GST Rate Cut: జీఎస్టీ జోష్
ABN , Publish Date - Sep 22 , 2025 | 07:19 AM
దసరా నవరాత్రి ఉత్సవాలు.. దేశ ప్రజలకు ఈసారి సంబరాలు తెచ్చాయి. వస్తుసేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణలు సోమవారం నుంచే అమలులోకి రానున్నాయి. ఆహార పదార్థాల నుంచి గృహోపకరణాలు, బైక్‌ల నుంచి...
జీఎస్టీ జోష్!
నేటి నుంచి జీఎస్టీ ఉత్సవం ప్రారంభం కాబోతోంది. దేశంలో కొత్త చరిత్ర మొదలవుతోంది. సంస్కరణ అనేది నిరంతర ప్రక్రియ. కాలం మారుతున్న కొద్దీ, దేశ అవసరాల దృష్ట్యా కొత్త సంస్కరణలు అవసరం. అందుకే.. జీఎస్టీ 2.0ను ప్రవేశపెట్టి మరో చరిత్రకు నాంది పలికాం
ప్రధాని నరేంద్ర మోదీ
నేటి నుంచే పన్నుల తగ్గింపు అమలు
భారీగా తగ్గనున్న వస్తువుల ధరలు
నిత్యావసర వస్తువుల నుంచి కార్ల దాకా
ఔషధాల నుంచి టీవీల దాకా ధర తగ్గింపు
ఇప్పటికే తగ్గింపును ప్రకటించిన కంపెనీలు
తమ డీలర్లకు కొత్త ధరల పట్టిక చేరవేత
ధరల తగ్గుదలతో దేశ ప్రజల్లో హర్షాతిరేకాలు
శరన్నవరాత్రుల ప్రారంభం రోజే సంబరాలు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: దసరా నవరాత్రి ఉత్సవాలు.. దేశ ప్రజలకు ఈసారి సంబరాలు తెచ్చాయి. వస్తుసేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణలు సోమవారం నుంచే అమలులోకి రానున్నాయి. ఆహార పదార్థాల నుంచి గృహోపకరణాలు, బైక్‌ల నుంచి కార్లు, ఎయిర్ కండీషనర్ల నుంచి టీవీల దాకా అన్ని వస్తువుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ ఈ నెల మొదటి వారంలో ఆమోదించిన పన్ను శ్లాబుల తగ్గింపు ఆచరణలోకి రానుంది. ఇప్పటిదాకా 5, 12, 18, 28 శాతంతో నాలుగు శ్లాబులుగా అమల్లో ఉన్న జీఎస్టీ పన్ను.. పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసేలా ఇకపై 5, 18 శాతానికే పరిమితం కానుంది. హానికర వస్తువులకు మాత్రం 40 శాతం ప్రత్యేక పన్ను అమలు కానుంది. కాగా, ఎఫ్‌ఎంసీజీల నుంచి ఆటోమొబైల్స్ దాకా వివిధ కంపెనీలు జీఎస్టీ తగ్గుదలకు అనుగుణంగా తమ ఉత్పత్తుల ధరను తగ్గిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. దాదాపు 375 వస్తువుల ధరలు తగ్గనుండడంతో దేశ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.
ధరలు తగ్గే వస్తువులు ఇవే..
ఇప్పటిదాకా 12 శాతం పన్ను కలిగిన వివిధ నిత్యావసర వస్తువులు ఇకపై 5 శాతం పన్ను పరిధిలోకి రానున్నాయి. వాటిలో టూత్ పేస్టులు, సబ్బులు, షాంపూలతోపాటు బిస్కట్లు, స్నాక్స్, ఫ్రూట్ జ్యూస్‌లు వంటి ప్యాక్ చేసిన ఆహార పదార్థాల ధరలు తగ్గనున్నాయి. ఇవే కాకుండా.. నెయ్యి, ఘనీభవించిన పాలు వంటి డెయిరీ పదార్థాలు, సైకిళ్లు వంటి వాహనాలు, స్టేషనరీ సామగ్రి, రూ.2500 కన్నా తక్కువ ధర కలిగిన పాదరక్షల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. ఇక ఇప్పటిదాకా 28 శాతం జీఎస్టీ పరిధిలో ఉన్న గృహోపకరణాలు, ఎలకా్ట్రనిక్ పరికరాలు ఇకపై 18 శాతం పన్ను పరిధిలోకి రానున్నాయి. వీటిలో..ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, డిష్ వాషర్లు, టెలివిజన్లు, సిమెంటు (ప్రత్యేకించి ఇళ్ల నిర్మాణానికి), ఆటోమొబైల్ రంగంలో 1200 సీసీ కన్నా తక్కువ కలిగిన చిన్న కార్లు, ద్విచక్ర వాహనాల ధరలు భారీగా తగ్గనున్నాయి.
ధర తగ్గని వస్తువులు..
జీఎస్టీ సంస్కరణలతో ధరలు తగ్గని వస్తువులు కూడా ఉన్నాయి. హానికర వస్తువులు 40 శాతం పన్ను పరిధిలోకి వస్తాయని జీఎస్టీ మండలి ఇప్పటికే ప్రకటించింది. దీని ప్రకారం.. పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాల్, పాన్ మసాలా వంటి వస్తువుల ధరలు మరింత పెరగనున్నాయి. వీటితోపాటు ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్‌ఫారాలకు పన్ను పెరగనుంది. ఇక పెట్రోలియం ఉత్పత్తులు ప్రస్తుతం జీఎస్టీ పరిధిలో లేనందున వాటి ధరల్లో ఎటువంటి మార్పు ఉండబోదు. వజ్రాలు, ప్రెషియస్ స్టోన్స్ వంటి లగ్జరీ వస్తువుల రేట్లు కూడా అలాగే కొనసాగనున్నాయి.
ధరలు తగ్గించిన కంపెనీలు..
జీఎస్టీ సంస్కరణలు సోమవారం నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో వాటి పరిధిలోకి వచ్చే వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థలు.. ఆయా వస్తువుల ధరను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. వీటిలో టెలివిజన్ కంపెనీలు, ఆటోమొబైల్ కంపెనీల వంటివి ఉన్నాయి. 32 ఇంచుల కన్నా పెద్దసైజు టీవీలకు జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతం పరిధిలోకి తేవడంతో టీవీ కంపెనీలు కూడా అందుకు అనుగుణంగా ధరను తగ్గించాయి. దీంతో సైజును బట్టి వివిధ రకాల టీవీల ధర రూ.2500 నుంచి రూ.85 వేల దాకా తగ్గనుంది.
రూ.లక్షకు పైగా తగ్గిన కార్ల ధర..
జీఎస్టీ సంస్కరణలకు అనుగుణంగా కార్లు, బైక్‌ల ధరలు భారీగా తగ్గనున్నాయి. మారుతి సుజుకి, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్ల తయారీ సంస్థలు ఇప్పటికే తాము ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి.. తమ వాహనాల ధరలను సుమారు రూ.1.29 లక్షల దాకా తగ్గించింది. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తమ కార్ల ధరలను తగ్గిస్తున్నట్లు గతంలోనే ప్రకటించింది. ఈ నెల మొదటివారం జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం వెలువడిన రోజే తమ ప్యాసింజర్ వాహనాల ధరలను రూ.1.56 లక్షల దాకా తగ్గిస్తున్నట్లు పేర్కొంది. ఈ కంపెనీ కనిష్ఠంగా బొలెరో/నియో రేంజ్ ధరను రూ.1.27 లక్షలు, గరిష్ఠంగా ఎస్‌యూవీ టక్సన్ ప్రీమియం ధరను రూ.2.4 లక్షలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక హోండా కంపెనీ తమ సిటీ కారు ధరను రూ.57,500 తగ్గించగా, కియా ఇండియా ఏకంగా రూ.4.48 లక్షల దాకా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కాగా, టొయోటా కిర్లోస్కర్ కారు ధర రూ.3.49 లక్షల దాకా తగ్గనుంది. మరోవైపు లగ్జరీ కారు మెర్సిడెస్ బెంజ్ ధరను ఏ-క్లా్‌సకు రూ.2 లక్షలు, ఎస్-క్లా్‌సకు రూ.10 లక్షల దాకా తగ్గిస్తున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. ఇక బీఎండబ్ల్యూ అయితే అత్యధికంగా రూ.13.06 లక్షల తగ్గింపును ప్రకటించడం గమనార్హం. ఆడి కంపెనీ కార్లు రూ.2.6 లక్షల నుంచి రూ.7.8 లక్షల దాకా తగ్గింపుననకు రానున్నాయి. జాగ్వార్ ల్యాండ్ రోవర్ సైతం గరిష్ఠంగా రూ.30.4 లక్షల దాకా ధర తగ్గించింది.
నిత్యావసరాలు ఇక అగ్వ..
జీఎస్టీ సంస్కరణల కారణంగా దేశ ప్రజలకు నిత్యావసర వస్తువులు అగ్వకు రానున్నాయి. పలు కంపెనీలు తమ ఉత్పత్తుల ధరను తగ్గిస్తున్నట్లు పేర్కొంటూ కొత్త ధరల పట్టికను విడుదల చేశాయు. సబ్బులు, షాంపూలు, బేబీ డైపర్స్, టూత్ పేస్టులు, రేజర్లు, లోషన్లతోపాటు స్నాక్స్, నమ్‌కీన్, భుజియా నుంచి స్వీట్ల దాకా, కాఫీ, టీ, బట్టర్, నెయ్యి, ఐస్‌క్రీమ్, చాక్లెట్లు వంటి వాటి ధరలను సవరిస్తూ కొత్త ఎమ్మార్పీ ట్యాగ్‌లను ఆయా కంపెనీలు తమ డిస్ట్రిబ్యూటర్లకు, కిరాణా స్టోర్లు, ఈ-కామ్‌లకు పంపించాయి. డాబర్, ఐటీసీ, పీఅండ్‌జీ, ఇమామి, అమూల్ వంటి కంపెనీలు తమ ఉత్పత్తుల ధరల తగ్గింపునకు సంబంధించిన వివరాలను తమ వెబ్‌సైట్లలో పేర్కొన్నాయి. ప్రకటనలు ఇచ్చాయి.
బైక్‌ల ధర రూ.19 వేల దాకా తగ్గింపు..
ద్విచక్ర వాహనాల ధరలు కూడా గణనీయంగా తగ్గనున్నాయి. హీరో కంపెనీ బైక్‌లు, స్కూటర్ల ధరలను రూ.15,743 దాకా తగ్గించగా, హోండా కంపెనీ 350 సీసీ వాహనాల వరకు రూ.18,800 దాకా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
చౌకగా ఔషధాలు..
జీఎస్టీ రేట్ల తగ్గింపుతో ఔషధాలు, వైద్య పరికరాలు ఇకపై చౌకగా లభించనున్నాయి. ఇదివరకు 12 శాతం జీఎస్టీ పరిధిలో ఉన్న అత్యధిక ఔషధాలు ఇప్పుడు 5శాతం పరిధిలోకి రానున్నాయని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ ప్రధాన కార్యదర్శి సుదర్శన్ జైన్ తెలిపారు. అంతేకాకుండా.. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడే 36 రకాల మందులకు పన్నును పూర్తిగా ఎత్తివేసినట్లు పేర్కొన్నారు.
షాపుల్లో ధరల తగ్గింపు బోర్డులు
ధరలు తగ్గిన వస్తువులకు సంబంధించి ఆయా దుకాణాలు, షోరూంలలో బోర్డులు ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గింపుతో వస్తువుల ధరలను ఏ మేరకు తగ్గించారన్నదీ అందులో తెలియజేయాల్సిందిగా కోరారు. మరోవైపు ఇప్పటికే పాత ధరలతో ఉన్న వస్తువులకు ధరలు తగ్గితే.. కొత్త ధరతో స్టిక్కర్ అంటించాల్సిందిగా సూచించారు.
ఇవి కూడా చదవండి..
జీఎస్టీ సంస్కరణలతో ఆత్మనిర్భరత... శరవేగంగా వృద్ధి
దేశ ప్రజలకు ప్రధాని గుడ్ న్యూస్.. ఇక జీఎస్టీ ఉత్సవ్ ప్రారంభం
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి