Vijayawada: ఇంద్రకీలాద్రికి దసరా శోభ
ABN , Publish Date - Sep 22 , 2025 | 07:31 AM
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి అమ్మవారికి స్నపనాది క్రతువు నిర్వహిస్తారు.
నేటి నుంచి శరన్నవరాత్రి మహోత్సవాలు
ఈఏడాది 20 లక్షలమంది భక్తులు వస్తారని అంచనా
29న దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు
విజయవాడ, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి అమ్మవారికి స్నపనాది క్రతువు నిర్వహిస్తారు. తొలిరోజు అమ్మవారు శ్రీబాలాత్రిపుర సుందరి అలంకారంలో దర్శనమిస్తారు. ఉదయం 8-8.30 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఈ ఏడాది దేశం నలుమూలల నుంచి ఉత్సవాలకు 20 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. ప్రొటోకాల్ జాబితాలో ఉన్న వీఐపీల కోసం స్లాట్ విధానాన్ని తీసుకొచ్చారు. ఉదయం 7-9, మధ్యాహ్నం 3-5 గంటల వరకు కల్పిస్తారు. ఈ ఏడాది భక్తుల కోసం 20 లక్షల లడ్డూలను సిద్ధం చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల కారణంగా ఇంద్రకీలాద్రి విద్యుత్ వెలుగుల్లో దేదీప్యమానంగా వెలుగుతోంది. 29వ తేదీ మూలానక్షత్రం రోజున అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. ఆరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపులు
శరన్నవరాత్రులు ముగిసే వరకు అమలు
విజయవాడ, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : ఇంద్రకీలాద్రిపై సోమవారం నుంచి ప్రారంభమయ్యే దసరా శరన్నవరాత్రి మహోత్సవాల కారణంగా పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే భారీ వాహనాలను దారి మళ్లిస్తున్నట్టు పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు తెలిపారు.
హైదరాబాద్-విజయవాడ-హైదరాబాద్-విశాఖపట్నం మార్గంలో రాకపోకలు సాగించే భారీ వాహనాలు నల్లకుంట వద్ద పశ్చిమ బైపాస్ ఎక్కి చిన్నఅవుటపల్లి వద్ద దిగి హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్లాలి. విశాఖ నుంచి వాహనాలు చిన్నఅవుటపల్లి వద్ద పశ్చిమ బైపాస్ ఎక్కి నల్లకుంట వద్ద దిగి హైదరాబాద్ మార్గంలోకి వెళ్లాలి.
హైదరాబాద్ - మచిలీపట్నం-హైదరాబాద్ మార్గంలో రాకపోకలు సాగించే వాహనాలు నల్లకుంట వద్ద పశ్చిమ బైపాస్ ఎక్కి చిన్న అవుటపల్లి వద్ద దిగాలి. కేసరపల్లి మీదుగా మచిలీపట్నం చేరుకోవాలి. ఇటు నుంచి వెళ్లే వాహనాలు కేసరపల్లి వద్ద నుంచి చిన్నఅవుటపల్లి వద్ద పశ్చిమ బైపాస్ ఎక్కాలి.
హైదరాబాద్-చెన్నై-హైదరాబాద్ మార్గంలో రాకపోకలు సాగించే వాహనాలు నార్కట్‌పల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, అద్దంకి, మేదరమెట్ల మీదుగా గుంటూరు చేరుకుని అక్కడి నుంచి చెన్నై వెళ్లాలి. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు కూడా ఇదే మార్గంలో ప్రయాణించాలి.
చెన్నై-విశాఖపట్నం-చెన్నై మార్గంలో రాకపోకలు సాగించే వాహనాలు ఒంగోలు, త్రోవగుంట, చీరాల, బాపట్ల, రేపల్లె, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ బైపాస్ మీదుగా వెళ్లాలి. విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాలు కూడా ఇదే మార్గంలో ప్రయాణించాలి.