Minister Gottipati Ravikumar) సమాధానమిచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కాల పరిమితి ముగిసినా ఇంకా కొనసాగిస్తున్నారన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో నిర్వహణకు కనీసం రూపాయి కూడా నిధులు ఇవ్వలేదని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక ప్లాంట్ నిర్వహణకు నిధులు కేటాయించారని వెల్లడించారు. ప్లాంట్ నుంచి కాలుష్యం పరిమితికిమించి విడుదల అవుతోందని.. విద్యుత్ ప్లాంట్ అమరావతికి కూడా అతి సమీపంలో ఉందని తెలిపారు. ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన వారికి ఉద్యోగాల సంగతి అంటుంచి.. రోగాలు వస్తున్నాయన్నారు. సీఎస్ఆర్ కింద సమీప గ్రామాల అభివృద్ధికి ఎలాంటి ఖర్చు చేయటం లేదని ఎమ్మెల్యే తెలిపారు. ప్లాంట్ నుంచి వచ్చే బూడిద లారీకి 50 రూపాయలకు కొని కాంట్రాక్టర్ లారీ రూ. 2 వేలకు అమ్ముతున్నారన్నారన్నారు. దీని వల్ల స్థానికులకు ఉపాధి లేకుండా పోయిందని చెప్పారు. కాంట్రాక్టర్లు ఇచ్చే రూ.2.5 కోట్లు తాను ఇస్తానని... బూడిద స్థానికులకు ఇవ్వాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కోరారు.
దీనిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానమిస్తూ.. వీటీపీఎస్ పరిధిలో ఏడు గ్రామాల్లో కాలుష్యం సమస్య ఉందన్నారు. ప్లాంట్ల ద్వారా వచ్చే కాలుష్యం స్థాయి తగ్గించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి నిభందనలు పాటిస్తామని అన్నారు. బూడిద తొలగింపు కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కాలుష్యం బారిన పడిన గ్రామాల్లో ప్రజలకు మొబైల్ వాహనం ద్వారా వైద్యం అందించే చర్యలు తీసుకుంటామని అన్నారు. బూడిద అమ్ముకునే అవకాశం స్థానికులకు ఇస్తామని.. ఉపాధి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. వాళ్ల ట్రక్కులకు బూడిద లోడ్ చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.
ఎన్టీటీపీఎస్ నుంచి వెలుబడుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. కాలుష్య నియంత్రణ మండలి సూచనల మేరకు ఎన్టీటీపీఎస్‌లో మరమత్తులు చేపడుతున్నామని తెలిపారు. పాండ్ యాష్ అక్రమ నిల్వ చేసి, తరలిస్తున్న కారణంగా స్థానికంగా కాలుష్యం జరిగేదని వెల్లడించారు. పీసీబీ సూచనల ప్రకారం బూడిద తరలింపుకు ప్రభుత్వం టెండరింగ్ ఏజెన్సీని నియమించిందని చెప్పారు. కాలుష్యానికి చెక్ పెట్టేందుకు కోల్డ్ స్టోరేజ్ షెడ్‌ను నిర్మిస్తున్నామన్నారు. కాలుష్య నియంత్రణ మండలి సూచనల మేర కాలుష్య నివారణకు రూ. 50 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.
ఎన్టీటీపీఎస్ కాలుష్య నివారణకు పునరుద్ధరణ, ఆధునికీకరణలో భాగంగా కొత్త పరికరాలను అమర్చడం కోసం రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. టెండరింగ్ ఎజెన్సీ ద్వారా స్థానికుల జీవనోపాధి దెబ్బతింటుందనేది అసత్య ప్రచారం మాత్రమే అని స్పష్టం చేశారు. ఎన్టీటీపీఎస్ చుట్టుపక్కల గ్రామాల ప్రజల జీవనోపాధి బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని పేర్కొన్నారు. స్థానిక ప్రజల త్యాగాలను విద్యుత్ శాఖ, జెన్కో ఎప్పటికీ మర్చిపోదన్నారు. బూడిద తరలింపుకు స్థానిక ప్రజల ట్రక్కులనే జెన్కో ఉపయోగిస్తుందని వెల్లడించారు. బూడిద తరలింపు కోసం లోడింగ్ ఉచితంగా చేయడంతో పాటు రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. బూడిద తరలింపు టెండర్‌పై స్థానికులు ఆందోళన చెందాల్సినవసరం లేదన్నారు.
స్థానికుల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకునే టెండర్‌ను అమలు చేస్తున్నామని తెలిపారు. స్థానికుల ప్రజల ఆరోగ్య సమస్యపై కూడా విద్యుత్ శాఖ దృష్టి సారించిందని మంత్రి చెప్పారు. విద్యుత్ ఉద్యోగులతో సమానంగా మెడికల్ ప్యాకేజ్‌ను అమలు చేస్తున్నామన్నారు. ఏపీ జెన్కో మొబైల్ మెడికల్ యూనిట్లతో పరిసర గ్రామాల్లో ప్రతీ గడపను చేరుకుంటుందని అన్నారు. స్థానిక గ్రామాల్లో ప్రజల ఆరోగ్య సమస్యలను తెలుసుకుని ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తున్నామన్నారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజల ఆరోగ్య రికార్డులను భద్రపరిచి స్పెషలిస్టు డాక్టర్లతో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నామని తెలిపారు. మొబైల్ మెడికల్ క్యాంపుల ద్వారా స్థానికంగా ప్రజలకు ఉచితంగా వైద్య సదుపాయం అందిస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ
Read Latest AP News And Telugu News