AP Metro Rail Renders: ఏపీ మెట్రో రైలు టెండర్లపై కీలక నిర్ణయం..
ABN , Publish Date - Sep 22 , 2025 | 11:02 AM
ఈ నిర్ణయం వల్ల ఎక్కువ కంపెనీలు టెండర్లలో పాల్గొనే అవకాశం ఉంటుందని ఎండీ ఎన్పీ రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. పనులను చిన్న చిన్న ప్యాకేజీలుగా విభజించడం వల్ల ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో పాటు నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోతుందని తెలిపారు.
అమరావతి: విజయవాడ, విశాఖ మెట్రో రైల్ టెండర్లలో పాల్గొనేందుకు జాయింట్ వెంచర్స్‌కు అవకాశం ఇస్తున్నట్లు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ ఎన్పీ రామకృష్ణా రెడ్డి తెలిపారు. గరిష్టంగా 3 కంపెనీలు కలిసి జేవీగా టెండర్లు వేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రీ-బిడ్ మీటింగ్‌కు హాజరైన కాంట్రాక్ట్ సంస్థల నుంచి వచ్చిన వినతిపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన ఇవాళ(సోమవారం) మీడియాతో మాట్లాడారు..
ఈ నిర్ణయం వల్ల ఎక్కువ కంపెనీలు టెండర్లలో పాల్గొనే అవకాశం ఉంటుందని ఎండీ ఎన్పీ రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. పనులను చిన్న చిన్న ప్యాకేజీలుగా విభజించడం వల్ల ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో పాటు నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోతుందని తెలిపారు. ఇతర మెట్రో ప్రాజెక్ట్‌ల అధ్యయనం తర్వాత పనులను చిన్న ప్యాకేజిలుగా విభజించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.
రెండు ప్రాజెక్టులు రికార్డ్ టైమ్‌లో పూర్తి చేసి నిర్మాణ వ్యయం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఫేజ్ -1 విశాఖలో 46.23 కి.మి, విజయవాడలో 38 కి.మిల మెట్రో సివిల్ పనులకు అంతర్జాతీయ టెండర్లు పిలిచామని చెప్పారు. విశాఖ మెట్రో టెండర్లకు అక్టోబర్ 10, విజయవాడ మెట్రో టెండర్లకు అక్టోబర్ 14వ తేదీల వరకు గడువు పొడిగించినట్లు రామకృష్ణా రెడ్డి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భాగంగా మెట్రో రైలు మంజూరైన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి విశాఖ మెట్రో రైలుకు వంద శాతం నిధులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనిపై కేంద్ర పెద్దలు తర్జనభర్జన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించేంత వరకూ ప్రాజెక్టును పెండింగ్‌లో ఉంచకుండా ముందుకు నడిపించాలని రాష్ట్ర ప్రభుత్వం అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా మొదటి దశ పనులకు టెండర్లను ఆహ్వానించింది.
ఇవి కూడా చదవండి:
జమ్ము సరిహద్దులో పాకిస్తాన్ డ్రోన్ కదలికలు..బీఎస్ఎఫ్ గాలింపు చర్యలు